SGSTV NEWS online
Andhra PradeshCrime

పగలంతా ఇళ్లను గుర్తిస్తారు.. రాత్రిళ్లు దోచేస్తారు




విజయవాడ , పాయకాపురం, : శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా తడ వరకు దాదాపు 100 చోరీలు చేసిన కిలాడీ దంపతులను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నున్న పోలీస్ స్టేషన్లో డీసీపీ గుణ్ణం రామకృష్ణ ఈ వివరాలు వెల్లడించారు. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల రెండు భారీ చోరీలు, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం జరిగింది. నున్న పరిధిలో జరిగిన నేరాలపై కేసు నమోదు చేసిన సీఐ అహ్మద్ ఆలీ.. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన తోట శివకుమార్(36) ఈ నేరాలు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. శివకుమార్ ఓ చోరీ కేసులో జైలుకు వెళ్లినప్పుడు విజయవాడ రాజీవ్నగర్కు చెందిన తుమ్మల మనోజ్కుమార్, మరో యువకుడు పరిచయమయ్యారు. వారిద్దరికీ నేరాలు చేయడంలో ఇతడు శిక్షణ ఇచ్చాడు. ఇటీవల శివకుమార్ భార్యతో కలిసి విజయవాడలోని మనోజ్కుమార్ ఇంట్లో దిగాడు. అక్కడి నుంచి రోజూ రెక్కీ చేసి మూడు నేరాలు చేసి పరారయ్యాడు. పోలీసులకు ఘటనాస్థలంలో వేలిముద్రలు లభ్యమయ్యాయి. వాటిని పాత రికార్డులతో పోలిస్తే.. తోట శివకుమార్ వివరాలు వచ్చాయి. సెలవర్ లొకేషన్ ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించి విజయవాడలో దంపతులిద్దరినీ అరెస్టు చేశారు. వారిని విచారిస్తే.. మనోజ్కుమార్తో పాటు మరొకరి వివరాలు తెలిశాయి. రూ.15 లక్షల విలువైన 54 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.8 కిలోల వెండి సామగ్రిని స్వాధీనం చేసుకుని, మనోజ్కుమార్న అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. శివకుమార్ నేర చరిత్రను పరిశీలించిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అతడిపై ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 100 కేసులు నమోదైనట్లు తెలిసింది. ముందుగా ఇతడు ఒక ఊరును ఎంపిక చేసుకుంటాడు. భార్యతో కలిసి అక్కడ అద్దెకు దిగుతాడు. ఆ ప్రాంతంలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యం చేసుకుని రాత్రిళ్లు దోచుకుని పరారైపోతాడు. ఇలా ఇప్పటివరకు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి తదితర ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లు తేలింది.

Also read

Related posts