SGSTV NEWS online
CrimeTelanganaViral

Telangana: వరి పొలంలో ఎస్సై పరుగో పరుగు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు.. వీడియో వైరల్..



కొంతమంది పోలీసుల తీరు పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయేలా చేస్తుంది. మెదక్ జిల్లాలో పది రోజుల్లో ఇద్దరు ఎస్సైలు ఏసీబీకి పట్టుబడటం సంచలనం సృష్టించింది. టేక్మాల్ ఎస్సై రాజేష్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అయితే ఏసీబీ అధికారులను చూసిన అతడు తప్పించుకునేందుకు పరిగెత్తగా.. అధికారులు చేజ్ చేసి పట్టుకోవడం గమనార్హం.

ఉన్నత స్థాయిలో ఉన్న కొంతమంది పోలీసు అధికారుల లంచగొండి చర్యల వల్ల పోలీస్ వ్యవస్థపై సాధారణ ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. న్యాయంగా పనిచేసే అధికారులకూ వీరి చేతివాటం ఇబ్బందిగా మారుతోంది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు ఎస్సైలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం కలకలం సృష్టిస్తోంది


సినీ ఫక్కీలో..
తాజాగా టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై రాజేష్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఒక కేసు విషయంలో రూ.50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని ట్రాప్ చేశారు. అయితే ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్‌కు రావడాన్ని గమనించిన ఎస్సై రాజేష్, వారి నుంచి తప్పించుకోవడానికి స్టేషన్ నుంచి పరుగులు తీశారు. ఏసీబీ సిబ్బంది వెంటాడి ఛేజింగ్ చేసి, చివరికి ఓ వరి పొలంలో ఎస్సై రాజేష్‌ను పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ ఎస్సై పట్టుబడటంతో ఆగ్రహించిన స్థానికులు, గ్రామస్తులు టేక్మాల్ పోలీస్ స్టేషన్ ముందు బాణాసంచాలు పేలుస్తూ, ఎస్సైకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

10 రోజుల్లో రెండో ఘటన
ఎస్సై రాజేష్‌ అరెస్టు జరగడానికి కేవలం వారం రోజుల క్రితమే ఉమ్మడి మెదక్ జిల్లాలో మరొక ఎస్సై కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గత వారం ములుగు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై విజయ్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. కేవలం పది రోజుల స్వల్ప వ్యవధిలోనే జిల్లాలో ఇద్దరు ఎస్సైలు ఏసీబీ వలకు చిక్కడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


కొంతమంది అధికారుల చేతివాటం కారణంగా పోలీస్ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింటోందని, న్యాయంగా పనిచేసే సిబ్బందిపై కూడా ప్రజలకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనల వల్ల వ్యవస్థపై సాధారణ ప్రజలకు నమ్మకం పోతుంది. లంచగొండి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

Also read

Related posts