SGSTV NEWS online
HealthLifestyle

Painkillers:మీరు వాడే పెయిన్ కిల్లర్  మాత్రలు ఎంత ప్రమాదకరమో తెలుసా?



సాధారణంగా నొప్పి వచ్చినప్పుడు చాలా మంది వెంటనే పెయిన్ కిల్లర్ తీసుకోవడం అలవాటుగా చేసుకుంటారు. తలనొప్పి, నడుము నొప్పి, జాయింట్ పెయిన్ వంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ మందులు త్వరగా తగ్గిస్తాయి. అయితే తాజాగా వచ్చిన ఒక అధ్యయనం మాత్రం కొన్ని రకాల పెయిన్ కిల్లర్లు సరైన విధంగా వాడకపోతే డ్రగ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధనలో ముఖ్యంగా గాబాపెంటిన్, ప్రెగాబాలిన్ వంటి పెయిన్ కిల్లర్లను పరిశీలించారు. ఇవి నరాల నొప్పి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలకు సాధారణంగా ఇవ్వబడతాయి. మొదట్లో ఈ మందులను ఇతర బలమైన నొప్పి మందులకు సేఫ్ ప్రత్యామ్నాయంగా భావించారు. కానీ ఇప్పుడు తెలుస్తున్నది ఏమిటంటే, ఇవి కూడా పూర్తిగా ప్రమాదరహితం కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రాణాలకే ప్రమాదం

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ మందుల వాడకం  పెరిగింది. ముఖ్యంగా దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్న వారికి డాక్టర్ లు ఇవి సూచిస్తున్నారు. అయితే చాలా మంది ఈ మందులను డాక్టర్ సలహా లేకుండా కూడా వాడుతున్నారు. ఇదే అసలు సమస్యకు కారణమవుతోంది. అవసరానికి మించి లేదా సరైన విధంగా కాకుండా తీసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ మందులను ఒంటరిగా తీసుకోవడం కంటే, ఇతర మందులతో కలిపి తీసుకున్నప్పుడు ప్రమాదం మరింత పెరుగుతుంది.

ముఖ్యంగా నిద్ర మాత్రలు, సెడేటివ్స్ లేదా నరాలపై ప్రభావం చూపే మందులతో కలిసి తీసుకుంటే తీవ్రమైన సమస్యలు రావచ్చు. ఇలా కలిపి వాడటం వల్ల శరీరంలో మందుల ప్రభావం అధికమై డ్రగ్ పొయిజనింగ్ కు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగించవచ్చు.

డ్రగ్ పాయిజనింగ్ అంటే ఏమిటి?

డ్రగ్ పాయిజనింగ్ అంటే మందులను ఎక్కువ మోతాదులో తీసుకోవడం లేదా తప్పుగా వాడటం వల్ల శరీరంలో విష ప్రభావం ఏర్పడడం. ఇది ముఖ్యంగా కాలేయం, మూత్రపిండాలు, మెదడు వంటి అవయవాలపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు పరిస్థితి అదుపులో లేకపోతే ప్రాణాపాయం కూడా కలగవచ్చు. ఈ మందులను ఎక్కువకాలం వాడటం వల్ల శరీరం వాటికి అలవాటు పడుతుంది. దీనిని డిపెండెన్సీ అంటారు. అంటే ముందుగా ఇచ్చిన మోతాదు సరిపోక, మళ్లీ ఎక్కువ మోతాదు అవసరం అవుతుంది. ఇది మరింత ప్రమాదకర పరిస్థితికి దారితీస్తుంది. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెరుగుతాయి.

ఈ జాగ్రత్తలు తీసుకోండి


ఎలాంటి పెయిన్ కిల్లర్ అయినా డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ మందులు తీసుకోవాల్సి వస్తే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. చిన్న చిన్న నొప్పుల కోసం తరచూ మందులు వాడే అలవాటు తగ్గించుకోవాలి. సమస్యకు అసలు కారణం ఏమిటో తెలుసుకొని దానికి సరైన చికిత్స తీసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం కూడా ముఖ్యమే. సరైన ఆహారం, వ్యాయామం, తగిన నిద్ర ఉంటే చాలా వరకు నొప్పులను సహజంగా తగ్గించుకోవచ్చు. ప్రతి చిన్న సమస్యకు మందులపై ఆధారపడటం ఆరోగ్యానికి మంచిది కాదు. పెయిన్కల్లర్లు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కానీ అవి పూర్తిగా సురక్షితమని అనుకోవడం తప్పు. తాజా అధ్యయనం స్పష్టం చేస్తున్నది ఏమిటంటే, ఈ మందులను జాగ్రత్తగా వాడకపోతే డ్రగ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది.



Related posts