తిరుపతి రూరల్: నాయుడుపేట-పూతలపుట్టు జాతీయ
రహదారికి ఆనుకుని తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం వద్ద హత్యకు గురైన యువతి ఆచూకీని పోలీసులు గుర్తించారు. మృతురాలు చిత్తూరు జిల్లా, రొంపిచర్ల మండలం, లక్ష్మీనారాయణ కాలనీకి చెందిన భాగ్యశ్రీగా నిర్ధారించారు. తిరుపతి నగరంలోని ఎస్టీవీ నగర్లో ఉన్న ఓ ప్రైవేట్ పీజీ హాస్టల్లో నివసిస్తూ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఆమె పనిచేస్తున్నట్లు గుర్తించారు.
గత నెల 30న భాగ్యశ్రీ ఫోన్ స్విచ్చాఫ్ అయిందని, మరుసటి రోజు 31వ తేదీ రాత్రి హత్యకు గురైన యువతి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె తల్లిదండ్రులు వేణుగోపాల్, లక్ష్మీదేవి గుర్తించారు. అనంతరం తిరుపతి రూరల్ పోలీసులను సంప్రదించి మృతదేహాన్ని పరిశీలించి యువతి ఒంటిపై ఉన్న దుస్తులు, నగలను చూసి ఆమె తమ కుమార్తె భాగ్యశ్రీ అని నిర్ధారించారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
దర్యాప్తు ముమ్మరం
హత్యకు గురైన భాగ్యశ్రీ ఉద్యోగం చేస్తున్న కార్యాలయంతో పాటు ఆమెతో సన్నిహితంగా ఉన్న వారి వివరాలను సేకరించుకున్న పోలీసులు గత రెండు రోజులుగా కార్యాలయంలో విధులకు హాజరుకాకుండా ఉన్న వారి వివరాలను కూడా సేకరించినట్టు సమాచారం. అయితే మృతురాలి సెల్ఫోన్ లభించలేదు. ఆమె నివాసముంటున్న పీజీ హాస్టల్ వద్దకు ఎవరెవ్వరు వచ్చి ఆమెను కలిసేవారు, 30వ తేదీ ఎన్నిగంటలకు పీజీ నుంచి బయటకు వెళ్లిందన్న వివరాలను కూడా అక్కడి సీసీ టీవీ పుటేజీ ద్వారా పోలీసులు సేకరించారు. ఈ కేసు మిస్టరీని త్వరలోనే ఛేదిస్తామని తిరుపతి రూరల్ సీఐ మద్దయ్యచారి తెలిపారు.
Also read
- అనుమానాస్పద స్థితిలో ట్రాన్స్ జెండర్ మృతి
- పార్వతీపురం మున్సిపాలిటీలో కలకలం.. స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్..
- నిందితుల కాళ్లకే పోలీసులు ఎందుకు గురిపెడతారు? హేమంత్ కుడికాలు తొలగించడానికి కారణమిదే..
- పేరుకేమో అసిస్టెంట్ డైరెక్టర్.. రైలెక్కి ఏం చేస్తాడో తెలిస్తే షాకే!
- రూ.1.50 కోట్ల చిట్టీల మోసం.. కష్టార్జితం కోల్పోయిన బాధితులకే ఐపీ నోటీసులు.. సిద్దిపేటలో తీవ్ర కలకలం!





