హైదరాబాద్: రెండున్నరేళ్ల చిన్నారి అపహరణ కేసును సైబరాబాద్ పోలీసులు 12 గంటల వ్యవధిలోనే ఛేదించి.. సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు. ఈ ఘటనకు సంబంధించి మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళా నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలి శేరిలింగంపల్లి జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ చింతమనేని శ్రీనివాస్ కేసు వివరాలు వెల్లడించారు.
అమీన్పూర్ ప్రాంతంలో నివాసముంటున్న సరిత (25) ఈ నెల 18న సమీపంలోని టిఫిన్ సెంటర్లో పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఆమె రెండున్నరేళ్ల కుమార్తె అక్షిత అదృశ్యమైంది. ఇంటికి తిరిగి వచ్చిన సరిత తన కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళనకు గురై మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
చిన్నారి అదృశ్యమైన ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి వెంటనే కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు డీసీపీ తెలిపారు. నిందితుల ఆచూకీ కోసం అమీన్ ప్పూర్, చందానగర్, పటాన్చెరు పోలీస్ స్టేషన్ల సిబ్బందితో పాటు ఎస్ఓటీ (SOT) విభాగానికి చెందిన మొత్తం 25 మంది పోలీసులతో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసు బృందాలు ఒక మహిళ అనుమానాస్పదంగా చిన్నారిని ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఆ మహిళ మెదక్ ప్రాంతానికి చెందినదిగా తేలడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
వెంటనే మెదక్ టౌన్ పోలీసుల సహకారంతో నారాయణ్ ఖేడ్లో గాలింపు చేపట్టి.. గంగమణి (44) అనే నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి చెరలో ఉన్న చిన్నారి అక్షితను పోలీసులు సురక్షితంగా కాపాడి అమీన్పూర్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఫిర్యాదు అందిన 12 గంటల్లోనే కేసును భేదించి, చిన్నారిని రక్షించిన అమీన్పూర్, చందానగర్, పటాన్చెరు పోలీసు సిబ్బందిని, ఎస్ఓటీ బృందాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
Also read
- చిన్నారి కిడ్నాప్.. 12 గంటల్లోనే ఛేదించి తల్లి ఒడికి చేర్చిన పోలీసులు
- రిమాండ్ ఖైదీ విడుదల కోసం న్యాయమూర్తి సంతకం ఫోర్జరీ
- హైదరాబాద్ యువకుడు మృతి.. తుపాకీ ప్రమాదవశాత్తు పేలింది
- మళ్లీ వచ్చేశారు.. వణికిస్తున్న ముసుగు దొంగలు.. మారణాయుధాలతో కాలనీల్లో సంచారం!
- ఫుడ్ పాయిజన్ కలకలం.. మండీ బిర్యానీ తిని చిన్నారులు సహా 9 మందికి అస్వస్థత!





