SGSTV NEWS online
Spiritual

కార్తీక మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది, తులసి పూజ ఎందుకు చేయాలి? లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం ఇలా చేయండి!


హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ మాసంలో శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మి, తులసి మాతను భక్తిశ్రద్ధలతో పూజించడం, దీపారాధన చేయడం, దానధర్మాలు ఆచరించడం శుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు.


హిందూ ధర్మంలో కార్తీక మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ మాసాన్ని పూజలు, వ్రతాలు, దానధర్మాలు, దీపారాదనలకు అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. సకల లోకాలను రక్షించే శ్రీమహావిష్ణువు, ధనలక్ష్మిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ద్వారా జీవితంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈ ఏడాది నవంబర్ 10 నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుండటంతో, మొదటి రోజు నుంచే ఆధ్యాత్మిక కార్యకలాపాలకు భక్తులు సిద్ధమవుతున్నారు.



కార్తీక మాసంలో విష్ణు ఆరాధన విశేషం

పురాణాల ప్రకారం, ఆషాఢ మాసంలో వచ్చే దేవశయని ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్లే శ్రీహరి, కార్తీక మాసంలో వచ్చే దేవోత్థాన ఏకాదశి నాడు మేల్కొంటారు. దీంతో చాతుర్మాస వ్రతాలు ముగిసి శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ఈ మాసమంతా శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. భక్తులు ఉదయాన్నే నదీస్నానం ఆచరించి, దానధర్మాలు, దీపారాదన చేయడం ద్వారా భగవంతుని కృపకు పాత్రులవుతారు. కార్తీక మాసంలో చేసే ప్రతి పూజ, దీపారాదన భక్తుల జీవితంలో కొత్త వెలుగులు నింపుతాయి.

తులసి పూజతో ఇంట సానుకూల శక్తి

కార్తీక మాసంలో తులసి పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. తులసి మాత శ్రీహరికి అత్యంత ప్రియమైనదిగా భావిస్తారు. అందువల్ల ఈ నెలంతా రోజూ ఉదయం స్నానం ముగించుకుని తులసి మొక్క ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శుభదాయకం. దీపం వెలిగించే సమయంలో తులసిని భక్తితో నమస్కరించి, కుటుంబంలో సుఖశాంతులు కలగాలని ప్రార్థించాలి. తులసి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది.

లక్ష్మీనారాయణుల సంయుక్త పూజ

హిందూ సంప్రదాయంలో విష్ణుమూర్తి ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అందుకే కార్తీక మాసంలో శ్రీహారితో పాటు మహాలక్ష్మిని కూడా ఒకేసారి పూజించడం ఎంతో శ్రేయస్కరం. తులసి పూజ చేసిన అనంతరం విష్ణువు, లక్ష్మీదేవిని స్మరిస్తూ భక్తితో మంత్రాలు జపించాలి. రోజూ కొద్దిసేపు దైవారాధనకు కేటాయించడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది.


పండుగల హరివిల్లు కార్తీక మాసం

ఈ మాసంలో వచ్చే ఏకాదశులు, ద్వాదశి పూజ, పున్నమి వంటి ఎన్నో ప్రధాన పర్వదినాలు వస్తాయి. ఈ పర్వదినాల్లో చేసే పూజలు, దీపదానాలకు విశేష ఫలితం ఉంటుంది. అలాగే పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి వరకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా తులసి పూజలు, దీపారాదన కొనసాగించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి

Related posts