November 22, 2024
SGSTV NEWS
Spiritual

అజ్ఞానాన్ని తొలగించే దక్షిణామూర్తి

దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడిచెవికి మకరకుండలం ఎడమ చెవికి “తాటంకం’ అలంకారాలుగా కనిపిస్తాయి. మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం. తాటంకం స్త్రీల అలంకృతి, దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి. ఈ రెండు అలంకారాలు. సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా…ఈ విషయాన్నే లలితాసహస్రంలో దక్షిణామూర్తి రూపిణీ | సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ” అని వివరిస్తోంది.


దక్షిణామూర్తి ఉత్తరాభిముఖులై ఉంటారు. ఉత్తరం జ్ఞానదశ. ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి వెనుక భాగాన దక్షిణదిశ అంటే మృత్యు దిశ. దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో, వారు మృత్యువుని చూడరు. యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు ‘నిఘా’, వేస్తుంది. అజ్ఞానమే మృత్యువని ఉపనిషత్తు చెప్తుంది. ఆత్మ స్వరూపాన్ని ఎరుగకపోవడమే మృత్యువు. యముడిని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి, దక్షిణ’ అంటే ‘దాక్షిణ్య భావం’.
ఏ  దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనవుతుందో ఆ ‘దయ’ను ‘దాక్షిణ్యం’ అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి  భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖవిమోచనం. ఆ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి.  వసిష్టుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకొని బ్రహ్మవిద్యను పొందాడు.

వసిష్ఠునకు దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే ‘శ్రీకాళహస్తి’. అందుకే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహం కనబడుతుంది. ఇది జ్ఞానప్రధాన క్షేత్రం, ఇక్కడి శక్తి పేరు కూడా జ్ఞాన ప్రసూనాంబ కావడం గమనార్హం. ఓ రుద్రా! నీ దక్షిణ ముఖంతో నిత్యం మమ్ము రక్షించు’ అని ఉపనిషత్తు దక్షిణామూర్తిని ప్రార్థించింది.పరమ జ్ఞానమూర్తియైన ఈ ఆది గురువును స్తుతిస్తూ ఆదిశంకరులు రచించిన దక్షిణామూర్తి సోత్రము బహుళ ప్రసిద్ది చెందింది.

” గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్! నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ:

దక్షిణామూర్తి సకల జగద్గురు మూర్తి కనుక – స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా – బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం.

Also read

Related posts

Share via