తూర్పు గోదావరి జిల్లా: పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్ తీసుకుని తిరిగి వస్తుండగా, జాతీయ రహదారి 216లోని పోలేకుర్రు చెకోపోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం పాలైంది. కోరంగి ఎస్ఐ పి. సత్యనారాయణ, స్థానికుల కథనం ప్రకారం.. యానాం పెదపూడి వీధికి చెందిన మహ్మద్ మోమినా తన్వీర్ (21), సయ్యద్ అఫ్రీన్ సుల్తానాలు పటవల పైడా విద్యా సంస్థలో ఎంబీఏ, ఎంసీఏ చదువుతున్నారు.
శుక్రవారం నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరూ ద్విచక్ర వాహనంపై కళాశాలకు వెళ్లి హాల్ టికెట్లు తీసుకున్నారు. తిరిగి వస్తుండగా పోలేకుర్రు చెకోపోస్టు వద్ద టిప్పర్ ఢీకొనడంతో తన్వీర్ కింద పడిపోయింది. ఆమె తలపై నుంచి టిప్పర్ వెళ్లిపోవడంతో నుజ్జునుజ్జు అయ్యి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా సుల్తానా రెండో వైపునకు పడడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతోంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
విషయం తెలుసుకున్న కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతురాలి తండ్రి జిలానీ యానాం మార్కెట్లో చికెన్ షాపు నిర్వహిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె అర్ధాంతరంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తన్వర్ సోదరుడికి రెండు నెలల క్రితం వివాహమైందని, ఇంతలోనే ఇంతటి విషాదం జరగడం దారుణమని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
చెకోపోస్టు నిర్వహణ వల్లే..
జాతీయ రహదారిలోని మలుపులో చెకోపోస్టు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపించారు. అటు అమలాపురం నుంచి, ఇటు యానాం నుంచి వాహనాలు వేగంగా వచ్చే ప్రాంతం, చెకోపోస్టు వద్ద అనేక బారికేడ్లు ఏర్పాటు చేయడం, నిర్వహణ సక్రమంగా చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, ప్రజాప్రతినిధులు స్పందించి చెకోపోస్టును సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





