ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 2026 ఉగాది వేడుకల సందర్భంగా ప్రకటించిన ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారానికి కృష్ణాజిల్లా ఉయ్యూరు కేంద్రంగా సాహిత్య , కళా మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న “సరస భారతి” సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు ఎంపిక కావడం సాహిత్య రంగానికి గౌరవకారణంగా నిలిచింది.
గబ్బిట దుర్గాప్రసాద్ గారు 1940 జూన్ 27న కృష్ణాజిల్లా ఉయ్యూరులో జన్మించారు. తెలుగు సాహిత్యంపై ఆసక్తి పెంచుకుని ఉన్నత విద్యగా ఎం.ఏ (తెలుగు), బి.ఎడ్ పూర్తిచేసి, 1963 నుండి 1998 వరకు ఉపాధ్యాయునిగా సేవలందించారు. పదవీవిరమణ అనంతరం పూర్తిస్థాయిలో సాహిత్య సేవకు మరియు వారి కుటుంబ వారసత్వంగా ఉన్న స్థానిక కొత్త వంతెన సెంటర్ లోని శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు
అంకితమయ్యారు.
2009లో ఆయన స్థాపించిన “సరస భారతి” సంస్థ ద్వారా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నారు. సాహిత్యానికి సంబంధించిన, ఆధ్యాత్మిక అంశాలపై పాలు పుస్తకాలను స్వయంగా రచించడంతోపాటు, ఇతరులు రచించిన పుస్తకాలను కూడా సరస భారతి ద్వారా ప్రచురించడం చేస్తున్నారు.
సరస భారతి స్థాపించిన నాటి నుండి క్రమం తప్పకుండా ప్రతినెల సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. 2026 మార్చి 15వ తేదీ 195 వ కార్యక్రమంగా ముందస్తు ఉగాది వేడుకలను కవి సమ్మేళనాన్ని నిర్వహించారు.
ఏటా ఉగాది సందర్భంగా సరస భారతి నిర్వహించే వేడుకలలో
కవులను ప్రోత్సహించడం, సాహిత్యాన్ని ఆదరించడం, రచయితలను సత్కరించటం,
సంబంధిత రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి శ్రీ గప్పిడి దుర్గాప్రసాద్ వారి తల్లిదండ్రుల పేరిట జీవన సాఫల్య పురస్కారాలు ఉగాది పురస్కారాలు అందించడం జరుగుతొంది.
ఏటా సరస భారతి ఉగాది వేడుకలు :
ప్రతి సంవత్సరం ఉగాది కవి సమ్మేళనాలు, సాహిత్య సభలు, పుస్తకావిష్కరణలు నిర్వహిస్తూ తెలుగు భాషా వికాసానికి కృషి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాహిత్య చైతన్యాన్ని పెంపొందించడం, యువతలో రచనా ప్రతిభను వెలికితీయడం వారిని ప్రోత్సహించడం ఆయన ప్రత్యేకత.
సాహితీ కార్యక్రమాలకు ప్రోత్సాహం :
శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో అనేక సాహిత్య కార్యక్రమాలు, పురస్కార ప్రదానాలు, గురుపూజోత్సవాలు, సాంస్కృతిక వేడుకలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. పరిశోధనాత్మక దృక్పథంతో అనేక గ్రంథాలను రచించి, సంస్కృతి, చరిత్ర, ధార్మిక అంశాలపై విలువైన సాహిత్య సంపదను అందించారు.
అంతేకాకుండా యూట్యూబ్ వంటి వేదికల ద్వారా సాహిత్య, ధార్మిక, చారిత్రక అంశాలపై ప్రసంగాలు చేస్తూ తెలుగు భాషను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దేశ విదేశాల్లో కూడా “సరస భారతి” సంస్థను విస్తరించి, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేయడం ఆయన విశేష కృషిగా నిలిచింది.
విశేష సేవలకు గుర్తింపు :
తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణలో ఆయన చేసిన నిరంతర సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 శ్రీ పరాభవనవ సంవత్సర ఉగాది పురస్కారానికి ఎంపిక చేయడం ఆయన సాహితీ సేవలకు సరైన గుర్తింపుగా సాహితీ అభిమానులు భావిస్తున్నారు.
ఈ పురస్కారం శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికే కాకుండా ఉయ్యూరు ప్రాంతానికే గౌరవాన్ని తీసుకువచ్చింది. సాహిత్య సేవలో ఆయన మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సాహిత్య వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.
జతపరిచినవి :
1.శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారి ఫోటోలు
2. బయోడేటా పిడిఎఫ్
(జీవిత వివరాలు,రచించిన పుస్తక వివరాలు, సాహితీ సేవలకు సంబంధించినవి)
నమస్కారములతో
కార్యదర్శి,
సరసభారతి,
సాహిత్య-సాంస్కృతిక సంస్థ, ఉయ్యూరు.
