SGSTV NEWS online
Spiritual

Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!



శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2026 అక్టోబర్ 19 సోమవారం మహర్నవమి. ఈ రోజు కనకదుర్గమ్మ మహిషాసుర మర్దినీదేవి అలంకారంలో దర్శనమిస్తారు..ఈ అలంకారం విశిష్టత ఏంటంటే..

Dussehra 2026: శరన్నవరాత్రుల్లో ముఖ్యమైన రోజు మహానవమి. దసరా నవరాత్రి పూజలకు ఈ రోజు అత్యంత ప్రత్యేకం. విజయ దశమి పూజ అనేది పున: పూజ , ఉద్వాసన అని నిర్ణయ సింధులో స్పష్టంగా ఉంది. అంటే ప్రధాన పూజ నవమి రోజు..పునఃపూజ దశమి రోజు అని అర్థం.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో మొదలయ్యే నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదోరోజు మహర్నవమి. ఆశ్వయుజ శుద్ధ నవమి రోజు విజయవాడ కనకదుర్గమ్మ మహిషాసుర మర్దినీదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. ఎనిమిది భుజాలతో అవతరించి సింహవాహనంపై వచ్చి.. దుష్టుడైన మహిషా సురుని సంహరించి.. దేవతల, ఋషుల, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసుర మర్దినీదేవి అలంకారములో ఉన్న అమ్మవారిని  దర్శించుకుంటే భయాలు తొలగి శత్రువులపై విజయం సాధిస్తారని భక్తుల విశ్వాసం. 

మహానవమి రోజు అమ్మవారిని అపరాజితగా పూజిస్తారు. కొందరు నవరాత్రుల్లో తొమ్మిదో రోజు ముక్తేశ్వరీ దేవిని అర్చిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు చేస్తారు. నవదుర్గ శాక్తేయ సంప్రదాయులు సిద్ధిధాత్రిని పూజిస్తారు.

మహిషాసురుడు విధ్వంసం సృష్టిస్తున్నప్పుడు దేవతలంతా తమ శక్తులను ఓ చోట చేర్చి దుర్గను సృష్టించారు. పరమేశ్వరుడి తేజస్సుతో  ముఖం, శ్రీ మహావిష్ణువు తేజస్తుతో బాహువులు, బ్రహ్మ తేజస్సుతో పాదాలు, యముడి తేజస్సుతో శిరోజాలు,వరుణుడి తేజస్సుతో ఊరువులు, సూర్యుడి తేజస్సుతో పాదాల వేళ్లు,   చంద్రుని తేజస్సుతో వక్షస్థలం, ఇంద్రుని వైభవంతో నడుము, సాయంత్రం ప్రకాశంతో కనుబొమ్మలు, ప్రజాపతి తేజస్సుతో దంతాలు, అగ్ని తేజస్సుతో కళ్ళు,గాలి  నుంచి చెవులు..ఇతర దేవతల తీవ్రతతో మిగిలిన శరీర భాగాలు ఏర్పడ్డాయి.

దేవతకు ప్రాణం పోసిన తర్వాత మహిషాసురిడిని అంతం చేసే అపారమైన శక్తి కోసం దేవతలంతా తమ తమ ఆయుధాల శక్తిని అందించారు.   త్రిశూలం, సుదర్శన చక్రం, గద, ధనుస్సు సహా అన్ని ఆయుధాలను చేతపట్టి సింహవాహనాన్ని అధిరోహించి మహిషాసురుడిని సంహరించి మహిషాసుర మర్థినిగా నిలిచింది. 

మహిషాసుర మర్ధిని నిత్య స్వరూపిణి. మృత్యువును నశింపచేసే శక్తి. అన్ని మంత్రాలకు , యంత్రాలకు, తంత్రాలకు మూలం అయిన రూపం. మహిషాసుర మర్థిని అనుగ్రహం మీపై ఉంటే సాధ్యం కానిది లేదని చెబుతారు ఉపాసకులు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని నవవిధాలుగా పూజించి పదో రోజ దశ అవస్థలో విజయాన్ని సాధిస్తారు. నవరాత్రులు ఆరంభంలో బాలపూజ చేయలేనివారు చివరి మూడు రోజుల్లో కన్యా పూజ చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో దుర్గాష్టమి రోజు ఆయుధ పూజ చేస్తే కేరళలో మహానవమి రోజు ఆయుధ పూజ చేస్తారు. మైసూర్ మహారాజా ప్యాలెస్ ను అద్భుతంగా అలంకరిస్తారు. మహానవమి రోజు దేవీ ఆలయాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోతాయి. విజయవాడ , కలకత్తా, ఉజ్జయిని తదితర ప్రాంతాల్లో కనకదుర్గ ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. మహానవమి రోజు ఇతర పిండి వంటలతో పాటూ చెరుకుగడలను అమ్మవారిని నివేదిస్తారు. కాశ్మీర్, పంజాబ్, హర్యానా, బీహార్,ఉత్తర ప్రదేశ్ లో మహానవమి రోజున కన్యాపూజ చేస్తారు. నవదుర్గలకు ప్రతీకగా తొమ్మిది మంది చిన్నారులను ఆహ్వానించి శక్తి స్వరూపాలుగా ఆరాధిస్తారు. అమ్మవారికి అభిషేకం చేసి చిన్నారులకు కుంకుమ దిద్ది కొత్తబట్టలు సమర్పిస్తారు. మహానవమి రోజు సువాసిని పూజ, దంపతి పూజ జరుపుకుంటారు.

శ్లోకంసర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,శరణ్యే త్య్రంబకేదేవి నారాయణి నమోస్తుతే

మహానవమి రోజున జరిపే పూజలు..

మహానవమి రోజున బాలపూజ, కన్యాపూజ, సువాసిని పూజ, దంపతి పూజలు చేస్తారు. కేరళతో సహా కొన్ని రాష్ట్రాల్లో ఆయుధ పూజ కూడా నిర్వహిస్తారు.



Related posts