SGSTV NEWS online
Spiritual

Garuda Purnam: కొడుకు లేకపోతే అంతిమ సంస్కారాలు ఎవరు చేయాలి? గరుడ పురాణం చెబుతున్న ఆసక్తికర వాస్తవాలు!



Garuda Purnam: హిందూ ధర్మంలో మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ఉండే 16 సంస్కారాల్లో అంతిమ సంస్కారం అత్యంత కీలకమైనది. ఒకవేళ మృతుడికి కుమారులు లేకపోతే ఆ కర్మకాండలు నిర్వహించే అధికారం ఎవరికి ఉంటుంది? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? పూర్తి వివరాలు మీకోసం.

మనిషి జీవనయానంలో 16 సంస్కారాలకు విశిష్ట స్థానం ఉంది. అందులో చివరిదైన ‘అంత్యేష్టి’ లేదా అంతిమ సంస్కారం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఆత్మకు ప్రేత యోని నుంచి విముక్తి ప్రసాదించి, పితృ లోకానికి చేర్చే వారధి అని గరుడ పురాణం చెబుతోంది. సాధారణంగా తండ్రికి కొడుకే ముఖాగ్రి ఇవ్వాలని, పిండ ప్రధానం చేయాలని మన సమాజంలో ఒక బలమైన నమ్మకం ఉంది. అయితే, మారుతున్న కాలంలో లేదా అనివార్య కారణాల వల్ల కొడుకు లేని పక్షంలో ఆత్మకు సద్గతి కలగదా? అంటే.. మన శాస్త్రాలు ఇందుకు అద్భుతమైన ప్రత్యామ్నాయాలను సూచించాయి.


వారసుడు లేకపోతే వారే కర్తలు
గరుడ పురాణం ప్రకారం, అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఒక క్రమ పద్ధతి ఉంది. ఒకవేళ కుమారుడు అందుబాటులో లేకపోయినా లేదా లేకపోయినా ఈ కింది వారు ఆ బాధ్యతను తీసుకోవచ్చు:

మనుమడు లేదా మునిమనుమడు: కుమారుడి కొడుకు (మనుమడు) లేదా మనవడి కుమారుడు (మునిమనుమడు) అధికారాన్ని కలిగి ఉంటారు.

ధర్మపత్ని: భర్త మరణించినప్పుడు కుమారులు లేకపోతే, భార్యకు ఆ కర్మకాండలు నిర్వహించే పూర్తి హక్కు ఉంటుంది. ఆమె శ్రాద్ధ తర్పణాలను కూడా చేయవచ్చు.

కుమార్తెలు: నేటి ఆధునిక కాలంలో కూతుళ్లు అంతిమ సంస్కారాల్లో పాలుపంచుకోవడం మనం చూస్తున్నాం. శాస్త్రాల ప్రకారం, కుమారులు లేని పక్షంలో కుమార్తెలు ఈ పవిత్ర కార్యాన్ని నిర్వర్తించవచ్చు. ఇది కేవలం సామాజిక మార్పు మాత్రమే కాదు, ధర్మబద్ధమైన చర్య కూడా.

సోదరుడు లేదా సోదరుడి కుమారుడు: తోడబుట్టిన తమ్ముడు లేదా అన్న, లేదంటే వారి కుమారులు కూడా అంతిమ క్రియలు చేయవచ్చు.

శిష్యుడు లేదా స్నేహితుడు: ఒకవేళ రక్త సంబంధీకులు ఎవరూ లేని పక్షంలో, మృతుడికి అత్యంత సన్నిహితుడైన శిష్యుడు లేదా ప్రాణ స్నేహితుడు శాస్త్రోక్తంగా సంస్కారాలు నిర్వహించవచ్చు.

విధివిధానాలతో నిర్వహించే అంతిమ సంస్కారం మాత్రమే ఆత్మకు శాంతిని చేకూరుస్తుంది. కర్త ఎవరన్నది ముఖ్యం కాదు, వారు చేసే సంకల్పం మరియు భక్తి ప్రధానం, అని పండితులు వివరిస్తున్నారు.


పిండప్రధానం ఎందుకు ముఖ్యం?

అంతిమ సంస్కారం తర్వాత జరిగే పిండప్రధానం, తర్పణం ఆత్మ తృప్తికి ఎంతో అవసరం. ఇవి లేకపోతే ఆత్మ ఈ లోకంలోనే భ్రమించి ఇబ్బందులు ఎదుర్కొంటుందని గరుడ పురాణం హెచ్చరిస్తోంది. కాబట్టి, కర్త ఎవరైనప్పటికీ శాస్త్రోక్తంగా పది రోజుల కర్మలు, ఏకోద్దిష్ట శ్రాద్ధం నిర్వహించడం ద్వారా పితృదేవతలకు మోక్షం లభిస్తుంది.

అవగాహన అవసరం

మరణం తర్వాత ఆత్మ ప్రయాణం సుఖమయం కావాలంటే సంస్కారాలు సక్రమంగా జరగాలి. కొడుకు లేడనే దిగులుతో ఆత్మను అశాంతికి గురిచేయడం కంటే, శాస్త్రం చెప్పిన ప్రత్యామ్నాయాలను అనుసరించి గౌరవప్రదంగా వీడ్కోలు పలకడమే ఉత్తమ మార్గం. మన సంస్కృతిలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి సందేహానికి ఒక వివరణ ఉందని గరుడ పురాణం మరోసారి నిరూపిస్తోంది.

Related posts