పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి.. కొత్త పుస్తకాలు, కొత్త యూనిఫాం, కొత్త ఆశలతో విద్యార్థులు స్కూల్ బాట పట్టారు. పాఠశాల తొలి రోజు పిల్లల్లో ఆనందాన్ని నింపాల్సిన వేళ… ఓ కుటుంబంలో ఆందోళన నింపింది. సంతోషంగా పాఠశాలకు వచ్చిన తొలి రోజే ఓ విద్యార్థి జీవితంలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ గేటుకు మామిడి తోరణం కడుతున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఉదయం ఆనందంగా స్కూల్‌కు వచ్చిన బాలుడు… క్షణాల్లో ఆసుపత్రి మంచంపై చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి చదువుల పండుగ మొదలైంది.. పిల్లల కేరింతలతో పాఠశాలలు కళకళలాడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఘన స్వాగతం పలికేందుకు మామిడి తోరణాలు, పూల అలంకరణలు ఏర్పాటు చేస్తున్నారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు స్వాగత ఏర్పాట్లు చేయాలని భావించారు.
తొలి రోజు పాఠశాలకు ఎంతో ఉత్సాహంగా వచ్చిన రామ్ చరణ్ అనే విద్యార్థి.. ఉపాధ్యాయులు, గ్రామస్తులతో కలిసి స్కూల్ గేటు అలంకరణ పనుల్లో పాల్గొన్నాడు. గేటుకు మామిడి తోరణం కడుతున్న సమయంలో సమీపంలో ఉన్న విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది. విద్యుత్ షాక్ కు రామ్ చరణ్ కింద పడిపోయాడు. విద్యుత్ షాక్ తో శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆందోళన చెందిన ఉపాధ్యాయులు, గ్రామస్థులు రామ్ చరణ్ ను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ షాక్ తో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని, రెండు రోజులపాటు అబ్జర్వేషన్ లో ఉంచుతున్నట్టు వైద్యులు చెప్పారు.
నాంపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రామ్ చరణ్ కొండమల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు తొలి రోజు కావడంతో రామ్ చరణ్ ఉదయం నవ్వుతూ స్కూల్‌కు వచ్చిన బిడ్డ, మధ్యాహ్నానికి ఆసుపత్రి మంచంపై ఉండటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





