SGSTV NEWS online
CrimeTelangana

హైదరాబాద్‌లో సైబర్ మోసం.. లైఫ్ సర్టిఫికేట్ పేరుతో రిటైర్డ్ ఉద్యోగికి రూ. 11.69 లక్షలు టోకరా!



హైదరాబాద్‌లో సైబర్‌ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. లైఫ్ సర్టిఫికేట్ అప్‌డేట్ చేయాలంటూ బ్యాంకు అధికారుల పేరుతో మోసగాళ్లు రిటైర్డ్ ఉద్యోగికి ఫోన్ చేశారు. బాధితుడి నుంచి ఆధార్, డెబిట్ కార్డ్ వివరాలు సేకరించడంతో పాటు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మొబైల్ స్క్రీన్ షేర్ చేయించుకున్నారు. ఈ అదును చూసి నిందితులు అతని ఫిక్స్‌డ్ డిపాజిట్,సేవింగ్స్ ఖాతాల నుంచి ఆరు వేర్వేరు లావాదేవీల ద్వారా ఏకంగా రూ. 11.69 లక్షలను కాజేసారు.


నగరంలో సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త వ్యూహంతో అమాయకులను, వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో బ్యాంకు అధికారులమంటూ నమ్మించి, లైఫ్ సర్టిఫికేట్ అప్‌డేట్ పేరుతో ఓ రిటైర్డ్ ఉద్యోగికి సైబర్‌ కేటుగాళ్లు భారీ కుచ్చుటోపీ పెట్టారు. బాధితుడి ఖాతా నుంచి రూ. 11.69 లక్షలు కాజేసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ ఉద్యోగి అయిన బాధితుడికి సైబర్‌ నేరగాళ్లు ఫోన్ చేశారు. తాము బ్యాంకు అధికారులమని నమ్మబలికారు. పింఛనుదారులకు ఎంతో కీలకమైన లైఫ్ సర్టిఫికేట్ వెంటనే అప్‌డేట్ చేయాలని, లేకపోతే పింఛన్ ఆగిపోతుందని భయపెట్టారు.

దీంతో నిజమేనని నమ్మిన ఆ వృద్ధుడు వారు అడిగిన వివరాలను అందించాడు. నేరగాళ్లు అతని ఆధార్ కార్డ్, డెబిట్ కార్డ్ వివరాలను సేకరించారు. అంతటితో ఆగకుండా, వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మొబైల్ స్క్రీన్ షేర్ చేసుకోవాలని నమ్మించారు. ఆన్‌లైన్ ప్రక్రియలో సాంకేతిక సాయం చేస్తున్నట్లు నటించి బాధితుడి మొబైల్ ఫోన్‌ను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు.




ఖాతా నుంచి ఖాళీ అయిన డబ్బులు:
బాధితుడి మొబైల్ స్క్రీన్ యాక్సెస్ దక్కించుకున్న కేటుగాళ్లు క్షణాల వ్యవధిలో అతని ఫిక్స్‌డ్ డిపాజిట్‌, సేవింగ్స్ ఖాతాల నుంచి రంగంలోకి దిగారు. బాధితుడికి ఎలాంటి సమాచారం అందకుండా ఆరు వేర్వేరు ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా మొత్తం రూ. 11.69 లక్షలను తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. కొద్దిసేపటికి తన ఖాతా నుండి డబ్బులు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో బాధితుడు కంగుతిన్నాడు. తాను మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసుల హెచ్చరిక:

పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ తరహా సైబర్ నేరాలు జరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు ఎప్పుడూ కూడా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా స్క్రీన్ షేర్ చేయమని లేదా గోప్యమైన ఓటీపీ, పిన్ నంబర్లు అడగవని స్పష్టం చేశారు. ఎవరైనా అనుమానాస్పద కాల్స్ చేసి బ్యాంకు వివరాలు అడిగితే వెంటనే అప్రమత్తం కావాలని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

Also read

Related posts