Tholi Deepavali Significance Telugu: పెళ్లి తర్వాత వచ్చే తొలి దీపావళినే తల దీపావళి అంటారు. కొత్త దంపతుల జీవితంలో ఈ పండుగకు ఉన్న ప్రత్యేకత, పుట్టింటి ఆహ్వానం, సీర్వరుస, పూజా విధానం, కుటుంబ సంప్రదాయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Tholi Deepavali Significance Telugu: హిందూ సంప్రదాయంలో దీపావళి పండుగకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. చీకటిని తొలగించి వెలుగును నింపే ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని తీసుకువస్తుంది. అయితే వివాహం తర్వాత వచ్చే తొలి దీపావళి కొత్తగా పెళ్లైన దంపతులకు మరింత ప్రత్యేకమైనది. దీనినే తొలి దీపావళి అని పిలుస్తారు. ‘తొలి’ అంటే మొదటి అని అర్థం. అంటే వివాహం అనంతరం భార్యాభర్తలు కలిసి జరుపుకునే తొలి దీపావళినే తలై దీపావళిగా భావిస్తారు. తొలి దీపావళి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. రెండు కుటుంబాల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలను మరింత బలపరిచే పవిత్రమైన సందర్భంగా భావిస్తారు. ముఖ్యంగా వివాహం తర్వాత అత్తవారింటికి వెళ్లిన కుమార్తెను తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో తమ ఇంటికి ఆహ్వానించి, అల్లుడితో కలిసి పండుగ జరుపుకోవడం ఈ సంప్రదాయంలో ప్రధానమైనది.
తొలి దీపావళి ఎందుకు జరుపుకుంటారు?..
వివాహం తర్వాత కుమార్తె కొత్త జీవితాన్ని ప్రారంభించినప్పటికీ, పుట్టింటితో ఆమెకు ఉన్న అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని తెలియజేసే ప్రతీకగా తొలి దీపావళిని భావిస్తారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కుమార్తె, అల్లుడిని ఇంటికి ఆహ్వానించి సాదరంగా స్వాగతిస్తారు. అల్లుడిని కూడా తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తూ ఆతిథ్యం ఇవ్వడం ఈ సంప్రదాయంలోని ప్రత్యేకత
తొలి దీపావళి ఎలా జరుపుకుంటారు?..
కుటుంబ ఆచారాలు, ప్రాంతీయ సంప్రదాయాలకు అనుగుణంగా తొలి దీపావళి వేడుకల్లో కొంత మార్పు ఉండవచ్చు. సాధారణంగా పండుగకు ముందు అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు అల్లుడి ఇంటికి వెళ్లి దంపతులను ఆహ్వానిస్తారు. దీపావళి రోజున ఉదయాన్నే కొత్త దంపతులకు నూనె రాసి మంగళస్నానం చేయించి, కొత్త బట్టలు ధరింపజేస్తారు. అనంతరం లక్ష్మీదేవి, గణపతిని భక్తిశ్రద్ధలతో పూజించి, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి పండుగ వంటకాలు, స్వీట్లు, విందుతో ఆనందాన్ని పంచుకుంటారు.
తొలి దీపావళికి ఉన్న ప్రాధాన్యత..
తొలి దీపావళి సందర్భంగా కుమార్తె, అల్లుడికి కొత్త బట్టలు, నగలు, పండ్లు, స్వీట్లు, పూజా సామగ్రి వంటి కానుకలను ఇవ్వడం అనేక కుటుంబాల్లో సంప్రదాయంగా కొనసాగుతోంది. వీటిని సీర్వరుసగా అందిస్తారు. అయితే కానుకల విలువ కంటే వాటి వెనుక ఉన్న ప్రేమ, ఆశీర్వాదం, ఆప్యాయతలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
రెండు కుటుంబాలను కలిపే పండుగ..
తొలి దీపావళి కొత్త దంపతుల జీవితంలో ఆనందాన్ని నింపడమే కాకుండా, వివాహంతో ఒక్కటైన రెండు కుటుంబాల మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. బంధువులు ఒకచోట చేరడం, పెద్దల ఆశీర్వాదాలు పొందడం, కానుకలు పంచుకోవడం వంటి సంప్రదాయాలు కుటుంబ బంధాలను మరింత గాఢం చేస్తాయి. అందుకే తొలి దీపావళి అసలైన ప్రత్యేకత ఆడంబరాల్లో లేదు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన దంపతులకు రెండు కుటుంబాలు ప్రేమ, ఆశీర్వాదం, అండగా నిలవడంలోనే ఈ పండుగ అసలైన ఆధ్యాత్మికత, ఆనందం దాగి ఉంది.
