SGSTV NEWS online
Telangana

మద్యం మత్తులో తడబడ్డాడు.. సెకన్లలో బావిలో ఉన్నాడు..





కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శివారులోని పెద్దపప్పాయపల్లి వద్ద ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిన వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శివారులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న హుజూరాబాద్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి, అతడిని సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఆ వ్యక్తి మద్యం మైకంలో ఉన్నట్లు గుర్తించారు. గురువారం రాత్రి 9:45 గంటల ప్రాంతంలో పెద్దపప్పాయపల్లి వద్ద ఈ ఘటన జరిగింది.


అగ్నిమాపక నియంత్రణ గదికి సమాచారం అందడంతో ఏఎల్‌ఎఫ్ కిరణ్, డ్రైవర్ ఆపరేటర్ కం ఫైర్ ఫైటర్ అసిస్టెంట్‌తో కూడిన బృందం రెస్క్యూ కిట్లు, తాళ్లు, ఇతర అవసరమైన పరికరాలతో ఘటనాస్థలానికి చేరుకుంది. అక్కడ సుమారు 50 అడుగుల లోతున్న వ్యవసాయ బావిలో గాదెపల్లి ప్రదీప్ (ఆకునూరు గ్రామం, సైదాపూర్ మండలం) పడిపోయి ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, తాళ్ల సహాయంతో ప్రదీప్‌ను బావి నుంచి సురక్షితంగా బయటకు తీశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు పక్కనే ఉన్న బావిలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం.


ఇలాంటి ప్రమాదాలు రిపీట్ కాకుండా ప్రజలు పాత బావుల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయాలని లేదా వాటికి రక్షణ కవచాలు అమర్చాలని హుజూరాబాద్ అగ్నిమాపక సిబ్బంది సూచించారు. బావుల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Also read

Related posts