SGSTV NEWS online
CrimeTelangana

మందు తాగి రోడ్డెక్కారు.. బండి ఆపిన పోలీసులకే క్లాస్‌ పీకారు! నడిరోడ్డుపై హైడ్రామా!


హైదరాబాద్‌: మహానగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న కొందరు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ హల్‌చల్‌ చేస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన తర్వాత తప్పును అంగీకరించాల్సింది పోయి.. పోలీసులతో వాదనకు దిగడం, వాహనాలను సీజ్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట చౌరస్తాతో పాటు మేడ్చల్‌ జిల్లా కిష్టాపూర్‌లో చోటుచేసుకున్న ఘటనలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.


చాంద్రాయణగుట్టలో డ్రంకెన్ డ్రైవ్‌.. 149 పాయింట్లుగా గుర్తింపు!

చాంద్రాయణగుట్ట చౌరస్తాలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వాహనదారుడు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలో 149 పాయింట్లు వచ్చినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు వాహనాన్ని సీజ్‌ చేయగా.. సదరు వాహనదారుడు వారితో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు రోడ్డుపైన పడిపోయారు. మందుబాబులు పోలీసు అధికారులను గిల్లడం, కొరకడం కూడా చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ.. తనిఖీల్లో పట్టుబడిన తర్వాత కొందరు వాహనదారులు ఇలా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తోంది.


కిష్టాపూర్‌లోనూ అదే తీరు.. చలానా వేయాలంటూ వాదన!

మరోవైపు మేడ్చల్‌ జిల్లా కిష్టాపూర్‌లోనూ వాహనాల తనిఖీల సందర్భంగా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ వాహనదారుడి బండిని ట్రాఫిక్‌ సిబ్బంది సీజ్‌ చేయడంతో అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. “తప్పు చేస్తే చలానా వేయాలి.. కానీ వాహనాన్ని ఎందుకు సీజ్‌ చేస్తారు?” అంటూ పోలీసులతో వాదనకు దిగాడు. ఈ క్రమంలో వాహనదారుడిపై పోలీసులు చెయ్యి చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ట్రాఫిక్‌ సిబ్బందిలో ఒకరు వాహనదారుడి చెంపపై కొట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అయితే, తన తల్లిని దుర్భాషలాడారంటూ వాహనదారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

తప్పు ఎవరిదైనా.. చట్టం తన పని తాను చేయాలి!

మద్యం సేవించి వాహనం నడపడం వల్ల వాహనదారుడితో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకూ ముప్పు ఏర్పడుతుంది. అందుకే డ్రంకెన్ డ్రైవ్‌ తనిఖీలను పోలీసులు నిర్వహిస్తున్నారు. అయితే, తనిఖీల సమయంలో వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది కూడా చట్టానికి లోబడి, సంయమనంతో వ్యవహరించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. వాహనదారుడు తప్పు చేసినా, పోలీసుల ప్రవర్తనపై ఫిర్యాదు ఉన్నా.. నిబంధనల ప్రకారం విచారణ జరగాలి.

మద్యం తాగి వాహనం నడపడం ఒక తప్పు.. విధి నిర్వహణలో నిబంధనలు అతిక్రమించడం మరో తప్పు. ఈ రెండు ఘటనల్లో అసలు ఏం జరిగింది? పోలీసుల చర్యలు నిబంధనల ప్రకారమేనా? వాహనదారుడి ఆరోపణల్లో నిజమెంత? అన్నది సంబంధిత అధికారుల విచారణ చేపట్టారు.

Also read

Related posts