SGSTV NEWS online
Andhra PradeshCrime

యువకుడి ప్రాణాలు బలిగొన్న ఇయర్ ఫోన్



గజపతినగరం: చెవిలో  ఇయర్ ఫోన్ పెట్టుకొని రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో యువకుడు మృతిచెందిన ఘటన విజయనగరం జిల్లా గజపతినగరంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామానికి చెందిన పవన్ కల్యాణ్ (21) చెన్నైలో ఇంజినీరింగ్ చదివి ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్లో ఉంటున్నాడు. తండ్రి కూలి పనులు చేస్తుండగా, తల్లి గృహణిగా ఉన్నారు. ఎంతో కష్టపడి పవన్ ను ఇంజినీరింగ్ చదివించారు.

దీపావళి నేపథ్యంలో పవన్ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. మంగళవారం తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఉదయాన్నే బహిర్భూమి కోసం రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఆ సమయంలో అతడి చెవిలో ఇయర్ ఫోన్ ఉన్నాయి. ఇరువైపుల నుంచి రైళ్లు రావడాన్ని గమనించని పవన్.. ఒకవైపు రైలు వస్తున్నట్లు గుర్తించి వేగంగా పట్టాలు దాటేందుకు యత్నించాడు. ఈక్రమంలో మరో ట్రాక్ పై వచ్చిన రైలు ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు గజపతినగరం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధరించారు. సత్యం, రామకృష్ణమ్మ దంపతులకు ఇప్పటికే ఓ కుమారుడు చనిపోగా, పవన్ ఒక్కడే సంతానంగా ఉన్నాడు. ఇద్దరు బిడ్డలను కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది.

Also read

Related posts