November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ.. ఎలా జరిగిందంటే..

ఏప్రిల్ 18న మిట్టమధ్యాహ్నం రెండు గంటల సమయం.. ఎండవేడికి జనం పలుచగా ఉన్నారు. సరిగ్గా ఇదే అదునుగా భావించి ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఓ పెట్రోల్‌ బంక్‌ ఆవరణలో ఏటియంలలో క్యాష్‌ నింపే సిఎంఎస్‌ ఏజెన్సీకి చెందిన వ్యాన్‌ వచ్చి ఆగింది. ఆ వ్యానులో 68 లక్షల నగదు ఉంది. భోజనం సమయం కావడతో క్యాష్‌ ఉన్న వ్యానులోని సిబ్బంది ఎప్పటిలాగే పెట్రోల్‌ బంక్‌ ఆవరణలో వ్యానును నిలిపి ఏటియం సెంటర్‌ వెనుక వైపు లంచ్‌ బ్రేక్‌ కోసం వెళ్ళారు. భోజనం చేసి తిరిగి వచ్చి చూస్తే వ్యానులో క్యాష్‌ మాయం అయింది. అంటే సినీ ఫక్కీ తరహాలో భారీ చోరీ జరిగిందన్నమాట. దీంతో వెంటనే అప్రమత్తమైన వ్యాను సిబ్బంది, సిఎంఎస్‌ ఏజెన్సీ లోకల్‌ మేనేజర్‌ కొండారెడ్డితో పాటు పోలీసులకు సమాచారం అందించారు.

ఫిర్యాదు ఏమని ఇచ్చారు..
సీఎంఎస్‌ ఏజెన్సీకి చెందిన వాహనం నుంచి 66 లక్షలు ఎత్తుకెళ్ళినట్టు సంస్థ లోకల్‌ మేనేజర్‌ కొండారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒంగోలు కర్నూలు రోడ్డుని ఓ పెట్రోల్‌ బంక్‌లో ఉన్న ఏటిఎంలో డబ్బులు నింపేందుకు సిఎంఎస్‌ ఏజెన్సీకి చెందిన వాహనంలో 68 లక్షలు తీసుకొచ్చారు నలుగురు సిబ్బంది. మధ్యాహ్నం రెండు గంటలు కావడంతో వాహనాన్ని పెట్రోల్‌ బంక్‌లోనే ఉంచి భోజనం చేసేందుకు పెట్రోల్‌ బంక్‌ వెనుకకు వెళ్ళారు. ఇదే అదునుగా భావించిన దొంగ వాహనం దగ్గరకు వచ్చాడు. వాహనం డోర్‌ మధ్యలో ఉన్న హోల్‌లో నుంచి చెయ్యిపెట్టి లాక్‌ తెరిచి లోపలికి ప్రవేశించాడు. ఏటిఎంలో ఉంచేందుకు తీసుకొచ్చిన రూ.68 లక్షలు అక్కడే ఉన్న బ్యాగులో రూ.66 లక్షలు సర్దుకున్నాడు. మిగిలిన 2 లక్షలను అక్కడే వదిలేసి దర్జాగా మరో డోర్‌ నుంచి బయటకు వచ్చాడు. ఎంచక్కా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. భోజనాలు చేసిన అనంతరం వాహనం దగ్గరకు వచ్చి డోర్‌ తీసిన సిబ్బందికి క్యాష్‌ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారని ఎఫ్ఐఆర్‎లో పేర్కొన్నారు.

ఇంటి దొంగల ప్రమేయంపై అనుమానం..
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్లూస్‌ టీం ద్వారా వ్యానులో చోరీ జరిగిన తీరును పరిశీలించారు. వ్యాను హాండిల్‌, లోపల నిందితుడి వేలిముద్రలు సేకరించారు. చోరీ జరిగిన విధానం చూస్తే ఎవరో వాహనాన్ని కొంతకాలంగా ఫాలో అవుతూ వచ్చి పక్కాగా రెక్కీ నిర్వహించి చోరీ చేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే వాహనంలో వచ్చిన సిఎంఎస్‌ సిబ్బందిలోనే కొంతమంది సహకారం కూడా ఉండవచ్చన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పెట్రోల్‌ బంక్‌లో ఉన్న సిసి కెమెరాలో నిందితుడు చోరీ చేసిన అనంతరం వాహనం నుంచి దిగి వెళ్ళిపోయే దృశ్యాలు రికార్డు కావడంతో విజువల్స్‌ను పోలీసులు పరిశీలించారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఘటన జరిగిన రోజు క్రైం ఏఎస్పీ శ్రీధర్‌ తెలిపారు.

కంచే చేను మేసింది..
ఈ చోరీ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్రైం ఏసీపీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఏటిఎం సెంటర్లలో క్యాష్‌ పెట్టేందుకు హోంసెక్రటరీ నుంచి సెక్యూరిటీ సంస్థలు అనుమతి తీసుకుని ఈ క్యాష్‌ నింపే పని చేయాలి. సిఎంఎస్‌ సంస్థ అనుమతులు కూడా తీసుకున్నారు. 2019లో రూపొందించిన సెక్యూరిటీ మాన్యువల్ ప్రకారం క్యాష్‌ తీసుకుని వచ్చే వ్యాన్‌లలో ఇద్దరు ఆయుధాలు కలిగిన ఆర్మ్‌డ్‌ సిబ్బంది ఉండాలి. టీ, లేదా భోజనం చేయాలనుకుంటే వ్యాను దగ్గర కనీసం ఒక్కరైనా ఆర్మ్‌డ్‌ గార్డ్‌ ఉండాలి. డబ్బులు కూడా ఒకే బాక్స్‌లో కాకుండా రెండు బాక్సులో ఉంచి తాళాలు వేయాలి. వ్యానులో సిసి కెమెరాలు పెట్టాలి. అయితే ఈ నిబంధనలు ఏవీ వ్యానులో ఉన్న నలుగురు సిబ్బంది పాటించలేదని పోలీసులు గుర్తించి సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేశారు.

అంతే కాకుండా పెట్రోల్‌ బంక్‌లో దొరికిన సిసి కెమెరా ఇమేజ్‌లో ఉన్న వ్యక్తి గతంలో ఇదే సంస్థలో పనిచేసి మానేసిన మహేష్‌గా గుర్తించారు. అతడ్ని పట్టుకుని విచారించారు. తానే రూ.66 లక్షలు చోరీ చేసినట్టు ఒప్పుకోవడంతో డబ్బు మాయం అయిన 20 గంటల్లోనే కేసు చిక్కుముడి వీడిపోయింది. తాను చోరీ చేసేందుకు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంస్థ మేనేజర్‌ కొండారెడ్డి, సిబ్బందిలోనే మరో వ్యక్తి సాయం చేసినట్టు నిందితుడు మహేష్‌ ఒప్పుకోవడంతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. డబ్బుకు రక్షణగా ఉండాల్సిన మేనేజర్‌ కొండారెడ్డి, నిందితుడు మహేష్‌కు సాయం చేసి చోరీ చేసేందుకు వెసులుబాటు కల్పించి అనంతరం వాటాలు పంచుకునేందుకు ప్లాన్‌ చేసినట్టు గుర్తించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకాశంజిల్లా ఎస్పీ సుమిత్‌ సునీల్‌ వివరించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి చోరీకి గురయిన మొత్తం సొమ్ము రూ.66 లక్షలను 20 గంటల్లో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Also read

Related posts

Share via