SGSTV NEWS online
Spiritual

భగవద్గీత పుట్టిన పవిత్ర మాసం- దేవతల వరప్రసాదాల కేంద్రం- ‘మార్గశిర’ ప్రత్యేకత ఇదే!



Margasira Masam 2025 : ‘మాసానాం మార్గశీర్షోహం’ అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే మార్గశిర మాసం ఏడాదిలో వచ్చే అన్ని మాసాలకు శిరసు వంటిది అని అర్ధం. మార్గశిర మాసం లక్ష్మీనారాయణ స్వరూపమని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతిరోజూ శుభప్రదమైనదే! మార్గశిర మాసం విశిష్టత గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

మార్గశిర మాసం ఎప్పుడు?
నవంబర్ 21, శుక్రవారం నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో మొదటి రోజునే పోలి పాడ్యమిగా జరుపుకుంటారు. లక్ష్మీ నారాయణుల ఆరాధనకు ప్రధానమైన మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని శాస్త్రం చెబుతోంది.

మార్గశిరం అనే పేరు ఇలా వచ్చింది
మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి కారణంగా ఈ మాసానికి ‘మార్గశీర్ష’ లేదా ‘మార్గశిరమాసం అని పేరు వచ్చింది.

మహా పురుషులు జన్మించిన పవిత్ర మాసం
ఎందరో మహా పురుషులు ఈ మాసంలో జన్మించి ఈ మాసానికి మరింత ప్రత్యేకతను చేకూర్చారు. జ్ఞాన స్వరూపుడు దత్తాత్రేయుడు, పార్వతీదేవి మరో అవతారం అన్నపూర్ణాదేవి, కాశి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు మొదలగు మహానుభావులు ఈ మాసంలోనే అవతరించారు.

విశిష్ట గురువులు అవతరించిన పుణ్య మాసం
అలాగే ఆధ్యాత్మిక గురువులైన రమణ మహర్షి, నృసింహ సరస్వతి, పరాశరుడు, మాణిక్ ప్రభువు, శ్రీ సుందర చైతన్యానంద స్వామి, గురు గోవింద్ సింగ్ వంటి గొప్ప గురువులు జన్మించిన కారణంగా మార్గశిర మాసం మరింత విశిష్టత పొందింది.

భగవద్గీత పుట్టిన మాసం
అలాగే హిందూ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే భగవద్గీత పుట్టింది కూడా ఈ మాసంలోనే! ఈ మాసంలో ఎవరైతే శ్రీకృష్ణుని వద్ద ఆవునేతితో దీపాన్ని వెలిగించి, భగవద్గీత పారాయణ చేస్తారో వారికి విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెప్తుంది.

విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్యం
శ్రీ మహా విష్ణువుకి ప్రీతికరమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలాన్నిస్తుందని శాస్త్రవచనం.

తిరుప్పావై
వైష్ణవులకు ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన ధనుర్మాసం కూడా మార్గశిర మాసంలోనే వస్తుంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ధనుర్మాసం ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి మకర సంక్రాతి వరకు నెల రోజులపాటు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సమస్త వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై ఘనంగా జరుగుతుంది.

ఆండాళ్ కీర్తనలు
తిరుప్పావై సందర్భంగా శ్రీవారి భక్తురాలు ఆండాళ్ రచించిన 30 పాశురాలు ప్రతిరోజూ శ్రీవారి సన్నిధిలో తిరుప్పావై సేవలో పాడుతారు.

మరెన్నో పర్వదినాలు
ఇక హనుమ ఆరాధించే హనుమద్వ్రతం, మత్స్యద్వాదశి, వైకుంఠ ఏకాదశి కూడా ఈ మాసంలోనే జరుపుకుంటారు. అలాగే నడిచే దైవంగా పేరుగాంచిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహా స్వామివారి ఆరాధన కూడా ఈ మాసంలోనే జరుగుతుంది.

శరణమయ్యప్ప
ఇక అయ్యప్పస్వామిని ఆరాధించే మహా మండల పూజలకు, శబరిమల దీక్షలకు కూడా మార్గశిర మాసం ఉత్కృష్టమైనది.

శ్రీ వ్రతం
ఇక శ్రీ వ్రతం పేరిట మార్గశిర గురువారాలు చేసే లక్ష్మీపూజ ఐశ్వర్యకారకం. ఈ మాసంలో గురువారాల్లో చేసే లక్ష్మీపూజలు వల్ల దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదుడు, పరాశరుడు తెలిపినట్లు పురాణాల కథనం.

ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న మార్గశిర మాసం ఆధ్యాత్మిక సాధనకు అనువైనది. మార్గశిర మాసంలో చేసే పూజ, హోమం, అభిషేకం, ఇలా ఏ దైవకార్యం అయినా దానిని తానే స్వయంగా స్వీకరిస్తానని శ్రీకృష్ణుడు తెలిపినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తోంది.

ఇంతటి పవిత్ర మాసంలో మనం కూడా శాస్త్రంలో చెప్పినట్లుగా భక్తి శ్రద్ధలతో దైవారాధన చేద్దాం. సకల శుభాలు పొందుదాం.

జై శ్రీమన్నారాయణ!



Related posts