SGSTV NEWS online
CrimeTelangana

స్మార్ట్‌ఫోన్ కొనడం ప్రాణాల మీదకు తెచ్చింది.. ఈఎంఐ భయంతో యువకుడి ఆత్మహత్య!




మెదక్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఈఎంఐపై కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నర్సాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో జరిగింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

లింగాఫూర్ గ్రామానికి చెందిన సుధాకర్ మేస్త్రి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజువారీ కూలి పనులతో జీవనం సాగిస్తున్న అతడు, ఆధునిక అవసరాల దృష్ట్యా కొద్దిరోజుల క్రితం ఒక స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేశాడు. అయితే ఒకేసారి మొత్తం డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడంతో ఈఎంఐ పద్ధతిలో ఫోన్ తీసుకున్నాడు.

కొత్త ఫోన్ కొనుగోలు చేసిన ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. మూడు రోజుల క్రితం అతని మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఫోన్ ఆచూకీ లభించకపోవడంతో సుధాకర్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. చేతిలో ఫోన్ లేకపోయినా, దానికి సంబంధించిన ఈఎంఐలను మాత్రం ప్రతి నెలా చెల్లించాల్సి రావడం అతడిని మరింత కలవరపెట్టింది.


ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సుధాకర్, పోయిన ఫోన్‌కు కూడా వాయిదాలు చెల్లించాల్సి వస్తుందనే బాధతో మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో పొలానికి వెళ్లిన అతడు అక్కడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

Also read

Related posts