SGSTV NEWS online
Andhra PradeshCrime

మీరేం మనుషులు రా.. రూ.500 కోసం ఫ్రెండ్‌నే.. నెల్లూరులో ఘోరం..




నెల్లూరులో రూ.500 అప్పు వివాదం వల్ల ఒక ప్రాణం పోయింది. మద్యం మత్తులో స్నేహితుల మధ్య చెలరేగిన ఘర్షణ షాజహాన్‌ హత్యకు దారితీసింది. హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశారు. పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ దారుణం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

చిన్న విషయాలకే చంపుకోవడాలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. కేవలం రూ.500 రూపాయల అప్పు వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ దారుణ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో చెలరేగిన స్నేహితుల మధ్య ఘర్షణ హత్యకు దారితీయగా.. మృతుడి స్నేహితులే ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

అసలేం జరిగింది..?
కోవూరు పట్టణానికి సమీపంలోని వేగురు కాలువ ప్రాంతానికి చెందిన రాజా, షాజహాన్ మంచి స్నేహితులు. ఇటీవల షాజహాన్ రాజా వద్ద అవసరానికి రూ.500 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే అది తిరిగి చెల్లించలేదు. గత నెల 25న రాజా, షాజహాన్‌తో పాటు తమ స్నేహితులు మస్తాన్, సుబ్బయ్య, పెంచలయ్య కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న రాజా, షాజహాన్‌ను రూ.500 బాకీ గురించి అడిగాడు. షాజహాన్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మద్యం మత్తులో ఉన్న రాజా, అతని స్నేహితులు మస్తాన్, సుబ్బయ్య, పెంచలయ్య కలిసి షాజహాన్‌పై తీవ్రంగా దాడి చేశారు.

హత్య చేసి.. కాల్వలో మృతదేహం
దాడిలో షాజహాన్‌కు గాయాలు కావడంతో స్నేహితులంతా కలిసి అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయితే అర్ధరాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా నిందితులు మరోసారి షాజహాన్‌పై తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో షాజహాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు షాజహాన్ మృతదేహాన్ని నిందితులు వేగురు కాలువలో పడవేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

24 గంటల్లోనే..
తెల్లారేసరికి షాజహాన్ ఇంటికి రాకపోవడంతో ఫోన్ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కోవూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, 24 గంటల్లోనే మృతదేహాన్ని గుర్తించారు. తొలుత దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినప్పటికీ లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత కేవలం రూ.500 రూపాయల అప్పు వివాదమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టుకి హాజరుపరచినట్లు కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు

Also Read

Related posts