SGSTV NEWS online
Spiritual

గరుడపురాణం ప్రకారం ఆత్మ చేరుకునే 9వ పట్టణం బహుపాదపురం – ఇక్కడ అనుభవించే శిక్షలేంటో తెలుసా..?





Garuda Purana Part 09: గరుడ పురాణం
మరియు ఇతర పౌరాణిక గ్రంథాల ప్రకారం, మరణానంతరం జీవుడు (ఆత్మ) యమలోకానికి చేసే ప్రయాణం అత్యంత కష్టతరమైనదిగా వర్ణించబడింది. ఈ ప్రయాణంలో బహుపాదపురం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఇక్కడికి ఆత్మ ఎలా చేరుకుంటుంది. ఎలాంటి శిక్షలు అనుభవిస్తుంది. చేరుకున్న తర్వాత పడే శిక్షలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బహుపాదపురానికి ఆత్మ చేరుకోవడానికి పట్టే

సమయం: జీవుడు తన ప్రయాణంలో 9వ నెలలో (మరణించిన దాదాపు 270 రోజుల తర్వాత) బహుపాదపురం చేరుకుంటాడు. యమలోక మార్గంలో మొత్తం 16 నగరాలు ఉంటాయని, అందులో బహుపాదపురం ఒకటి అని పురాణాలు చెబుతున్నాయి.

బహుపాదపురానికి ప్రయాణం ఎలా సాగుతుంది?:

మరణానంతరం యమదూతలు ఆత్మను పాశాలతో బంధించి తీసుకువెళ్తారు. ఈ ప్రయాణం పొడవునా ఆత్మకు విశ్రాంతి ఉండదు. ఆత్మ తన కర్మల ఫలితంగా ఏర్పడిన సూక్ష్మ శరీరం (యాతనా శరీరం) తో ప్రయాణిస్తుంది. మార్గంలో కేవలం కుటుంబ సభ్యులు పెట్టే మాసిక శ్రాద్ధాలు, తిథి పిండాల వల్ల వచ్చే శక్తితోనే ఆత్మ ముందుకు సాగుతుంది.

మార్గంలో కష్టాలు మరియు బాధలు:

బహుపాదపురానికి చేరుకునే ముందు ఆత్మ అనేక నగరాలను (సౌమ్యపురం, శౌరిపురం, గంధర్వపురం మొదలైనవి) దాటుకుంటూ వస్తుంది. ఈ క్రమంలో అనుభవించే బాధలు చాలా ఘోరంగా ఉంటాయట. ఆత్మకు ఆకలి దప్పులు తీవ్రంగా ఉంటాయట. మార్గంలో నీరు, ఆహారం దొరకవు. బంధువులు ఇచ్చే పిండం అందకపోతే ఆత్మ తీవ్రమైన ఆకలితో విలవిలలాడుతుందట. అలాగే ఆత్మ భరించలేని ఎండ, కటిక చీకటి, ముళ్ళ దారులు, మండుతున్న ఇసుక తిన్నెలపై నడవాల్సి ఉంటుందట.

బహుపాదపురంలో శిక్షలు మరియు అనుభవాలు:

బహుపాదపురం చేరుకున్నాక ఆత్మ పడే బాధలు వర్ణణాతీతమట. అక్కడికి వెళ్లగానే.. ఆత్మకు తన గత జన్మ జ్ఞాపకాలు, చేసిన తప్పులు గుర్తుకు వచ్చి తీవ్రమైన పశ్చాత్తాపానికి గురవుతుందట. ఆ సమయంలో బంధువులు పెట్టే మాసిక పిండాన్ని ఆత్మ భక్షిస్తుందట. ఒకవేళ ఆచారాలు సరిగ్గా జరగకపోతే, ఆకలితో అలమటిస్తూ యమదూతల చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుందట. బహుపాదపురంలో శిక్షలు అంటే శారీరక హింస కంటే మానసిక వేదన ఎక్కువగా ఉంటాయట. తన వారిని విడిచిపెట్టి, ఒంటరిగా యమధర్మరాజు సభవైపు సాగాలనే భయం ఆత్మను పీడిస్తుందట. ఈ ప్రయాణం అంతా జీవుడు బ్రతికున్నప్పుడు చేసిన పాప పుణ్యాల మీద ఆధారపడి ఉంటుందట. దానధర్మాలు, సత్కర్మలు చేసిన వారికి ఈ ప్రయాణం కొంత ఉపశమనంగా ఉంటుందని గరుడపురాణంలో చెప్పబడిందట.

గమనిక : ఇక ఆత్మ తన యమలోక ప్రయాణంలో 10వ పట్టణమైన దుఖఃదానికి ఎలా చేరుకుంటుంది. ఎన్ని కష్టాలు, బాధలు అనుభవిస్తుంది. అక్కడ ఆత్మకు విధించే భయంకరమైన శిక్షలు ఏంటి..? అనే విషయాలు రేపటి కథనంలో తెలుసుకుందాం.

Related posts