బాలకృష్ణుడిగా అల్లరి చేసిన శ్రీకృష్ణుడు, కురుక్షేత్రంలో అర్జునుడికి భగవద్గీతను బోధించిన జగద్గురువు- కర్తవ్యాచరణ, ఆత్మతత్వం, సమభావం, వంటి జీవన సత్యాలను ప్రపంచానికి అందించినందుకే జగద్గురువుగా కీర్తన
Lord Krishna Is Revered as Jagadguru : శ్రీకృష్ణ భక్తులు ఏడాది మొత్తం ఎదురు చూసే కృష్ణాష్టమి వచ్చేస్తోంది. కృష్ణుడంటే బాల్యక్రీడలతో అల్లరి చేసిన చిలిపికృష్ణుడు మాత్రమే కాదు! లోకాలకు జ్ఞానబోధ చేసిన జగద్గురువు! అందుకే శ్రీకృష్ణుడు గురువులకే గురువు ఆదిగురువు.
గీతాబోధతో జగద్గురువుగా మారిన కృష్ణుడు
నడిచే దైవంగా ఖ్యాతి చెందిన శ్రీ ఆదిశంకరాచార్యులు తాను రచించిన కృష్ణాష్టకంలో “కృష్ణం వందే జగద్గురుమ్” అని కీర్తిస్తూ, సమస్త సృష్టికి ఆయనే మార్గదర్శకుడని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడిని ‘జగద్గురువు’ అని పిలవడానికి ప్రధాన కారణం ఆయన సమస్త మానవాళికి ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని, ధర్మ మార్గాన్ని బోధించడమే! కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి అందించిన భగవద్గీత ద్వారా జీవిత పరమార్థాన్ని, కర్తవ్యాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పాడు. అసలు శ్రీకృష్ణుని జగద్గురువని ఎందుకు అంటారు? ఆ పరమార్థం ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
గురు తత్వం
లౌకిక, ఆధ్యాత్మిక చింతనలను సమన్వయం చేస్తూ జీవన గమ్యాన్ని చూపిన పరమ గురువుగా శ్రీకృష్ణుని సనాతన ధర్మం కీర్తిస్తుంది.
కాలాతీత సందేశం
శ్రీకృష్ణుడి మాటలు ఏ ఒక్క కాలానికో, ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని కాలాల మానవులకు, అన్ని ప్రాంతాల వారికి వర్తిస్తాయి.
భగవద్గీత బోధన
కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి భగవద్గీత బోధించడం ద్వారా శ్రీకృష్ణుడు ఒక మనిషి ఎలా బ్రతకాలో, కర్మను ఎలా ఆచరించాలో, సుఖదుఃఖాలను ఎలా ఎదుర్కోవాలో గీతాసారం ద్వారా సమస్త లోకానికి మార్గదర్శనం చేశాడు. అందుకే అయన జగద్గురువు అయ్యాడు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు బోధించిన గీతాసారం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
కర్తవ్యాచరణం
“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగో స్త్వకర్మణి”
అంటే మనం చేయాల్సిన కర్తవ్యాన్ని ఎలాంటి ఫలితం ఆశించకుండా నిష్కామంగా నిర్వర్తించాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు ఆచరించాలి. ప్రతిఫలం గురించి ఆశ లేదు కదా అని పని పట్ల నిర్లక్ష్యం తగదు. మనసా వాచా కర్మణా మన శక్తులన్నీ కేంద్రీకరించి కర్మను శ్రద్ధతో నిర్వహించాలి. అప్పుడు ఆ కర్మకు ఇవ్వాల్సిన ఫలితం గురించి భగవంతుడే చూసుకుంటాడు అని అర్ధం.
ఆత్మ నిత్యం
ఆత్మకు పుట్టుక, మరణం లేవు. శరీరం మాత్రమే పుడుతుంది, నశిస్తుంది. ఆత్మ ఎన్నటికీ నశించదు. ఆత్మ అగ్నిలో కాలదు, నీటిలో తడవదు. శరీరం అశాశ్వతం. అందుకే చనిపోయిన వారికోసం బాధపడకూడదు. మరణం శరీరానికే కానీ ఆత్మకు కాదు. అందుకే సత్యమైన ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసి సత్కర్మలు ఆచరించడం ద్వారా మనిషి జీవన్ముక్తుడవుతాడని కృష్ణ పరమాత్మ గీతలో బోధించాడు.
కామక్రోధాలు త్యజించడం
మనిషి వినాశనానికి మూలం కోరికలు. విపరీతమైన కోపం మనిషి పతనానికి మూలం. అందుకే మానవుడు కామక్రోధాలను త్యజించడం ద్వారా సాధకుడుగా మారవచ్చు.
శరణాగతి
ఆచరణీయమైన, అనుసరణీయమైన ధర్మాలను ఆచరిస్తూనే సకల ధర్మాలకు మూలమైన పరమాత్మను శరణాగతి చేయాలి. భక్తిమార్గంలో పయనించే వారు అంతిమంగా సర్వ ధర్మాలను విడిచి భగవంతుని శరణు వేడితే ముక్తి లభిస్తుందని భగవద్గీత చెబుతోంది.
సమభావం
మానవ జన్మ వచ్చిన తర్వాత సుఖదుఃఖాలు సహజం. సుఖం వస్తే పొంగి పోవడం, దుఃఖం వస్తే కుంగి పోవడం ఉండకూడదు. సుఖం, దుఃఖం, జయం, అపజయం, లాభం, నష్టం అన్నింటిని సమానంగా స్వీకరించాలి. ఈ స్థితప్రజ్ఞతను సాధించడమే సమభావం. సాధకుడు ఈ స్థితికి చేరుకున్నాక మోక్షానికి మార్గం సులువవుతుంది.
స్వధర్మమే పరమ ధర్మం!
కురుక్షేత్ర సంగ్రామంలో శత్రువర్గంలో ఉన్న దాయాదులు చూసి అర్జునుడు నిర్వేదానికి గురవుతాడు. ‘వీరందరూ నా బంధువులే! వీరిని సంహరించడం ద్వారా వచ్చే రాజ్యం నాకు అక్కర్లేదని’ నైరాశ్యానికి గురవుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి కర్తవ్యాన్ని బోధిస్తాడు. మనిషి తన స్వధర్మాన్ని ఎప్పుడు విడిచి పెట్టకూడదు. వంశపారంపర్యంగా సంక్రమించిన తన వృత్తి, తన వృత్తి రీత్యా ఏర్పడిన స్థానం ప్రకారం వచ్చిన ధర్మాన్ని వీడకూడదు. ఒక క్షత్రియుడిగా అర్జునుని ధర్మం శత్రువులను మట్టుబెట్టడం! క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చేయడమే! ధర్మం కోసం యుద్ధం చేయడం పాపం కాదు అంటూ ధనుర్భాణాలు విడిచిపెట్టిన అర్జునుడికి కర్తవ్య బోధ చేశాడు శ్రీ కృష్ణుడు.
ఇలా లోకహితం కోరుతూ మానవులందరికీ జ్ఞానబోధ చేసినందున శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. ఈ కృష్ణాష్టమి రోజు చిన్న చిన్న పాదాలు వేసి కృష్ణుని ఇంట్లోకి ఆహ్వానించడం మాత్రమే కాదు, కృష్ణుడు బోధించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమే అసలైన పండుగ. అదే మనం ఆ జగద్గురువుకు చేసే సిసలైన వందనం.
ఓం నమో భగవతే వాసుదేవాయ!
