SGSTV NEWS online
CrimeTelangana

30వ ప్లోర్‌ నుంచి పార్క్‌ చేసిన కారుపై పడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి.. షిఫ్టైన రెండ్రోజులకే



హైదరాబాద్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. నానక్‌రామ్‌గూడలో ఉన్న గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌పై నుంచి కింద పడి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ అపార్ట్‌మెంట్‌కు షిఫ్ట్‌ అయిన రెండ్రోజులకే అతను ఇలా చనిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


30 అంతస్తుల భవనంపై నుంచి కిందపడి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మరణించిన సంఘటన హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లాకు చెందిన 29 ఏళ్ల ఉప్పల భరత్ అనే యువకుడు బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే రెండ్రోజుల క్రితమే భరత్ హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌కు షిఫ్ట్ అయ్యాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. సోమవారం భరత్ అపార్ట్‌మెంట్‌లోని 30వ ఫ్లోర్‌ నుంచి కింద పార్క్ చేసిన ఒక కారుపై పడిపోయాడు.


అది గమనించిన అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బంది అతన్ని వెంటనే స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న భరత్ సమీప బంధువైన కిషోర్ ఘటనపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం భరత్‌ మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.


యూపీలో మరో ఘటన అక్టోబర్ మొదటి వారంలో యూపీలోని నోయిడాలో కూడా అచ్చం ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. అక్కడ కూడా సంభవ్ జైన్ అనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భవనంపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే పోలీసుల దర్యాప్తులో వ్యక్తిగత కారణాలు, భార్యతో గొడవలు, డిప్రెషన్ కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.

Also read

Related posts