లబ్బీపేట(విజయవాడ తూర్పు): మరో వివాహిత మోజులో పడి పెళ్లైనా భార్యతో సరిగా గడపలేకపోయాడు ఆ ప్రబుద్ధుడు. నిత్యం నువ్వే గుర్తుకొస్తున్నావంటూ పాత బంధాన్ని కొనసాగించాలని ప్రియురాలిని వేధించాడు. దీనికి ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడై ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా వెళ్లి గొంతు కోసి కసిదీరా పొడిచి హత్య చేశాడు. అనంతరం తానూ గాయాలు చేసుకుని కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. సూర్యా-రావుపేట సీఐ చవాన్ కథనం ప్రకారం.. విజయవాడ అరండల్‌పేటకు చెందిన మహిళ (33)కు పెళ్లై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈమె కుటుంబం మూడేళ్ల పాటు అరండల్‌పేటలోని నాగరాజు ఇంట్లో అద్దెకు ఉన్నారు.
ఆ సమయంలో నాగరాజుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. నాగరాజుకు పెళ్లి కుదరడంతో ఆమె కుటుంబం మూడు నెలల కిందటే పక్క ఇంట్లోని రెండో అంతస్తుకు మారింది. నాగరాజుకు పెళ్లైనా భార్యతో సరిగా ఉండడం లేదు. తనతో సంబంధం కొనసాగించాలని మహిళను తీవ్రంగా వేధిస్తున్నాడు. మళ్లీ తమ ఇంట్లోకి అద్దెకు రావాలని ఆమెతో పాటు, భర్తను అడుగుతున్నాడు. దీనికి మహిళ నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన నాగరాజు ఆమెను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు
ఈ తరుణంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో నాగరాజు కత్తి తీసుకుని వెళ్లి దాడి చేశాడు. గొంతుకోసి శరీరంపై కసిదీరా పొడిచి చంపేశాడు. శరీరంపై 15 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అనంతరం తానూ చనిపోవాలని భావించి పొట్టపై, గొంతుపై గాయం చేసుకున్నాడు. భవనంపై నుంచి దిగివచ్చి పక్కన ఉన్న కాలువలో దూకాడు. స్థానికులు గమనించి నాగరాజును ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే తనకు చేతబడి చేయడం వల్లే ఆమెను మరిచిపోలేకపోతున్నానని, అందుకే చంపేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సూర్యారావుపేట పోలీసులు మహిళ మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Also read
- Navratri: దేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలు ఇవే.. నవరాత్రుల్లో దర్శిస్తే ప్రత్యేకమే!
- నేటి జాతకములు 9 అక్టోబర్, 2026
- మోనాలిసా అమ్మాయి అనుకున్నాడు.. గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే, ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..
- భార్య పుట్టినరోజు.. వస్తుందని బస్టాండ్‌లో ఆశగా ఎదురుచూశాడు.. చివరికి ఊహించని ఘటన
- విశాఖ: పాక్ హనీ ట్రాప్ కేసులో కొత్త ట్విస్ట్





