SGSTV NEWS online
CrimeTelangana

అయ్యో దేవుడా.. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో నర్సింగ్ ఆఫీసర్ మృతి.. ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయొద్దు



మహబూబ్‌నగర్‌లో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ప్రిసిల్లా విధులకు వెళ్తుండగా రోడ్డు పక్కన నిలిపిన కారు డోర్‌ను డ్రైవర్ అకస్మాత్తుగా తెరవడంతో ఆమె స్కూటీతో పాటు కిందపడిపోయింది. తలకు తీవ్ర గాయాలవడంతో హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించినా ఫలితం లేక ఆదివారం మృతి చెందింది. ఈ ఘటనతో ఆస్పత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.


ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మర్లు ప్రాంతానికి చెందిన నడకతురు ప్రిసిల్లా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నర్సింగ్ ఆఫిసర్ గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ నెల 16న విధులకు హాజరయ్యేందుకు ఎప్పటిలాగానే ఇంటి నుంచి తన స్కూటీ పై బయలుదేరింది. ఈ క్రమంలో సంస్కార్ స్కూల్ సమీపంలోకి చేరుకోగానే అనుకోని ఘటన ఆమె మరణానికి కారణమయ్యింది. ఆమె రహదారిపై వెళ్తుండగా రోడ్డు ప్రక్కన నిలిపిన ఓ కారు డోరు అకస్మాత్తుగా తెరిచారు డ్రైవర్.. డోర్ ఒక్కసారిగా ఆమెకు బలంగా తాకింది. దీంతో స్కూటీతో పాటుగా ఆమె రోడ్డుపై పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ కు తరలించారు. ఒకరోజు చికిత్స అనంతరం ప్రిసిల్లా ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచింది.


ఇక ఈ నెల చివరలో నర్సు ప్రిసిల్లాతో కలిసి పనిచేస్తున్న వారిలో పలువురు బదిలీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారందరి కోసం ప్రత్యేకంగా ఆదివారం విందు ఏర్పాట్లు సైతం చేసుకున్నారు. ఇంతలోనే ప్రిసిల్లా యాక్సిడెంట్, ఆ తర్వాత మరణ వార్తతో వారంతా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అందరితో కలిసి మెలిసి ఉండే నర్సింగ్ ఆఫిసర్ ఆకస్మిక మరణం బాధాకరమని తోటి నర్సులు, సిబ్బంది ఆవేదన వ్యక్తంచేశారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



ఏదీ ఏమైనా నర్సింగ్ ఆఫిసర్ యాక్సిండెంట్ ఘటనతో ఒక్కసారిగా పాలమూరు జిల్లా ఉలిక్కిపడింది. కారు ఓనర్లు, డ్రైవర్లు తమ వాహన డోర్లు తెరిచే ముందు తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు

Also read

Related posts