శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విజయవాడకు చెందిన దేవరకొండ నాగవర ప్రసాద్ పుల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను తాను ఏకలవ్య సంతానానికి చెందిన ఎరుకల కులస్తుడిగా పరిచయం చేసుకున్న ఆయన.. తమ జాతి మూల పురుషుడు ఏకలవ్యుడని పేర్కొన్నారు. తమ కులదేవత అయిన ఎరుకల నాంచారమ్మ ఇరుకు చెప్పడం వల్లే శ్రీనివాసుడి కల్యాణం జరిగిందనే ప్రసిద్ధి ఉందని గుర్తు చేశారు. వెంకటేశ్వర స్వామిని ప్రాణదైవంగా పూజించే తమ సామాజిక వర్గానికి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న దుష్ప్రచారం తీవ్ర మనస్తాపం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను గాయపరిచేలా జిగుప్సాకరమైన పదజాలాన్ని ఉపయోగించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ ఫిర్యాదులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. మంత్రి నారా లోకేష్.. టీటీడీ ఈఓ శ్యామలరావు.. చైర్మన్ బీఆర్ నాయుడు పేర్లను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. వీరితో పాటు ఈటీవీ అధినేత చెరుకూరి కిరణ్.. ఏబీఎన్ రాధాకృష్ణ.. మహా ఛానల్ వంశీకృష్ణ వంటి మీడియా ప్రముఖులపై కూడా ఫిర్యాదు చేశారు. లడ్డూ ప్రసాదానికి వ్యతిరేకంగా చర్చలు పెట్టి భక్తులు వినడానికే అసహ్యం కలిగేలా మాట్లాడిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ తేదీల్లో ఎవరెవరు ఏ విధంగా మాట్లాడారో పూర్తి వివరాలతో కూడిన నివేదికను పోలీసులకు అందజేశారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించినప్పటికీ.. రశీదు (Acknowledgment) ఇవ్వడానికి నిరాకరించారని.. దీనిపై తదుపరి న్యాయ పోరాటం చేస్తానని ప్రసాద్ వెల్లడించారు.
ప్రస్తుతం తాను మెడికల్ లీవ్‌లో ఉన్నట్లు తెలిపిన ప్రసాద్.. గతంలో శ్రీకాకుళం డీటీసీలో విధులు నిర్వహించినట్లు చెప్పారు. అక్కడి నుండి అనంతపురం పీటీసీకి బదిలీ చేసినా.. అనారోగ్య కారణాల వల్ల సెలవును పొడిగించుకుంటున్నట్లు వివరించారు. తాను స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) కోరుతూ దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం నుండి సరైన స్పందన రావడం లేదని ఆరోపించారు. మార్చి 31 లోపు తన రాజీనామాను ఆమోదించాలని కోరినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే లడ్డూ వివాదంపై సీఎం వ్యాఖ్యలు చేయడం వల్ల మనస్తాపానికి గురై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో చట్టపరంగా ముందుకు వెళ్లి బాధ్యులకు శిక్ష పడేలా చూస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also read
- పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి
- ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
- పెళ్లయిన ఐదు నెలలకే.. కానరాని లోకాలకు..
- Holi 2026: హోలీ రంగులు దేనికి సంకేతమో తెలుసా..? అసలు హోలీ రోజు ఆ 4 రంగులే వాడాలట
- నేటి జాతకములు 2 మార్చి, 2026





