SGSTV NEWS online
Famous Hindu Temples

సోమనాథుడు – సౌరాష్ట్ర, గుజరాత్



సేవ చేసే సోమనాథుడు!

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ‘సౌరాష్ట్ర సోమనాథం చ’ అంటూ ఆరంభం అవుతుంది. మహాసముద్రం, త్రివేణీ సంగమం మధ్య కనిపిస్తూ తొలి జ్యోతిర్లింగ క్షేత్రంగా విరాజిల్లే పరమేశ్వరుడి సన్నిధానమే… సౌరాష్ట్రలోని సోమనాథ్. ఈ ఆలయ నిర్మాణం, ఇక్కడి ట్రస్టు నిర్వహించే సేవా కార్యక్రమాలు… అన్నీ ఆసక్తికరమే.



తొలి ద్వాదశ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధిచెంది… ఓ వైపున అరేబియన్ మహా సముద్రంతో, మరో వైపున హిరన్-కపిల-సరస్వతీ నదుల త్రివేణీ సంగమంతోభక్తులను ఆకట్టుకుంటుంది సోమనాథ క్షేత్రం. గుజరాత్ రాష్ట్రం, గిర్-సోమనాథ్ జిల్లా, సౌరాష్ట్ర ప్రాంతం- వెరావల్లోని ప్రభాస్ పటాన్లో ఉందీ ఆలయం. జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమేశ్వరుడు ఇక్కడ సోమనాథుడిగా పార్వతీసమేతుడై అనుగ్రహిస్తాడు. ఈ ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది.

స్థలపురాణం

దక్ష ప్రజాపతి తన రెండో జన్మలో విరిణిని వివాహమాడటంతో అరవైమంది కూతుళ్లు జన్మించారట.

వారిలో ఇరవైఏడు మందిని సోముడిగా పిలిచే చంద్రుడు పరిణయమాడాడట. అయితే, అందరిలోనూ రోహిణిని మాత్రమే అమితంగా ఇష్టపడుతూ మిగిలిన భార్యల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసేవాడట చంద్రుడు. ఆ విషయం తెలియడంతో దక్షుడు కోపోద్రిక్తుడు అయ్యాడట.. నీ అందాన్నీ, వెలుగునూ కోల్పోతావంటూ అల్లుడైన చంద్రుడ్ని తీవ్రంగా శపించాడట. అప్పుడు, ఆ వెన్నెల దేవుడు… బ్రహ్మ సలహాతో ప్రభాస తీర్థంగా పిలిచే ఈ ప్రాంతానికి చేరుకుని పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ సాధనకు మెచ్చిన శివుడు, చంద్రుడి శాప తీవ్రతను తగ్గించాడట. ఆ తర్వాత, ఇక్కడే స్వయంభువుగా కొలువుదీరాడని అంటారు.

అందుకు కృతజ్ఞతగా శివుడి కోసం బంగారు ఆలయాన్ని నిర్మించాడట చంద్రుడు. అలా చంద్రుడి పేరైన సోమతో కలిపి స్వామి సోమనాథుడిగా పూజలు అందుకుంటున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత, త్రేతాయుగంలో రావణుడు వెండితో ఆలయాన్ని నిర్మిస్తే, ద్వాపరలో శ్రీకృష్ణుడు చందనంతో దాన్ని పునర్నిర్మించాడట.



మహాత్ముడి చొరవతో..

సోమనాథ క్షేత్రం ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలిచింది. ముస్లిం పాలకులు దండెత్తి ధ్వంసం చేసిన ప్రతిసారీ, అప్పటి రాజులు ఆలయాన్ని తిరిగి అభివృద్ధి చేసేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సర్దార్ వల్లభభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం గురించి ప్రధాని నెహ్రూకు ప్రతిపాదనలు పంపారు.

అందుకు ప్రభుత్వం అనుమతించినా, ఓ ట్రస్టును ఏర్పాటు చేసి భక్తుల విరాళాలతో ఆలయాన్ని నిర్మిస్తే బాగుంటుందని మహాత్మాగాంధీ సూచించారు. బాపూజీ సలహా ప్రకారమే, ట్రస్టును ఏర్పాటు చేసి ప్రజల నుంచి సేకరించిన డబ్బుతోనే, స్థానికంగా దొరికే పసుపురంగు ఇసుకరాయిని ఉపయోగించి ఈ ఆలయాన్ని అబ్బురపరిచేలా తీర్చిదిద్దారు. ఇందుకు దాదాపు అయిదేళ్లు పట్టిందని చెబుతారు. అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ శివలింగానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అదే ట్రస్టు ఇప్పటికీ కొనసాగుతోంది. భక్తుల విరాళాలను అనేక సేవాకార్యక్రమాలకు వినియోగిస్తారు.



బిల్వవనం ఏర్పాటుతోపాటు, గోసేవ, నిత్యాన్నదానం, వైద్యశిబిరాల నిర్వహణ, నేత్ర శస్త్ర చికిత్సలు, నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ… మొదలైన సత్కార్యాలు అందులో భాగమే. అంతేకాదు, గిర్ సోమనాథ్కు చెందిన యువతకు పలు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. ఉన్నత విద్య కోసం పేద పిల్లలకు స్కాలర్షిప్లు అందిస్తారు. కంప్యూటర్ తరగతులను కూడా నిర్వహిస్తోంది ట్రస్టు. స్వామివారికి నిత్యం రుద్ర, జల, బిల్వాభిషేకాలు జరుగుతాయి. మహాశివరాత్రికి వేలాది భక్తులు తరలివస్తారు. ఆ సందర్భంగా కనువిందైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కార్తిక పూజల్నీ ఘనంగా నిర్వహిస్తారు. ఏటా మూడురోజులపాటు జరిగే సోమనాథ్ ఉత్సవాల గురించి మాటల్లో చెప్పలేం. గర్భాలయంలో స్వామివారితోపాటు పార్వతీదేవినీ పూజించుకోవచ్చు. తర్వాత ఆలయ ప్రాంగణంలోనే అన్నపూర్ణాదేవి, వినాయకుడు, హనుమంతుడు తదితర దేవతల ఉపాలయాల్ని సందర్శించవచ్చు. రోజూ సాయంత్రం ఏర్పాటుచేసే… ‘జై సోమనాథ్’ లైట్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.

ఎలా చేరుకోవాలి?

సోమనాథ్ క్షేత్రానికి గగన మార్గంలో రావాలనుకునే భక్తులు డయ్యూ విమానాశ్రయంలో దిగాలి. అక్కడి నుంచి బస్సులూ, ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి వెళ్లొచ్చు. రైల్ లో అయితే… నేరుగా సోమనాథ్ రైల్వేస్టేషన్ లొ దిగాల్సి ఉంటుంది. దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి చేరుకునేందుకు ఆటోలు అందుబాటులో ఉంటాయి.

Related posts