దీపావళి పండుగ సందర్భంగా నరక చతుర్దశి అభ్యంగన స్నానం నుంచి సాయంత్రం లక్ష్మీ పూజ వరకు పాటించాల్సిన సంప్రదాయాలు, నియమాలు తెలుసుకోండి. యమదీపం, నందా దీపం ఎందుకు వెలిగిస్తారు? లక్ష్మీదేవికి ఎలా నైవేద్యం సమర్పించాలి? దీపాల ప్రాముఖ్యత, దీపావళి పూజా విధానం పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అంతా ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. అయితే.. ఈ సంవత్సరం నరక చతుర్దశి, దీపావళి పండుగ ఒకే రోజున రావడం విశేషం. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకొని పాటించాల్సిన నియమాలు, పూజా విధానాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
నరక చతుర్దశి ఉదయాన్నే ఆచరించాల్సిన పవిత్ర స్నానం
నరక చతుర్దశి తెల్లవారుజామున, అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత, సూర్యోదయానికి ముందు, పవిత్రమైన స్నానం ఆచరించాలి. ఈ స్నానానికి నువ్వుల నూనెను శరీరానికి, తలకు పట్టించి, అభ్యంగన స్నానం చేయాలి. నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. ఈ స్నానం ఆచరించిన వారికి ఏడాది పొడవునా లక్ష్మీ కటాక్షం, అనుగ్రహం లభిస్తాయి. స్నానం చేసే నీటిలో పంచపల్లవాలు (ఐదు రకాల వృక్ష పత్రాలు) వేసుకుంటే, ఆ స్నానం ఔషధ గుణాలతో కూడి, సర్వసంపదలకు నిలయంగా మారుతుంది. స్నానం ముగిసిన వెంటనే, నరకాసురుని వధ జరిగిన ఆ శుభ ఘడియలను గుర్తు చేసుకుంటూ టపాసులు కాల్చాలి. మహావిష్ణువు, రుక్మిణీదేవి, సత్యభామలను స్మరించుకొని నమస్కరించాలి.
దీపావళి: వెలుగుల పండుగ విశిష్టత
దీపావళి పండుగ అమావాస్య తిథి నాడు వస్తుంది. ఈ తిథి చీకట్లను తొలగించి, వెలుగురేఖలను ప్రసాదించే లక్ష్మీదేవికి అంకితం. సముద్ర మథన సమయంలో లక్ష్మీదేవి వెలుగు కిరణాలతో ఉద్భవించింది కాబట్టి, ఆమెను వెలుగుల దేవతగా కొలుస్తారు. అందుకే చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి అన్నారు. ఈ రోజున పితృదేవతలకు స్వర్గలోకంలో మార్గం చూపించడానికి దివిటీలు వెలిగించే సంప్రదాయం ఉంది. బాణాసంచా కాల్చడం ద్వారా కూడా పితృదేవతలకు మార్గం సుగమం అవుతుందని నమ్మకం.
సాయం సంధ్యా సమయ దీపారాధన, లక్ష్మీ పూజ
సాయం సంధ్యా సమయంలో దీపలక్ష్మీ స్వాగతం పలుకుతూ, అష్టలక్ష్మి వైభవాన్ని స్మరించుకుంటూ, ఇంటి చుట్టూతా ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల దీపలక్ష్మి, అంటే సాక్షాత్తు మహాలక్ష్మియే, ఇంటిలోకి ప్రవేశిస్తుంది. పూజ చేసే గదిలో, దేవతా మందిరంలో, మందిరం చుట్టూ అనేక దీపాలను అమర్చాలి. మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల ఆ ఇంట స్థిరలక్ష్మి నిలుస్తుంది.
లక్ష్మీ పూజ చేసేటప్పుడు మీరు సంపాదించిన ధనం, బంగారాన్ని వెండి పళ్ళెంలో ఉంచి, లక్ష్మీదేవి ముందు పెట్టాలి. “అమ్మా, నీ చల్లని దీవెనలు, కరుణాకటాక్ష వీక్షణాల వలనే నేను మరింత సంపాదన చేయాలి, ఆరోగ్యవంతుడినై జీవితాన్ని గడపాలి” అని ప్రార్థించాలి. ఇలా పూజ చేసిన వారికి ఘల్లు ఘల్లుమంటూ లక్ష్మీదేవి ఇంటిలోకి ప్రవేశిస్తుంది. వివిధ రకాల పిండివంటలు, తీపి పదార్థాలతో లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించి, కుటుంబ సభ్యులందరూ నమస్కరించి ప్రసాదం స్వీకరించాలి.
జ్యేష్ఠా దేవిని దూరం చేయడం
ప్రసాద స్వీకరణ, బాణాసంచా కాల్చిన తర్వాత, ఇంటిలోకి దరిద్ర దేవత (జ్యేష్ఠా దేవి) రాకుండా చాటలు, తప్పెట్లతో మోత మోగించే సంప్రదాయం ఉంది. ఇలా చేయడం వల్ల జ్యేష్ఠా దేవి ఇంట్లోకి ప్రవేశించకుండా వెళ్ళిపోతుందని నమ్మకం. సాయం సంధ్యా సమయంలో దొడ్డి గుమ్మాన్ని మూసి దీపారాధన చేయాలి, ఉదయం పూట ముందు వాకిలి తెరిచి దీపారాధన చేయాలని పెద్దలు చెబుతారు.
దీపాల ప్రాముఖ్యత, ప్రత్యేక దీపాలు
దీపావళి నుంచి కార్తీక మాసం చివరి రోజు వరకు దీపాలు వెలిగించే సంప్రదాయం కొనసాగుతుంది. దీపాలు భగవంతుని రూపాలని, ఈ దీప పరబ్రహ్మ స్వరూప తత్వం లోకాన్ని శాసిస్తుందని నమ్మకం. ధర్మసింధువు అనే గ్రంథం ప్రకారం, నరక చతుర్దశి నాడు పితృలోకాలకు వెళ్ళిన పెద్దలకు మార్గం చూపించడానికి వారి పేరిట ఒక్కొక్క దీపం దేవుని ముందు వెలిగించాలి. అంతేకాకుండా, నరక చతుర్దశి నాడు యమదీపం కూడా వెలిగిస్తారు.
నందా దీపం
దీపావళి నాడు ఇంటి ప్రాంగణంలో ఒక అరకిలో గోధుమలను విస్తరాకులో పోసి, ఆ గోధుమల మధ్యలో పెద్ద మట్టి ప్రమిదను ఉంచి, నందా దీపం వెలిగించాలి. ఈ దీపం రాత్రి పన్నెండు గంటల వరకు వెలుగుతూనే ఉండాలి. ఇలా వెలిగించినట్లయితే, ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు. గోధుమలు ధాన్యలక్ష్మీదేవికి నిదర్శనం. ఇది సిరిసంపదలతో తులతూగడానికి సాక్షిభూతంగా ఉంటుంది. అంతేకాకుండా.. మహా మంత్ర పఠనం కూడా చాలా మంచిది.. ఇది సంపదతో పాటు.. సుఖ సంతోషాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు.
