SGSTV NEWS online
Spiritualకార్తీకపురాణం

కార్తీక పురాణం 13వ రోజు



Karthika Puranam Day 13

కార్తీక ఉపనయన, కన్యాదాన మహిమ; కన్యను అమ్మిన సువీరుని పాపం బాపి శ్రుతకీర్తి కన్యాదానంతో పితరులను ఉద్ధరించడం.

శివ సన్నిధి దర్శనం

వసిష్ఠుడు జనక నృపాలుడితో ఇలా అన్నాడు: “నృపాలా! కార్తీక మాస ధర్మాలనూ, మిగిలిన ముఖ్య ధర్మాలనూ చెప్తాను. నీవు సావధానంగా విను. సంసార భయానికి భయపడినవాడికీ, పాపాలకు భయపడినవాడికీ మా తండ్రి అయిన బ్రహ్మ కార్తీక మాసంలో ఏయే ధర్మాలను తెలిపాడో, అవన్నీ తెలియజేస్తాను. ఆ ధర్మాలన్నీ తప్పక ఆచరించదగినవి. అలా ఆచరించకపోతే తప్పక విషాదం కలుగుతుంది. కార్తీకంలో కన్యాదానం, తులాస్నానం, సదాచారుడైన కుమారుడికి ఉపనయనం (ఒడుగు) చేయించడం, విద్యాదానం, వస్త్రదానం, అన్నదానం శ్రేష్ఠమైనవి. పేదవాడైన బ్రాహ్మణ కుమారుడికి ఉపనయనానికి కావలసిన సమస్త వస్తువులనూ ఇచ్చి, దక్షిణలు ఇచ్చిన మానవుడి సమస్త పాపాలూ నశిస్తాయి. గాయత్రీ ఉపదేశం కోసం ధనం ఇచ్చేవాడికి కలిగే పుణ్యాన్ని వివరిస్తాను, విను. ఓ నృపాలా! అగమ్యాగమనం (చేరకూడని స్త్రీలను చేరడం) మొదలైన పాపాలూ, బ్రాహ్మణ హత్య మొదలైనవీ, ఇంకా అనేకమైన ఘోర పాపాలూ భస్మమై పోతాయి. గాయత్రీ జపం చేయడం, దేవపూజ చేయడం, వేదాధ్యయనం చేయడం, వీటివల్ల కలిగే పుణ్యం ఇంత అని చెప్పడం సాధ్యం కానిది. పదివేల కోనేళ్ళు కట్టించడం, నూరు రావిచెట్లు నాటించడం, బావులు, నడబావులు (మెట్లున్న బావులు) కోట్లకొద్దీ తవ్వించడం, నందనవనాన్ని పాలించడం, వీటివల్ల కూడా గాయత్రీ ఉపదేశం చేయించడం వల్ల వచ్చే పుణ్యం రాదు.”


“మాఘ మాసంలోనూ, వైశాఖ మాసంలోనూ, కార్తీకంలోనూ ఉత్తమమైన ఉపనయన దానాన్ని వేదవేత్తలైన సాధు బ్రాహ్మణుల కుమారులకు శాస్త్రప్రకారంగా ఎవరు చేస్తారో, వారికి విస్తారమైన ఫలం కలుగుతుందని ధర్మం తెలిసిన మునులు చెప్తారు. కార్తీక మాసంలో అటువంటి సాధు బ్రాహ్మణులకు ఉపనయనం చేయించడం వల్ల కలిగే పుణ్యం ఇంత అని చెప్పడానికి స్వర్గ భూలోకాలలో ఎవరికీ సాధ్యం కాదు.”

“ఉపనయన దానం తీర్థయాత్ర చేయడం, దేవతలనూ బ్రాహ్మణులనూ సంతృప్తిపరచడం, వీటివల్ల కలిగే ఫలాన్ని ఇస్తుంది. ఓ మేదినీశ్వరా! కార్తీక మాసంలో ఉపనయన దానం, కన్యాదానం మేర లేని ఫలాన్ని ఇస్తాయి. కార్తీక మాసంలో ఎవడు ధనం ఇచ్చి భక్తితో కన్యాదానం చేయిస్తాడో, అతడు సమస్త పాపాల నుండీ విముక్తుడై పితృదేవతల స్థానాన్నీ, బ్రహ్మపదాన్నీ పొందుతాడు. ఓ రాజేంద్రా! ఆ విషయానికి సంబంధించిన ఒక ఇతిహాసం (పూర్వకథ) ఉంది. దానిని నీకు చెప్తాను. నీవు భక్తితో కూడి, సావధానంగా విను.”


ద్వాపరయుగంలో వంగదేశంలో సువీరుడు అనే పేరు గల దురాత్ముడైన క్షత్రియుడు ఒకడు ఉండేవాడు. అతడు గొప్ప బలపరాక్రమాలు కలవాడు. అతడికి చిరుతజింక కన్నుల వంటి కన్నులు గల భార్య ఉండేది. అతడు విధివశాత్తూ దాయాదుల మూలంగా రాజ్యాన్ని కోల్పోయి అరణ్యంలోకి ప్రవేశించాడు.


అలా సువీరుడు అడవిలోకి ప్రవేశించి, అర్ధాంగి అయిన భార్యతో కూడి, ధనహీనుడు కావడంతో మిక్కిలి దుఃఖిస్తూ చొరరాని అరణ్యంలో తిరుగుతున్నాడు. ఆ సమయంలో ఆ రాజు భార్య గర్భిణి అయి ఆకులూ అలములూ తింటూ శ్రమపడుతున్నది. ఆ సువీరుడు నర్మదా నదీ తీరంలో ఒక ఆకుటింటిని (పర్ణశాలను) నిర్మించాడు. రాజపత్ని అక్కడ ఒక కన్యను కన్నది. ఆ రాజు తన పూర్వపాపాన్ని తలచుకుంటూ ఆ కన్యను పెంచుతున్నాడు. ఆ కన్య కూడా తన పూర్వపుణ్యం వల్ల రూపలావణ్యాలు కలదై చూసేవారికి కన్నులపండువుగా పెరిగింది. బాలచంద్రుడిలా ప్రకాశించే చక్కని ఎనిమిదేళ్ళ ఆ రాజపుత్రికను చూసి ఒక మునిపుత్రుడు తాను పెళ్ళాడగోరి, తనకు ఆ కన్యను ఇవ్వమని ఆ కన్య తండ్రిని అడిగాడు.



ఆ నృపాలుడు “మునిపుత్రా! నేను ధనహీనుడిని. నీవు నా కూతురిని పెళ్ళాడదలచుకుంటే, నేను కోరే ధనాన్ని ఇవ్వు” అన్నాడు. రాజు చెప్పిన ఆ మాటను విని మునిపుత్రుడు “రాజా! నా తపోమహిమ వల్ల నీకు ఒక అందమైన గృహాన్ని ఇస్తాను. ఆ గృహవాసం వల్ల నీకు సమస్త సౌఖ్యాలూ కలుగుతాయి. ఇది నిస్సంశయం” అనగానే, రాజు సంతోషంతో “అలాగే” అని ఒప్పుకున్నాడు. అప్పుడు మహాజ్ఞాని అయిన ఆ మునిపుత్రుడు నర్మదా నదీ తీరంలో తపస్సు చేసి, ఆ రాజు ఉండే చోట సమస్త సంపదలూ కలిగేలా చేసి, ఆ సంపదలన్నిటినీ ఆ రాజుకు ఇచ్చాడు.


ఆ మునిపుత్రుడు ఇచ్చిన ధనరత్నాలను గ్రహించి, రాజు సంతోషంతో కోరిక తీరినవాడై, ఆ మునిపుత్రుడికి కన్యను ఇచ్చి శాస్త్రవిధి ప్రకారం వివాహం చేశాడు. కొత్త పెళ్ళికూతురైన రాజపుత్రి మునిపుత్రుడిని వెంబడించింది. ఆ రాజు కూతురిని అమ్మిన ధనంతో సంసారాన్ని పోషించుకోసాగాడు.

మళ్ళీ సువీరుడి భార్య గర్భవతి అయి మరొక కూతురిని కన్నది. ఆ నృపాలుడు రెండవది కూతురుగా పుట్టగానే, “దీనిని ఎవరికైనా ఇచ్చి ఓలి (కన్యాశుల్కం) తీసుకుంటాను. దానివల్ల నాకు విస్తారమైన ధనం సమకూరుతుంది” అని ఆలోచిస్తుండగా, అతడి పుణ్యవిశేషం వల్ల ఒక యతి (సన్యాసి) స్నానం కోసం నర్మదా నది దగ్గరికి వచ్చి, ఆ నదీ తీరంలో పర్ణశాలలో భార్యాసమేతుడై ఉన్న రాజును చూశాడు. దయాసముద్రుడూ, కౌండిన్య గోత్రంలో పుట్టినవాడూ అయిన ఆ యతి “ఓ రాజా! నీవు ఎందుకు ఈ అడవిలో భార్యతో నివసిస్తున్నావు? నీవు ఎవడివి? నాకు తెలియజేయి” అన్నాడు. అప్పుడు ఆ రాజు దయాళువైన మునీంద్రుడితో ఇలా అన్నాడు: “ఓ మునీంద్రా! నేను వంగదేశపు రాజును. నన్ను సువీరుడు అంటారు. నా రాజ్యాన్ని దాయాదులు లాక్కొని నన్ను అడవులపాలు చేశారు. లోకంలో పేదరికానికి సాటియైన దుఃఖం, పుత్రనాశనాన్ని మించిన విచారం, ప్రియురాలి విరహాన్ని మించిన వియోగం లేవు. కనుక రాజ్యం పోయిన దుఃఖంతో ఇక్కడ నదీ తీరంలో వనవాసం చేస్తూ, ఆకులు, దుంపలు, పండ్లు మొదలైనవాటితో జీవయాత్ర సాగిస్తున్నాను. ఈ అడవిలో ఈ పర్ణశాలలో నాకు ఒక కూతురు పుట్టింది. ఆ కన్యకు యౌవనం రాగా, దానిని ఒక మునికుమారుడికి ఇచ్చి, విస్తారమైన ఓలి తీసుకొని, ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నాను. ఇంకా తమరు నా వలన ఏమి వినగోరుతున్నారు?” అని అడిగాడు.

ఆ రాజు మాటలు విని యతి మళ్ళీ అతడితో ఇలా అన్నాడు: “ఓ రాజా! మూఢుడిలా ఎందుకు పాపపు రాశిని మూటగట్టుకుంటావు? ఎవడు కన్యావిక్రయం (కన్యను అమ్మడం) వల్ల వచ్చిన ధనంతో జీవిస్తాడో, వాడు అసిపత్రం అనే నరకాన్ని పొందుతాడు. ఎవడు కన్య వల్ల వచ్చిన ధనంతో దేవతలనూ, ఋషులనూ, పితరులనూ (పూర్వీకులనూ) సంతృప్తిపరచాలని చూస్తాడో, వాడికి ఆ దేవతలూ, ఋషులూ, పితరులూ జన్మజన్మలోనూ సంతానలేమిని ఇస్తారు. ఎవడు కన్యావిక్రయ ధనంతో మలినమైన వృత్తిని జీవించడానికి ఆశ్రయించాలని చూస్తాడో, అతడు రౌరవం మొదలైన సమస్త పాపాలనూ పొందుతాడు.”


“లోకంలో పండితులకు సమస్త పాపాలకూ ప్రాయశ్చిత్తాలు తెలుసు గానీ, కన్యావిక్రయం చేసే స్వభావం గలవాడికి ప్రాయశ్చిత్తం ఎక్కడా విధించబడలేదు. కార్తీక శుక్లపక్షంలో నీ రెండవ కూతురిని హిరణ్య జల పూర్వకంగా (బంగారం, నీటితో కూడి) ప్రకాశవంతుడూ, తేజస్సు కలవాడూ, ధర్మశీలుడూ అయిన బ్రాహ్మణుడికి దానం చేయి. కార్తీక మాసంలో శుభదినాన ఎవడు కన్యాదానం చేస్తాడో, వాడికి గంగ మొదలైన పుణ్యనదులలో స్నానం చేయడం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో, పరిపూర్ణ దక్షిణలు గల అశ్వమేధం మొదలైన యాగాలు చేయడం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో, అంత పుణ్యం కన్యాదానం వల్ల కలుగుతుంది.” ఇలా పలికిన యతిని చూసి దీనుడైన నృపాలుడు ఇలా అన్నాడు.


“ఓ విప్రుడా! లోకం ఎక్కడిది? ధర్మం ఎక్కడిది? దానం ఎందుకు? దానఫలం ఎందుకు? ఓ విప్రా! సుఖాలను కోరే ఈ దేహానికి సుఖభోగాలు లేకపోవడం వల్ల ఏమి ఉపయోగం? పుత్రులూ భార్యా, వస్త్రాభరణాలు, ఇళ్ళు వాకిళ్ళు, మడి మాన్యాలు దేహానికి కావలసిన ధర్మాలకు సాధనాలే గానీ వేరు కావు. కనుక నా రెండవ పుత్రికను కూడా విస్తారమైన ధనం ఇచ్చేవాడికే ఇస్తాను. ఓ యతీ! నీవు నాకు ఈ విషయాలు ఉపదేశించనక్కరలేదు. నీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళు” అని రాజు పలికాడు. యతి స్నానం కోసం నర్మదా నదీ తీరానికి వెళ్ళాడు.


తర్వాత కొంతకాలానికి రాజుకు మరణకాలం వచ్చి మరణించాడు. అప్పుడు యమదూతలు వచ్చి పాపి అయిన ఈ రాజును పెడరెక్కలు విరిచికట్టి దక్షిణ దిక్కుకు యమసన్నిధికి తీసుకొనిపోయారు.


యముడు వాడిని నిలువెల్లా చూసి, కన్నులు ఎర్రబరిచి, వాడిని నరకబాధలలో పెట్టాడు. ఘోరమైన అసిపత్రంలో పితరులతో కూడా తోశాడు. ఆ సువీరుడి వంశంవాడైన శ్రుతకీర్తి అనే మహీపాలుడు సమస్త ధర్మాలనూ నూరు జన్మలలో ఆచరించాడు. తన రాజ్యాన్ని నీతితో పాలించాడు. ఆ తర్వాత స్వర్గాన్ని పొంది దేవతలచే కొలవబడుతూ ఉన్నాడు.


సువీరుడి వంశస్థుడైన శ్రుతకీర్తి తన కర్మశేషం (మిగిలిన కర్మఫలం) చేత పితరులతో పాటు నరకాన్ని పొంది, అక్కడ కష్టపడుతూ నరకబాధలకు కారణం గురించి చింతించాడు. తర్వాత పూర్వపుణ్య మహిమ చేత మిక్కిలి భయం లేనివాడై యముడితో ఇలా అన్నాడు: “ఓ సర్వజ్ఞా! మహాబుద్ధీ! ధర్మరాజా! పాపం కొంచెమైనా లేని నాకు ఎందుకు ఈ నరకప్రాప్తి కలిగింది? పూర్వపు మహర్షులు పలికిన సమస్త ధర్మాలూ వృథా అవుతున్నాయి. నేను స్వర్గాన్ని విడిచి నరకానికి రావడం యుక్తం కాదు” అన్నాడు. ఆ మాటలు విని యముడు మహారాజైన శ్రుతకీర్తితో ఇలా అన్నాడు.


“ఓ నృపాలా! మీ వంశస్థులలో ఒకడూ, దురాచారుడూ అయిన సువీరుడు అనేవాడు కన్యావిక్రయం వల్ల దొరికిన ధనంతో తన జీవితాన్ని గడిపాడు. ఆ దురాచారం వల్ల అతడి పితరులు స్వర్గలోకాన్ని పొంది కూడా, అక్కడి నుండి ఇక్కడికి భ్రష్టులై భూలోకంలో దుష్టయోనులలో (నీచజన్మలలో) పుడతారు.”


“అతడి రెండవ కుమార్తె నర్మదా తీరంలో తల్లి దగ్గర పెరుగుతున్నది. నా అనుగ్రహం వల్ల ఈ దేహంతోనే భూలోకానికి వెళ్ళు. అక్కడ అనేకమంది మహర్షులు ఉన్నారు. వారికి ఈ సంగతి తెలియజేయి. ఆ కన్యను వేదాధ్యయన సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడికి సాలంకృత కన్యాదానం (అలంకారాలతో కూడిన కన్యాదానం) చేయి. ఎవడు సమస్త ఆభరణాలతో అలంకరించబడిన కన్యను కార్తీక మాసంలో కన్యాదానం చేస్తాడో, అతడు లోకాలన్నిటికీ అధిపతి అవుతాడు. ఒకడికి కన్య పుట్టకపోతే దాని విలువ ఇవ్వాలి. ఆవునూ, ఎద్దునూ కన్యాదానం విలువ అంటారు. ఆవునూ, ఎద్దునూ కూడా దానం చేస్తే, కన్యాదానం చేసిన ఫలం కలుగుతుంది. నీవు బ్రాహ్మణులకు కన్యాదాన మూల్యాన్ని యథావిధిగా ఇవ్వు. ఈ కన్యాదానం వల్ల పితరులందరూ సంతోషిస్తారు.” శ్రుతకీర్తి “అలాగే” అని పలికి, ఇంటికి వచ్చి, నర్మదా నదీ తీరంలో ఉన్న ఆ రాజకుమార్తెను బంగారు ఆభరణాలతో అలంకరించి, కార్తీక మాసంలో యథావిధిగా పెళ్ళి చేయించాడు. ఆ పుణ్యప్రభావం వల్ల యమపాశం నుండి విముక్తుడై స్వర్గాన్ని పొంది సంతోషంతో ఉన్నాడు. అలాగే శ్రుతకీర్తి కన్యాదాన మూల్యాన్ని పదిమంది బ్రాహ్మణులకు ఇచ్చాడు. అతడి పితరులందరూ తక్షణమే పుణ్యలోకాన్ని పొందారు. ఆ క్షణమే వారి పాపాలన్నీ నశించాయి. తర్వాత శ్రుతకీర్తి నృపాలుడు వచ్చిన దారిని పట్టి స్వర్గలోకాన్ని పొందాడు.

కనుక ఎవడు కార్తీక మాసంలో కన్యాదానం చేస్తాడో, అతడు బ్రహ్మహత్య మొదలైన సమస్త పాపాల నుండీ విముక్తుడు అవుతాడు. ఎవరు వివాహం కోసం మాట సహాయమైనా చేస్తారో, వారికి కలిగే పుణ్యం అపారమైనది. ఎవడు కార్తీక వ్రతనిష్ఠ కలవాడై ఆ వ్రతాన్ని తప్పక నెరవేరుస్తాడో, అతడు విష్ణుసాయుజ్యాన్ని (విష్ణువులో ఐక్యమయ్యే మోక్షాన్ని) తప్పక పొందుతాడు. అలా కార్తీక వ్రతాన్ని చక్కగా ఆచరించకపోతే రౌరవం అనే నరకాన్ని పొందుతాడు.

ఇది శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తికమాహాత్మ్యమందలి పదుమూఁడవ యధ్యాయము.

Related posts