November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

హోటల్లో రూ.6.67 కోట్ల పట్టివేత.ఎన్నికల కోసమేనని పోలీసుల అనుమానం

ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి కొన్ని గంటల ముందు కరీంనగర్ లోని ప్రతిమ హోటల్లో దాచి ఉంచిన రూ.6.67 కోట్లను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు.

కరీంనగర్ : ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి కొన్ని గంటల ముందు కరీంనగర్లోని ప్రతిమ హోటల్లో దాచి ఉంచిన రూ.6.67 కోట్లను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కరీంనగర్ పట్టణ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం శనివారం తెల్లవారుజామున ఈ ఆకస్మిక తనిఖీలను చేపట్టింది. బహుళ అంతస్తుల్లో ఉన్న హోటల్లోని అన్ని గదుల్లో సోదాలు నిర్వహించింది. చివరకు సెల్లార్లో ఉన్న ఓ గదిలో అట్ట పెట్టెల్లో, బీరువాలో నిల్వ ఉంచిన నగదును పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేని ఈ నగదును స్థానిక రెవెన్యూ అధికారుల సమక్షంలో వీడియోలు తీసి, పంచనామా నిర్వహించి స్వాధీన పర్చుకున్నారు. తరువాత ఐటీ శాఖకు సమాచారం అందించడంతో హైదరాబాద్ నుంచి 10 మంది అధికారులు కరీంనగర్ ఒకటో పట్టణ ఠాణాకు వచ్చి హోటల్ మేనేజర్ సహా సిబ్బందిని పిలిపించి ఆధారాలు అడిగినట్లు తెలిసింది.



హోటల్ కు సంబంధించిన నగదు అని వారు చెప్పినా ఆధారాలు చూపించాలని కోరినట్లు సమాచారం. ఈ నగదును స్థానిక పోలీసులు ఐటీ అధికారులకు అప్పగించారు. ఏసీపీ నరేందర్తో పాటు ముగ్గురు సీఐలు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 30 మంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ముందురోజే తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హోటల్.. ఒక ప్రధాన పార్టీ నాయకుడి సోదరుడు, ఇతర బంధువుల భాగస్వామ్యంతో నడుస్తుండడం గమనార్హం.

Also read

Related posts

Share via