November 25, 2024
SGSTV NEWS
CrimeTelangana

ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ సంచలన విషయాలు వెల్లడి..

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు సమాజం మొత్తానికి హాని కలిగించేలా ప్రవర్తించారన్నారు హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. ఇప్పటి వరకు ఫోన్ టాపింగ్ కేసులో నలుగురు అరెస్ట్ అయ్యారు. ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధా కిషన్ రావులను ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణకు వచ్చిన వీరు ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే వీరిని అరెస్టు చేసినట్టు స్పష్టం చేశారు. త్వరలో రిటైర్డ్ ఐజిని అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐజి ప్రస్తుతం హైదరాబాదులో లేరని, ఆయన ఎక్కడున్నా సరే త్వరలో రప్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రిటైర్డ్ ఐజిపై ఇప్పటివరకు ఎలాంటి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే ఆ ప్రక్రియ సైతం జరుగుతుందని చెప్పారు. ఫోన్ టాపింగ్ వ్యవహారం అన్ని కేసుల లాగా కాదని అన్నారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంపై అరడజన్ ప్రెస్‎నోట్‎లు ఇచ్చామని, ప్రస్తుతం ఈ కేసు గురించి లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని నిందితులు ఎవరైనా సరే తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు.

రెడ్ కార్నర్ నోటీసు అంశంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వలేదని ఆయన తెలిపారు. కొంతమంది ఇప్పటికే రెడ్ కార్నర్ నోటిస్ ఇచ్చారని ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. అలా ప్రచారం చేస్తే నిందితులు అలర్ట్ అయ్యి రెమెడీస్‎ను కనుగొనే అవకాశం ఉందని శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంపై సరైన సమయంలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు అరెస్టు అయ్యారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఈ నలుగురు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీరిపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు సైతం పోలీసులు నమోదు చేశారు. దీనిపై నాంపల్లి కోర్టులో ఇప్పటికే మెమో దాఖాలు చేశారు. ఐటీ ఆక్ట్ సెక్షన్ 66 (f) ను నలుగురు నిందితులకు అటాచ్ చేశారు. ఈ సెక్షన్ కనుక రుజువైతే జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.

Also read

Related posts

Share via