Sharannavarathri Day2: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన అక్టోబర్ 12 సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శ్రీ గాయత్రి దేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ అలంకారం విశిష్టత ఏంటంటే..
Gayatri Devi: అక్టోబర్ 12 సోమవారం ఆశ్వయుజ శుద్ధ విదియ రోజు కనకదుర్గమ్మ గాయత్రి దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది.
ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః
యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాంకుశకశ్వా శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధారవిందయుగళం హసైర్వహంతీం భజే ||
గాయత్రీదేవిని ఆది శంకరాచార్యులు అనంతశక్తి స్వరూపిణిగా ఆరాధించారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తి, వేదమాతగా, ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిచ్చే సంధ్యా వందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తూ ఉండగా త్రిమూర్త్యాంశగా గాయత్రీ దేవి పూజలందుకుంటోంది. ప్రాతఃకాలంలో గాయత్రీగా, మధ్యాహ్న సమయంలో సావిత్రిగా, సాయంసంధ్య సమయంలో సరస్వతిగా ఉపాసకులు ఆరాధిస్తారు. సమస్త దేవతామంత్రాలకీ గాయత్రీ మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రీమంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేస్తారు. గాయత్రీ అమ్మవారిని దర్శించటం వలన ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగా కొలుస్తూ దర్శించడం వలన సకల మంత్రసిద్ధి తేజస్సు, జ్ఞానము పొందుతారు.
గాయత్రి ధ్యాన శ్లోకం
ఓం బ్రహ్మకుండికాహస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం
సర్వతత్త్వమయీంకవందే గాయత్రీం వేదమాతరమ్
గాయత్రీ మంత్రం
ఓం భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్
గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల వాక్సుద్ధి, తేజస్సు,బుద్ధి , చతుర్వేద పారాయణ ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.
గాయత్రీ అలంకారం విశిష్టత
“న గాయత్ర్యాః పరం మంత్రం, న మాతుః పరదైవతమ్”
తల్లిని మించిన దైవం లేదు, గాయత్రీని మించిన మంత్రం లేదని అర్థం. అందుకే, గాయత్రీ మంత్రాన్ని వేదాల సారం అని భావిస్తారు. నాలుగు వేదాలను అర్థం చేసుకోవడం ద్వారా లభించే ఆధ్యాత్మిక పుణ్యాన్ని కేవలం గాయత్రీ మంత్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారానే పొందవచ్చని నమ్ముతారు. గాయత్రీ ఉపాసన వల్ల బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. గాయత్రి మంత్ర జపం వల్ల వాక్సుద్ధి, బుద్ధి , తేజస్సు, చతుర్వేద పారాయణ ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.
గాయత్రి మంత్రం మూలం
సృష్టి ప్రారంభంలో గాయత్రీ మంత్రం బ్రహ్మదేవునికి అవతరించింది. గాయత్రీ దేవి అనుగ్రహంతో, బ్రహ్మ తన నాలుగు ముఖాల ద్వారా ఈ మంత్రాన్ని వివరించగా, అది నాలుగు వేదాల రూపం తీసుకుంది. మొదట్లో, గాయత్రీ మంత్రం కేవలం దేవతలకు మాత్రమే పరిమితమై ఉండేది. ఆ తర్వాత, విశ్వామిత్ర మహర్షి తీవ్రమైన తపస్సు ద్వారా గాయత్రీ మంత్రాన్ని సామాన్య ప్రజలకు అందించారు.
గాయత్రీ మంత్రానికి అపారమైన శక్తి ఉంది. దీనిని జపించడం వల్లనే పాపాలు, బాధలు నశిస్తాయి. వ్యాపార, ఉద్యోగ రంగాలలో విజయం కోసం, శత్రుబాధలు నశించేందుకు గాయత్రీ మంత్ర జపం ప్రయోజనకరం. దీనిని క్రమం తప్పకుండా జపించే విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఉత్తమ ఫలితాల కోసం విద్యార్థులు ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. వివాహం, సంతానానికి సంబంధించిన సమస్యలతో బాధపడేవారు కూడా గాయత్రిని ఆరాధిస్తే శుభఫలితాలు పొందుతారని విశ్వాసం.
