SGSTV NEWS online
Hindu Temple History

ఈ ఆలయంలో మీ ప్రశ్న నిజమైతే ‘శిల’ తిరుగుతుంది! – ‘శివాజీ’ యుద్దానికి వెళ్లేముందు ఇక్కడికి వచ్చేవారట!



భారతదేశంలో ఎన్నో సుప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. ప్రాంతం, చరిత్ర, రూపం, పూజించే విధానాన్ని బట్టి ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. అలాగే, ఓ భక్తురాలి అక్రందనను విని అవతరించిన అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది. అదే, “తుల్జాపూర్ భవానీ దేవాలయం”. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కుటుంబానికి ఇలవేల్పుగానూ ఈ శక్తిస్వరూపిణి పూజలు అందుకున్నారు. అంతేకాదు, సంవత్సరంలో మూడుసార్లు గర్భాలయాన్ని వీడి, భక్తుల చెంతకు చేరి అనుగ్రహించే జగజ్జనని. త్వరితగతిన కోర్కెలను నెరవేర్చే కల్పవల్లి ఈ తుల్జాపూర్ భవానీ. మరి, ఈ మహిమాన్విత క్షేత్రం ఎక్కడ ఉంది? ఆలయ చరిత్ర, ఎలా చేరుకోవాలి? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

మహారాష్ట్ర, ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాపూర్లో ఈ మహిమాన్విత క్షేత్రం ఉంది. యమునాచల శిఖరంపైన, మందాకినీ నది ఒడ్డున వెలసిన తుల్జాపూర్ భవానీ దేవాలయం రాజులకోటను తలపిస్తుంది. పన్నెండో శతాబ్దం నుంచీ ఉన్న ఈ ఆలయానికి దేశవిదేశాల నుంచి భక్తులు వచ్చి, అమ్మవారిని పూజిస్తుంటారు. ఛత్రపతి శివాజీ కుటుంబం తమ ఇలవేల్పుగా కొలిచిన ఈ దేవతను భక్తిశ్రద్ధలతో పూజిస్తే మనసులోని కోర్కెలు నెరవేరతాయని ఓ విశ్వాసం. అంతేకాదు, ఓ భక్తురాలిని అనుగ్రహించేందుకు అమ్మవారు ఇక్కడ అవతరించి, స్వయంభువుగా కొలువుదీరిందని పురాణాలు చెబుతున్నాయి.

స్థలపురాణం ఏం చెబుతుందంటే?

స్కందపురాణం ప్రకారం, అమ్మవారు మహిషాసురుడిని సంహరించేందుకు భవానీగా అవతరించిందట. అలా ప్రకటితమైన భవానీమాత, ఓ భక్తురాలి అక్రందనను విని ఆమెను కరుణించేందుకు ఈ ప్రాంతంలో అవతరించి, స్వయంభువుగా ఇక్కడే ఉండిపోయిందనేది కథ. ఈ ప్రాంతంలో ఒకప్పుడు అనుభూతి అనే సాధ్వి ఉండేది. భర్త మరణించడంతో నిస్సహాయస్థితిలో కన్నబిడ్డను ఒడిలో ఉంచుకుని ఒంటరిగా ఈ యమునాచల శిఖరంపైన కూర్చుని ఎప్పుడూ అమ్మవారి ధ్యానంలో గడిపేదట. కొద్దిరోజులకు ఓ అసురుడు ఆమెను మోహించి, తపస్సుకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నించాడట. అప్పుడు ఆ సాధ్వి నిస్సహాయంగా ఏడుస్తూ గట్టిగా కేకపెట్టిందట. అది విన్న జగజ్జనని ఈ శిఖరంపైన సాక్షాత్కారించి, ఆ అసురుడిని అంతమొందించిందట. తర్వాత భక్తురాలి కోరికమేరకు యమునాచల శిఖరంపైనే ఉండిపోయిందట. అనంతరం కొన్ని రోజులకు ఈ ప్రాంతాన్ని పాలించిన మహామండలేశ్వర మరాదాదేవ అనే మరాఠా రాజు ఈ టెంపుల్ను నిర్మిస్తే, తర్వాత ఛత్రపతి శివాజీ డెవలప్ చేశాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది.

కదిలే అమ్మవారి విగ్రహం :

తుల్జ అనగా త్వరిత అని అర్థం. అంటే భక్తుల కోర్కెలను త్వరితగతిన తీర్చేందుకు ఈ అమ్మవారు తరలివస్తుందని విశ్వాసం. ‘తులజ, త్వరిత, తురజ’ భవానీగా పిలిచే ఈ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు రెండు మహాద్వారాలు స్వాగతం చెబుతాయి. వాటిని దాటి లోపలికి రాగానే 108 పవిత్ర తీర్థాలు కలిసిన కల్లోల తీర్థం దర్శనమిస్తుంది. ఆ నీటిని శిరస్సుపైన కొద్దిగా చల్లుకుని, ఆపై గోముఖ దగ్గరలో ఉన్న గణపతిని దర్శించుకుంటారు. ఆలయ నిర్మాణాన్ని చూస్తూ గర్భగుడి వద్దకు వచ్చే భక్తులకు స్వర్ణాభరణాలతో సర్వాలంకార భూషితురాలైన భవానీదేవి అష్టభుజిగా అనుగ్రహిస్తుంది. అలాగే, దేవికి కుడివైపున అమ్మను ప్రార్థిస్తున్న సాధ్వి అనుభూతి విగ్రహాన్నీ వీక్షించొచ్చు.

ఈ ఆలయంలో ఉన్న ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, మూడు అడుగుల్లో కూర్చుని దర్శనమిచ్చే ఈ దేవిని ప్రతిష్ఠించకపోగా అలాగే ఉంచేశారట. దాంతో అమ్మవారి విగ్రహం కాస్త కదులుతుందని చెబుతారు ఆలయ నిర్వాహకులు. ఇక, ఈ గర్భాలయానికి సమీపంగా ఓ వెండి మంచం కూడా ఉంటుంది. భవానీదేవి అప్పుడప్పుడూ శయనించేందుకే దాన్ని ఏర్పాటు చేశారట. ఇక్కడ అమ్మవారికి ఎదురుగా మహాదేవుడూ కొలువై, పూజలు అందుకోవడాన్ని కూడా చూడొచ్చు.

గర్భాలయాన్ని వీడి, భక్తుల చెంతకు!

ఇంకా ఈ మహిమాన్విత తుల్జాపూర్ భవానీ దేవాలయంలో చింతామణి పేరుతో ఓ గుండ్రని శిల దర్శనమిస్తుంది. ఆ రాయి మీద చేతిని గట్టిగా అదిమిపట్టి ఏదైనా ప్రశ్న వేస్తే, జవాబు ‘అవును’ అయితే ఆ శిల కుడివైపు తిరుగుతుందని, ‘కాదు’ అయితే ఎడమవైపు తిరుగుతుందని చెబుతారు. ఒకవేళ ఆ రాయి కదలకుండా స్థిరంగా ఉన్నట్లయితే, అనుకున్న పని కాస్త ఆలస్యం కావొచ్చనడానికి సూచనట. అంతేకాదు, ఛత్రపతి శివాజీ సైతం యుద్ధానికి వెళ్లేముందు ఇక్కడకు వచ్చి చింతామణి శిలమీద చేతులు ఉంచి ప్రశ్నించడాన్ని ఓ సంప్రదాయంగా పాటించేవాడట. అలా ప్రార్థిస్తున్న టైమ్లోనే ఓసారి అమ్మవారు ప్రత్యక్షమై, ఖడ్గాన్ని బహుమానంగా ఇచ్చిందనే కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇక, తుల్జాపూర్ భవానీ అమ్మవారు నిత్య పూజలను అందుకోవడంతోపాటు సంవత్సరానికి మూడుసార్లు గర్భాలయాన్ని వీడి భక్తులను అనుగ్రహించేందుకు ఆ పరాశక్తి ఊరేగింపుగా వచ్చే తీరును చూసేందుకు రెండుకళ్లూ చాలవు.

ఇక్కడికి ఎలా వెళ్లాలంటే?

మహారాష్ట్రలోని తుల్జాపూర్‌ భవానీ ఆలయానికి విమానంలో వెళ్లాలనుకునే భక్తులు ముందుగా షోలాపూర్‌ విమానాశ్రయంలో దిగాలి. అక్కడికి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ దేవాలయానికి వెళ్లేందుకు బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ రైల్లో వెళ్లాలనుకుంటే షోలాపూర్‌ జంక్షన్‌లో లేదా ఉస్మాన్‌బాద్‌ రైల్వే స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి ఇతర వాహనాలలో ఈ ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది.

Also read

Related posts