తిరుమలతోపాటు అన్ని ఆలయాల్లోనూ బలి పీఠం – దీని విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి
హిందూ ధర్మంలో పూజలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలిసిందే. పూజల్లో ఎన్నో రకాలు ఉంటాయి. భగవంతుడు తమను కాపాడాలని, సుఖసౌఖ్యాలను అందించాలని జనం మొక్కుతారు. ఇందుకోసం పలు రకాల పూజలు చేస్తారు. అయితే, మీకు భూత బలి గురించి తెలుసా? దాన్ని ఎలా నిర్వహిస్తారు? పద్ధతి ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ప్రతీ వైష్ణవ, శైవ ఆలయాల్లోనూ గర్భగుడికి ఎదురుగా, ధ్వజస్తంభానికి అత్యంత సమీపంలో ‘బలిపీఠం’ తప్పనిసరిగా దర్శనమిస్తుంది. దీనిని కేవలం ఒక రాతి కట్టడంగా కాకుండా, ఆలయ రక్షణకు, సమస్త జీవుల తృప్తికి ప్రతీకగా భావిస్తారు.
ఆలయంలోని మూలవిరాట్టుకు నిత్యం షోడశోపచార పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత నైవేద్యం కూడా సమర్పిస్తారు. అనంతరం ఆ ప్రసాదంలోని కొంత భాగాన్ని ఈ బలిపీఠం మీద ఉంచుతారు. దీన్నే శాస్త్రం ప్రకారం “భూతబలి” లేదా “బలిహరణం” అంటారు. ఇక్కడ “బలి” అంటే ప్రాణాలు తీయడం కాదు, సమర్పించడం లేదా త్యాగం అని అర్థం. లోకంలోని సమస్త ప్రాణికోటి ఆకలి తీరాలని, ఈ విశ్వం శాంతితో సౌఖ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటూ సమర్పించే అన్నమే ఈ భూతబలి! ఇది అనాదిగా వస్తున్న ఆచారం. దీని వెనుక విశ్వజనీనమైన ప్రేమ సందేశం దాగి ఉందని చెబుతారు. ఈ బలి అన్నాన్ని ఆలయ పరిసరాల్లో ఉండే పక్షులు, కీటకాలు ఆహారంగా స్వీకరిస్తాయి. అంటే, మనిషితోపాటు సృష్టిలోని ప్రతీ చిన్న జీవికి కూడా జీవించే హక్కు ఉందనే ఉన్నతమైన భావనను ఈ సాంప్రదాయం ప్రతిబింబిస్తుందని చెబుతారు.
పంచభూతాల ఆరాధన : హిందూ సనాతన ధర్మంలో ప్రకృతిని, పంచభూతాలను దైవ సమానంగా ఆరాధించే అద్భుతమైన సంప్రదాయం ఉంది. గాలి, నీరు, నిప్పు, నింగి, నేలను జీవనాధారంగా గుర్తించి పూజిస్తారు. పల్లె ప్రాంతాల్లో చెట్టుకు, పుట్టకు, రాళ్లకు సైతం పూజలు చేస్తారు. అవి మన జీవితంలో అంతర్భాగం అని విశ్వసిస్తారు. పల్లెల్లో ఏడాదికోసారి పర్వదినాల్లో బలి చల్లడం కూడా తెలిసిందే. గ్రామం చుట్టూ బలి అన్నం చల్లుతారు. ఈ సమయంలో గ్రామంలోకి బయటి వారిని రానివ్వరు. గ్రామంలోని వారిని బయటకు వెళ్లనివ్వరు. ఇలా చేస్తే దుష్ట శక్తులు రాకుండా ఉంటాయని నమ్ముతారు.
నైతిక సందేశం :
బలిపీఠం ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని కూడా అందిస్తుందని చెబుతారు. మనిషిలోని అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను త్యజించాలని సూచిస్తుంది. ముఖ్యంగా ‘అహంకారం’ వదిలిపెట్టాలని చెబుతుంది. భక్తులు గుడిలోకి ప్రవేశించే ముందే తమలోని అహంకారాన్ని, చెడు ఆలోచనలు ఈ బలిపీఠం వద్దే విడిచిపెట్టి, పవిత్రమైన మనసుతో భగవంతుడి సన్నిధిని చేరాలని సూచిస్తుంది.
