SGSTV NEWS online
Hindu Temple HistorySpiritual

కృష్ణానదీ తీరాన నాగేశ్వరుడుగా వెలసిన శివుడు- పెదకళ్లేపల్లి క్షేత్రాన్ని దర్శిస్తే దోషాలన్నీ పరార్!


పెదకళ్లేపల్లిలో నాగేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర కుండాలు- నాగదోషాలను పరిష్కరించే నాగకుండం విశిష్టత ఇదే!


“అపుత్రస్య గతిం నాస్తి!” అన్నారు పెద్దలు. పితృ ఋణం తీర్చుకోవాలంటే సంతానాన్ని పొందాలని ధర్మశాస్త్రం చెబుతోంది. సత్సంతానంతోనే ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని వేదాలు కూడా చెబుతున్నాయి. అందుకే సత్సంతానాన్ని పొందడం కోసం మన సంప్రదాయం వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే కుజ గ్రహ దోషాలు, పూర్వీకులు చేసిన కొన్ని పొరపాట్లు, పూర్వజన్మల పాపఫలం వల్ల సంతానం కలగడంతో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటప్పుడు కొన్ని పరిహారాలు పాటించాలని పెద్దలు చెబుతారు. ఇందులో ముఖ్యంగా క్షేత్ర దర్శనం, తీర్థ స్నానం ప్రధానమైనవి. అలాంటి ఒక మహిమాన్వితమైన తీర్థ క్షేత్రం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

నాగకుండం

ఈ పేరులోనే నాగ శబ్దం ఉన్నందున ఈ కుండం నాగదోషాలను పరిహరించే కుండమని స్పష్టమవుతోంది. ఈ నాగకుండం ఎక్కడుంది? ఆ విశేషాలేమిటో చూద్దాం.

నాగకుండం ఎక్కడుంది?

పుణ్యక్షేత్రాలలో కనిపించే ఒక్కో దివ్యతీర్థం ఒక్కో ప్రత్యేక విశిష్టతను సంతరించుకుని ఉంటుంది. ఈ తీర్థాలను స్పృశించినంత మాత్రాన్నే మన పాపాలు పోగొట్టి దైవ సన్నిధికి చేరే భాగ్యాన్ని కలిగిస్తాయి. గత జన్మలలో ఉన్న దుర్గతులు పోగొట్టి ఉత్తమగతులు కల్పిస్తూ వుంటాయి. అలాంటి దివ్య తీర్థాలలో ఒకటి ‘పెదకళ్లేపల్లి’లో కనిపిస్తుంది. కృష్ణానదీ తీరంలో ఆవిర్భవించిన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ‘పెదకళ్లేపల్లి’ ఒకటి.

నాగేశ్వరుడుగా వెలసిన శివుడు

పెదకళ్లేపల్లిలో పరమేశ్వరుడు ‘నాగేశ్వరుడుగా స్పటిక లింగ రూపంలో, శిలా సర్ప రూపంలో కొలువై ఉండటం విశేషం. దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు నాగేశ్వరుడుగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.

కాశీ దర్శనఫలం

ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల కాశీ క్షేత్రాన్ని దర్శించిన ఫలం దక్కుతుందని విశ్వాసం. ఈ క్షేత్రంలో వెలసిన మహిమాన్వితమైన కుండాలు ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని మరింత పెంచుతున్నాయి.

మహిమాన్వితం ఈ పవిత్ర కుండాలు

పెదకళ్లేపల్లి నాగేశ్వర క్షేత్రంలో రుద్ర, భైరవ, బ్రహ్మ, చంద్ర, శుక, నాగ, అంబిక, శారద పేర్లతో కుండాలు కనిపిస్తాయి. ప్రతి కుండం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని దర్శనమిస్తుంది. ఇక్కడ వెలసి ఉన్న అన్ని కుండాలు విశిష్టమైనవి అయినప్పటికీ వాటిల్లో నాగకుండం మరింత మహిమాన్వితమైనదిగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.


నాగకుండం విశిష్టత

పెదకళ్లేపల్లి నాగేశ్వర క్షేత్రంలో పూజలందుకుంటున్న నాగేశ్వరుని మహా సంకల్పంతో ఏర్పడిన కుండంగా ఈ నాగకుండం ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా విశిష్టమైన అనేక తీర్థాలు నాగకుండంలో కలవడం వల్ల కూడా ఇందులో నీరు మహిమాన్వితమైనదని తెలుస్తోంది.

నాగకుండం మహిమ

పెదకళ్లేపల్లి నాగేశ్వర క్షేత్రంలో వెలసి ఉన్ననాగేశ్వరుని దర్శించుకునే ముందు ఈ నాగకుండంలోని నీరు శిరస్సున చల్లుకుంటే అనేక జన్మలుగా వెంటాడుతూ వస్తోన్న దోషాలు నశిస్తాయని విశ్వాసం. ఇక ఈ జలాన్ని తీర్థంగా స్వీకరించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి సత్సంతానం కలుగుతుందని విశ్వాసం. తద్వారా ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని పెద్దలు అంటారు. ఈ నాగకుండానికి ఇంతటి మహిమ ఉండడం వల్లనే ఎందరో భక్తులు ఇక్కడకు తరలి వచ్చి ఈ కుండంలోని తీర్థాన్ని సేవించి దోషాలు పోగొట్టుకుని సద్గతులు పొందుతున్నారు.

ఈ దివ్య తీర్థాన్ని మనం కూడా దర్శిద్దాం. తరిద్దాం.

ఓం నమః శివాయ!



Related posts