SGSTV NEWS online
CrimeTelangana

పండగ వేళ విషాదం.. డీజే మోతకు ఒకరు, డ్యాన్స్ చేస్తూ మరొకరు..



Saddula Bathukamma: సద్దుల బతుకమ్మ సంబరాల వేళ తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో డీజే శబ్దాల మధ్య కుప్పకూలిన భారతి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బతుకమ్మ ఆడుతూ కుప్పకూలిన శ్రీవాణి వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.


తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాల వేళ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోవడంతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురానికి చెందిన యలగాల భారతి (55) సద్దుల బతుకమ్మ పండుగ కోసం తన తల్లిగారి ఊరైన చెరువుమాదారినికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం గ్రామంలోని మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మలను, నాలుగు డీజేలను కూడలి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ డీజే శబ్దాల మధ్య నృత్యాలు చేస్తుండగా భారతి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు భర్త వలరాజుతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు.


మరో ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. చింతలమానెనల్లి మండలం బాబాసాగర్‌కు చెందిన శ్రీవాణి (25) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. బతుకమ్మ, దసరా పండుగల కోసం బూరుగుడలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆమె, సంబరాల్లో పాల్గొంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పండుగకు వస్తుందని ఎదురుచూసిన కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లి రోదించిన తీరు అందరినీ కలచివేసింది.

Also read

Related posts