SGSTV NEWS online
Spiritual

Hayagriva Jayanti: హయగ్రీవ జయంతి.. విద్య, జ్ఞానానికి అధిపతి అయిన ఈ విష్ణు అవతారం వెనుక కథ ఇదే!





Hayagriva Avatar Significance Telugu: విద్య, జ్ఞానం, వివేకానికి అధిపతిగా పూజించే హయగ్రీవ స్వామి ఎవరు? గుర్రపు తల, మానవ శరీరంతో విష్ణుమూర్తి ఈ అరుదైన అవతారం ఎందుకు ఎత్తారు? హయగ్రీవ జయంతి 2026 తేదీ, పూజా సమయం, అవతార కథ, ప్రసిద్ధ ఆలయాలు, మంత్రాల గురించి తెలుసుకుందాం.


Hayagriva Avatar Significance Telugu: దూ మత విశ్వాసాల ప్రకారం విష్ణుమూర్తిని విశ్వ రక్షకుడిగా పూజిస్తారు. లోకంలో అధర్మం పెరిగి, ధర్మానికి, సత్యానికి, జ్ఞానానికి ముప్పు ఏర్పడినప్పుడు విష్ణువు వివిధ అవతారాలను ధరించి ధర్మాన్ని కాపాడుతారని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి దశావతారాలు అందరికీ సుపరిచితమే అయినప్పటికీ.. ఆయనకు సంబంధించిన కొన్ని అరుదైన అవతారాలు కూడా ఉన్నాయి. అలాంటి విశిష్టమైన రూపాల్లో హయగ్రీవ అవతారం ఒకటి. గుర్రపు తల, మానవ శరీరంతో దర్శనమిచ్చే హయగ్రీవ స్వామిని విద్య, జ్ఞానం, వివేకం, వేదాలకు రక్షకుడిగా భక్తులు ఆరాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, విద్యాభివృద్ధి కోసం హయగ్రీవ స్వామిని పూజించడం ఆనవాయితీగా ఉంది. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. 2026లో హయగ్రీవ జయంతి ఆగస్టు 28, శుక్రవారం నాడు వచ్చింది.


హయగ్రీవ జయంతి 2026 ఎప్పుడు..?

పురాణాల ప్రకారం శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజునే శ్రీమహావిష్ణువు హయగ్రీవుడిగా అవతరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా హయగ్రీవ జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఆగస్టు 28, టక్రవారం శ్రావణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా హయగ్రీవుడిని పూజించుకోవడం విశేషంగా భావిస్తారు. విద్య, జ్ఞానం, వేదాలకు ప్రతీకగా హయగ్రీవుడిని భక్తులు ఆరాధిస్తారు. అయితే గుర్రం తలతో ఉన్న ఈ ప్రత్యేక రూపాన్ని విష్ణుమూర్తి ఎందుకు ధరించారు? హయగ్రీవ అవతారం వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి? ఆయనకు సంబంధించిన విశేషాలు, వృత్తాంతం ఏమిటో ఈ సందర్భంగా తెలుసుకుందాం.

హయగ్రీవ అవతారం అంటే ఏమిటి?

‘హయ’ అంటే గుర్రం, ‘గ్రీవ’ అంటే మెడ లేదా తల అని అర్థం. అందుకే గుర్రపు తలతో ఉన్న విష్ణువు రూపాన్ని హయగ్రీవుడిగా పిలుస్తారు. పురాణాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం హయగ్రీవ స్వామి జ్ఞానం, విద్య, వివేకం, వేద విజ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా శ్రీవిద్యా సంప్రదాయంలో కూడా హయగ్రీవ స్వామికి ప్రత్యేక స్థానం ఉంది. హయగ్రీవుడిని సాధారణంగా ప్రకాశవంతమైన తెల్లని వర్ణంతో, తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పద్మంపై ఆసీనుడిగా చిత్రిస్తారు. ఆయన చేతుల్లో శంఖం, చక్రం, పద్మం వంటి ఆయుధాలు లేదా వేద గ్రంథాలు కనిపిస్తాయి. ఈ రూపం పవిత్రత, జ్ఞానం, సత్యానికి ప్రతీకగా భావించబడుతుంది.



హయగ్రీవ అవతారం ఎందుకు ఎత్తారు?

హయగ్రీవ అవతారానికి సంబంధించి పురాణాల్లో భిన్నమైన కథనాలు కనిపిస్తాయి. వాటిలో ఒక ప్రసిద్ధ కథనం ప్రకారం హయగ్రీవుడు అనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి ఒక ప్రత్యేకమైన వరాన్ని పొందాడు. గుర్రపు తల కలిగిన వ్యక్తి చేత మాత్రమే తనకు మరణం సంభవించాలనే వరం అతడికి లభించిందని కథనం. వరబలంతో అహంకారానికి లోనైన హయగ్రీవ రాక్షసుడు లోకంలో కల్లోలం సృష్టించడం ప్రారంభించాడు. అంతేకాకుండా వేదాలను అపహరించి సముద్రంలో దాచిపెట్టాడని పురాణ కథ చెబుతుంది. వేదాలు అందుబాటులో లేకపోవడంతో యజ్ఞాలు, ధార్మిక కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడి, లోకంలో అజ్ఞానం పెరిగే పరిస్థితి ఏర్పడింది.

అప్పుడు విష్ణుమూర్తి గుర్రపు తల, మానవ శరీరంతో కూడిన హయగ్రీవ రూపాన్ని ధరించి రాక్షసుడిని సంహరించారని కథనం. అనంతరం సముద్రం నుంచి వేదాలను తిరిగి పొందిన విష్ణువు వాటిని బ్రహ్మదేవుడికి అప్పగించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా హయగ్రీవ అవతారం ద్వారా జ్ఞానాన్ని రక్షించడం, అజ్ఞానాన్ని తొలగించడం, ధర్మాన్ని పునరుద్ధరించడం అనే సందేశం వ్యక్తమవుతుంది.

మధు-కైటభులతో హయగ్రీవుడికి ఉన్న సంబంధం

హయగ్రీవ అవతారానికి సంబంధించి మరో పురాణ గాథ మధు, కైటభ అనే ఇద్దరు రాక్షసులతో ముడిపడి ఉంది. ఈ కథనం ప్రకారం మధు, కైటభులు వేదాలను అపహరించడంతో జ్ఞానానికి ముప్పు ఏర్పడింది. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ రూపాన్ని ధరించి వారిని సంహరించి వేదాలను తిరిగి రక్షించారని విశ్వాసం. పురాణాల్లో కథనాలు భిన్నంగా ఉన్నప్పటికీ, వాటిలోని ప్రధాన భావం మాత్రం ఒకటే.. జ్ఞానం, వేదాలు, ధర్మాన్ని రక్షించడం మరియు అజ్ఞానాన్ని నిర్మూలించడం.

ప్రసిద్ధ హయగ్రీవ దేవాలయాలు

భారతదేశంలోని పలు ప్రాంతాల్లో హయగ్రీవ స్వామికి ఆలయాలు ఉన్నాయి. వాటిలో అస్సాంలోని గౌహతి సమీపంలోని హాజోలో ఉన్న హయగ్రీవ-మాధవ ఆలయం ప్రముఖమైనది. ఈ ఆలయం హయగ్రీవ స్వామి ఆరాధనకు ప్రసిద్ధి చెందింది. అలాగే తమిళనాడులోని చెన్నై, నంగనల్లూరులో కూడా హయగ్రీవ స్వామికి అంకితమైన ఆలయం ఉంది. ఇక్కడ విద్య, జ్ఞానం కోసం భక్తులు ప్రత్యేకంగా స్వామిని పూజిస్తారు.

హయగ్రీవ స్వామి మంత్రాలు
విద్య, జ్ఞానం, ఏకాగ్రత, వివేకం కోసం హయగ్రీవ స్వామిని ఆరాధించే సమయంలో భక్తులు ఈ మంత్రాలను జపిస్తారు:

ఓం హయగ్రీవాయ నమః।
ఓం ఐం హ్రీం హ్రౌం హయగ్రీవాయ నమః।

యగ్రీవ జయంతి రోజున భక్తులు శ్రద్ధతో స్వామిని పూజించి, విద్యా జ్ఞానం, ఏకాగ్రత, వివేకం ప్రసాదించాలని ప్రార్థిస్తారు. హయగ్రీవ అవతారం కేవలం విష్ణువు యొక్క అరుదైన రూపంగానే కాకుండా.. జ్ఞానం ఎప్పటికీ అజ్ఞానంపై విజయం సాధిస్తుందనే ఆధ్యాత్మిక సందేశానికి ప్రతీకగా కూడా భావిస్తారు.

Also read

Related posts