Varalakshmi Vratam Date 2026: శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు రావడంతో వరలక్ష్మీ వ్రతం ఏ తేదీన ఆచరించాలనే సందేహం చాలామందిలో నెలకొంది. శాస్త్ర నియమాలు, పండితుల అభిప్రాయం, శృంగేరి సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేయాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
Varalakshmi Vratam 2026 Telugu: శ్రావణ మాసం అంటే హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కాలం. ఈ నెలలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మీ ఆరాధనకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా సుమంగళి స్త్రీలు కుటుంబ సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానాభివృద్ధి కోసం అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే పర్వదినం శ్రీ వరలక్ష్మీ వ్రతం. అయితే ఈ ఏడాది శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు రావడంతో వరలక్ష్మీ వ్రతం ఏ తేదీన చేయాలనే సందేహం చాలామందిలో నెలకొంది. శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి? పండితుల అభిప్రాయం ఏమిటి? తెలుసుకుందాం.
వరలక్ష్మీ వ్రతం ఎందుకు ప్రత్యేకం?
వరాలను ప్రసాదించే మహాలక్ష్మీదేవిని “వరలక్ష్మి”గా పూజించే ఈ వ్రతం సనాతన సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున మహిళలు కలశంలో లక్ష్మీదేవిని ఆవాహన చేసి, షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామార్చన, తోరపూజ, తాంబూల సమర్పణ, ముత్తైదువులకు వాయనాలు ఇవ్వడం వంటి ఆచారాలను నిర్వహిస్తారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే కుటుంబంలో సిరిసంపదలు, సౌభాగ్యం, ఆరోగ్యం, సంతానాభివృద్ధి, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం.
వరలక్ష్మీ వ్రతం తేదీపై ఎందుకు గందరగోళం?
సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. స్కంద పురాణం సహా అనేక ధర్మగ్రంథాలు కూడా ఇదే విధానాన్ని సూచిస్తున్నాయి. అయితే ఈ ఏడాది శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు రావడం, అలాగే పౌర్ణమి తిథి శుక్రవారం రోజునే ఉండడం వల్ల చాలామందికి సందేహం ఏర్పడింది. రెండో శుక్రవారం చేయాలా? లేక పౌర్ణమితో కూడిన శుక్రవారం చేయాలా? అనే ప్రశ్న తలెత్తింది.
శాస్త్రం ప్రకారం ఏ రోజు ఆచరించాలి?
ధర్మశాస్త్రాలలో పేర్కొన్న నియమాల ప్రకారం, పౌర్ణమి తిథి శుక్రవారాన్ని స్పృశించినప్పుడు ‘నోపాంతే భార్గవాదినే’ అనే ధర్మనియమం వర్తిస్తుంది. అందువల్ల పౌర్ణమితో కూడిన శుక్రవారం రోజున కూడా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 28న ఉదయం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం శాస్త్రసమ్మతమని పలువురు పంచాంగకర్తలు సూచిస్తున్నారు.
శృంగేరి సంప్రదాయం ఏమి చెబుతోంది?
శృంగేరి శ్రీ శారదా పీఠం సంప్రదాయంలో వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన ప్రధాన పూజలు సాయంకాలంలో నిర్వహిస్తారు. అయితే ఆగస్టు 28న సాయంత్రం పౌర్ణమి తిథి అందుబాటులో లేకపోవడంతో, ఆ సంప్రదాయాన్ని అనుసరించే వారు ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని సూచిస్తున్నారు. అంటే…
👉 ఉదయం పూజ చేసే వారు – ఆగస్టు 28న వరలక్ష్మీ వ్రతం చేయవచ్చు.
👉సాయంకాల పూజా విధానాన్ని అనుసరించే వారు (శృంగేరి సంప్రదాయం) – ఆగస్టు 21న వ్రతం చేయడం శ్రేయస్కరం.
భక్తే ప్రధానము
వ్రతం చేసే తేదీ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు. శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం మహాలక్ష్మీ ఆరాధనకు అనుకూలమైనదే. ముఖ్యమైనది తేదీ కంటే భక్తి, శ్రద్ధ, పవిత్రత. నిర్మలమైన మనస్సుతో, విశ్వాసంతో మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆమె అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి.
