SGSTV NEWS online
Famous Hindu TemplesSpiritual

నాడి గణపతి మహాత్యం- అవహేళన చేసిన బ్రిటిష్ గవర్నర్కు బుద్ధి చెప్పిన వైనం- ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?


రాతి విగ్రహానికి ప్రాణం ఉంటుందా అని ప్రశ్నించిన బ్రిటిష్ గవర్నర్‌- ఆయనకే ఆశ్చర్యం కలిగించిన గణపతి ఆలయం- నాడి కొట్టుకునే వినాయకుడిగా ప్రసిద్ధి



Nadi Ganapathi Temple Mystery : గణపతి అంటే చాలామందికి ఇష్టమైన దైవం. ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా గణపతి ఆశీర్వాదం ఉండాల్సిందే! ఏ నోములు, వ్రతాలు, యజ్ఞయాగాది క్రతువులు చేయాలన్నా ముందుగా విఘ్నేశ్వరుని పూజించాల్సిందే! వినాయకుని ప్రార్ధించకుండా చేసిన పనులు విజయవంతం కావన్న విశ్వాసం కూడా హిందూ సంప్రదాయంలో బలంగా ఉంది. దేశవ్యాప్తంగా గణపతి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఆలయం వెనుక ఒక అద్భుతమైన చరిత్ర కూడా ఉంటుంది. అలాంటి అద్భుత ఆలయాల్లో అరుదైన ఈ గణపతి ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. ఇంతకూ ఈ అరుదైన గణపతి ఆలయం ఎక్కడుంది? ఆ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.



బ్రిటిష్ గవర్నర్కు రుజువైన సత్యం
బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ గణపతి ఆలయంలో మూలవరుల విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంటే అప్పటి గవర్నర్ ఈ ఆలయానికి వచ్చి రాతికి ప్రాణం ఉంటుందా అని హేళన చేశాడంట! అయితే అందుకు సమాధానంగా ఒక సిద్ధయోగి ఈ విగ్రహానికి ప్రాణం ఉందన్న సంగతి రుజువు చేసి, ఆ గవర్నర్ స్వయంగా ఆలయానికి వచ్చి నమస్కరించేలా చేశాడు. మరి ఈ మహిమాన్వితమైన గణపతి ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ఏం జరిగిందనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.



కుర్తాళం
తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాలో కుర్తాళం జలపాతం ఉంది. ఇక్కడే మౌన స్వామి మఠం, కుర్తాల పీఠం, గణపతి ఆలయం ఉన్నవి. ఇక్కడ అద్భుత జలపాతం ఉండగా, ఈ జలపాతంలోని మూలికలు ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తాయని విశ్వాసం. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో రుజువైన సత్యం.



చిత్రావతి జలపాతం
కుర్తాళంలో ఉన్న చిత్రావతి జలపాతం దాదాపుగా అరవై అడుగుల ఎత్తు నుంచి అమిత వేగంగా క్రిందకు దూకుతుంది. ఈ జలపాతం నీటిలో అనేక రకాల మూలికలు లభ్యమవుతాయి. ఈ జలపాతంలో స్నానం చేస్తే చికిత్సకు లొంగని మొండి వ్యాధులు సైతం నయమవుతాయి. అంతేకాదు మానసిక వికలాంగులు ఈ నీటిలో స్నానం చేస్తే మానసిక రుగ్మతతో పాటు అందుకు కారణమైన ఎన్నో శారీరక సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.



నాడీ గణపతి
ఇక్కడ వెలసి ఉన్న గణపతి ఆలయం అత్యంత ప్రాచీనమైనది, ఎంతో మహిమాన్వితమైనది. ఇక్కడ వెలసి ఉన్న గణపతిని ‘నాడి గణపతి’ అని పిలుస్తారు. ఇలా నాడి గణపతి అని పిలవడానికి కారణం ఏంటంటే, మహా సిద్ధయోగి మౌనస్వామి తపస్సు చేయడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ ఒక మఠాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ముందుగా శ్రీ సిద్దేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించారు.

మద్రాస్ గవర్నర్ వ్యంగ్యం
ఆ తరువాత ఇక్కడ గణపతి దేవుని ప్రతిష్ఠించి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలని భావించగా, అది తెలిసిన మద్రాస్ గవర్నర్ ఎడ్వార్డ్ రాతికి ప్రాణ ప్రతిష్ఠ ఏంటి అంటూ హేళనగా అన్నాడు. ఆ సిద్ద యోగి ఒక వైద్యుడిని పిలిపించమని చెప్పగా, అతడు వైద్యుడిని పిలిపిస్తాడు. మౌనస్వామి వైద్యుడితో విగ్రహానికి నాడి పరీక్షించమని చెప్పగా, అతడు కూడా విగ్రహానికి ప్రాణం ఉండదు కదా అంటూనే, పరీక్షించి నాడి చప్పుడు లేదని చెప్తాడు.

గణపతి మహత్యం
అప్పుడు మౌనస్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇప్పుడు చూడండి అని చెప్పగా, స్టెతస్కోప్తో పరిశీలించగా ఆశ్చర్యంతో ఆ వైద్యుని ఒళ్లు జలదరించింది! గణపతి విగ్రహానికి మనిషి వలే నాడి కొట్టుకుంటుందని చెప్పాడు. దీంతో ఈ అద్భుతాన్ని చూసిన ఆ వైద్యుడు, బ్రిటిష్ గవర్నర్ మౌనస్వామి దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకొని గణపతికి నమస్కరించి అక్కడి నుంచి నిష్క్రమించారు.

నాడి గణపతి పేరు ఇలా వచ్చింది?
ఇలా మౌనస్వామి మహిమతో ఇక్కడ వెలసిన గణపతి దేవుడికి నాడి గణపతి అనే పేరు వచ్చింది. అయితే ఒకసారి ఏ కారణం చేతనో ఇక్కడ స్వామివారి తొడల నుంచి శబ్దం రావడం వల్ల స్వామి వారి విగ్రహానికి తొడలు కనిపించకుండా ధోవతి కట్టడం మొదలు పెట్టారు.

దర్శనఫలం
పచ్చని ప్రకృతి సోయగాలు ఓ వైపు, ఉరకలేసే జలపాతం మరోవైపు! ఇలా ప్రకృతి ఒడిలో వెలసిన ఈ మహిమ గల ఆలయానికి భక్తులు ఏడాది మొత్తం అధిక సంఖ్యలో వచ్చి నాడి గణపతిని, మౌనస్వామి మఠాన్ని, శ్రీ సిద్దేశ్వరి పీఠాన్ని దర్శిస్తుంటారు. ఒక్కసారి ఈ కుర్తాళం జలపాతంలో స్నానం చేసి, నాడీ గణపతిని దర్శిస్తే జీవితంలో ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవని విశ్వాసం. మనం కూడా కుర్తాళం దర్శించి, ఆ నాడీ గణపతి ఆశీస్సులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం. సర్వే జనా సుఖినోభవంతు! లోకాస్సమస్తా సుఖినోభవంతు!

ఓం గం గం గణపతయే నమః!






Related posts