SGSTV NEWS online
CrimeTelangana

ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?



అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డలను బావిలోకి నెట్టేసి ఆ తల్లి కూడా అదే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపింది.. ఆ ముగ్గురి మృతదేహాలను బయటికితీసిన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. అప్పుల బాధలు, కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా గుర్తించారు.

ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి

మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కురవి మండలం లింగ్యాతండాకు చెందిన బానోతు నవీన్, అనూష దంపతులకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. వీరు ఇదే తండాలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.


అయితే కొన్నాళ్ల క్రితం నవీన్‌ ఫైనాన్స్ కంపెనీ ద్వారా ఆటో కొనుగోలు చేసి నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఆటో ద్వారా వచ్చిన సంపాదన ఫైనాన్స్ కిస్తీలు కట్టడానికి సరిపోకపోవడంతో, ఆ అప్పులు తీర్చడం కోసం నవీన్ మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. ఇలా అప్పులు ఎక్కువ కావడంతో నవీన్ తన ఇంటి స్థలాన్ని అమ్మి అత్తగారింటి వద్దే ఉంటున్నాడు. అయితే కొన్నాళ్లుగా ఇదే ఫైనాన్స్, చిట్టీ పైసల చెల్లింపుల విషయంపై భార్యాభర్తల మధ్య కలహాలు మొదలయ్యాయి.


ఈ క్రమంలో అనూష తల్లితో కూడా తగాదాలు పెరిగాయి. దీంతో తండా పెద్దమనుషులు వారం రోజుల క్రితం పంచాయితీ పెట్టి, వీరిని ఇల్లు ఖాళీ చేసి వేరే చోట ఉండాలని తీర్పు చెప్పారు. వరుస గొడవలు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష తనువు చాలించాలని నిర్ణయించుకుంది. తన కూతురు వర్షిణి, కొడుకు విశాల్ కృష్ణలతో కలిసి గ్రామ శివారులోకి వెళ్లి, అక్కడున్న ఓ వ్యవసాయ బావిలో దూకేసింది.


స్థానికులు వారిని గుర్తించి కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే నీట మునిగి కొడుకు, కూతురుతో సహా తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలిసిన భర్త నవీన్‌తో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Also read

Related posts