తెలంగాణలో మొబైల్ టవర్లపై ఉన్న ఖరీదైన పరికరాలను చోరీ చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్టెల్లో ఇంజినీర్లు, టెక్నీషియన్లుగా పనిచేస్తున్న తొమ్మిది మంది ఉద్యోగులు కలిసి 38 చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. చోరీ చేసిన రేడియో రిమోట్ యూనిట్లను హైదరాబాద్లో విక్రయించి విలాసవంతమైన కార్లు, బైకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి నగదు, వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం ఉండాల్సిన చేతులు.. దొంగతనాలకు పదును పెట్టాయి. నమ్మకంగా పనిచేయాల్సిన ఉద్యోగులే.. సంస్థకు కన్నం వేశారు. మొబైల్ టవర్లపై ఉండే ఖరీదైన పరికరాలపై కన్నేసి.. రాత్రికి రాత్రే వాటిని మాయం చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 38 దొంగతనాలకు పాల్పడ్డారు. చోరీల సొమ్ముతో ఖరీదైన కార్లు, బైకులు కొనుగోలు చేసి జల్సాలు చేసింది ఈ ముఠా. విలువైన రేడియో రిమోట్ యూనిట్లను కొల్లగొట్టిన ఇంజినీర్లు, టెక్నీషియన్ల ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన నకిరేకంటి స్వర్ణ కుమార్, నల్లగొండకు చెందిన భూక్యా బాలు, సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరకత్ గూడెనికి చెందిన శ్రీకాంత్ రెడ్డిలు ఎయిర్ టెల్ లో సైట్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. పెంటమల్ల మహేష్, రమవత్ సుమన్, లకావత్ రాములు, జక్కల నితీష్ కుమార్, భీమనపల్లి రవి, అంగోతు తిరుపతిలు ఎయిర్ టెల్ లో టెక్నీషియన్లు, డ్రైవర్లు, సిబ్బంది గా పని చేస్తున్నారు.
జల్సాలకు అలవాటు పడిన వీరంతా ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈజీ మనీ కోసం పథకం వేశారు. సెల్ టవర్లలో అత్యంత ఖరీదైన రేడియో రిమోట్ యూనిట్లపై ఈ ముఠా కన్ను పడింది. రేడియో రిమోట్ యూనిట్లను తొలగించే సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వీరు దొంగలుగా అవతారమెత్తారు. తాము పనిచేస్తున్న సంస్థకే టార్గెట్ పెట్టుకున్నారు. తమకున్న పరిజ్ఞానాన్నే నేరాలకు ఉపయోగించుకున్నారు. సంస్థలో పనిచేస్తున్నారనే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని.. తమకు తెలిసిన ప్రాంతాల్లోని టవర్లను లక్ష్యంగా చేసుకున్నారు. టవర్లపై ఉన్న RRUలను గుర్తించి.. రాత్రి వేళల్లో పరికరాలను తొలగించేవారు. చోరీ చేసిన యూనిట్లను హైదరాబాద్లో విక్రయించి సొమ్ము చేసుకునేవారు. బయటి వాళ్లకు అనుమానం రాకుండా పక్కా ప్రణాళికతో తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడ్డారు.
ఈ చోరీల వ్యవహారానికి సంబంధించి త్రిపురారం, నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వరుసగా జరుగుతున్న చోరీలను సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాడు. నల్లగొండ రూరల్ పోలీసుల బృందం గిగిరకలబావిగూడెం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, రెండు కార్లు, ఒక బైక్పై వచ్చిన ఐదుగురు వ్యక్తులు పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు. మరోవైపు త్రిపురారం పోలీసులు బాబా సాయిపేట వద్ద వాహన తనిఖీలు చేపట్టగా, కారు, రెండు బైకులపై వచ్చిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా ఈ ముఠా గుట్టు రట్టయింది. తెలుగు రాష్ట్రాల్లో 38 నేరాలకు ఈ ముఠా పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ముఠాకు చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేయడంతో పాటు 3 కార్లు, రెండు బైకులు, 15 లక్షల నగదు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. చోరీలతో వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన కార్లు, బైకులు కొనుగోలు చేశారనీ, మిగిలిన డబ్బును జల్సాలకు, ఇతర అవసరాలకు ఖర్చు చేశారనీ ఆయన చెప్పారు. ఒకవైపు సంస్థలో ఉద్యోగాలు చేస్తూనే.. మరోవైపు అదే సంస్థకు చెందిన పరికరాలను దోచుకోవడం ఈ ముఠా నేరాలకు పాల్పడుతోందనీ అన్నారు.
Also read
- మా ఆయన నన్ను లవ్ చేయట్లేదు!
- రైలు ఢీకొని యువతి దుర్మరణం
- సినిమా అవకాశాల పేరుతో నగ్న చిత్రాలు తీసి..
- మహబూబాబాద్ యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్..సూసైడ్ నోట్ ఆధారంగా ప్రియుడు సహా ఆరుగురు అరెస్ట్
- చదువులపై ‘యమ’ ఒత్తిడి.. ఇంట్లో ఉరివేసుకుని BTech విద్యార్థి ఆత్మహత్య





