గుండెలపై పెట్టుకుని పెంచుకున్న కన్న కూతురు కులాంతర వివాహం చేసుకోవడాన్ని ఆ తండ్రి సహించలేకపోయాడు. ఆ పెళ్లికి సహకరించాడని అల్లుడి అన్నను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వధువు తండ్రితోపాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళ్తే..
రంగారెడ్డి, నవంబర్ 17: రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం ఎల్లంపల్లికి చెందిన ఎర్ర మల్లేష్‌కు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. మల్లేష్ మూడో కుమారుడు రాజశేఖర్ షాద్‌నగర్‌లో జాబ్ చేస్తున్నాడు. 10వ తరగతి చదివిన చిన్న కుమారుడు చంద్రశేఖర్ ప్రస్తుతం ఆటో నడుపుతున్నాడు. అయితే చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన కాగు వెంకటేశ్ కుమార్తె అయిన భవాని(19)ని ప్రేమించాడు. ఆమె డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. వీరిద్దరి కులాలు వేరుకావడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలో గత సెప్టెంబరు నెలలో ఇద్దరూ ఇళ్లనుంచి వెళ్లిపోయి మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించారు.
దీంతో వెంకటేశ్ తన కుమార్తె కిడ్నాప్ అయినట్లు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు కుటుంబాలను పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కానీ గ్రామ పంచాయిలో చంద్రశేఖర్, భవాని కలుసుకోవద్దని షరతు పెట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే నవంబర్ 5న వీరిద్దరూ మళ్లీ ఇళ్లనుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. కుమార్తె కులాంతర వివాహం వెంకటేశ్‌కు మింగుడుపడలేదు. వీరి పెళ్లికి చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ సహకారించాడని తెలుసుకుని అతడి హత్యకు ఐదుగురితో కలిసి ప్లాన్ వేశాడు.
నవంబర్ 12న సాయంత్రం రాజశేఖర్ విధులు ముగించుకుని ఇంటికొస్తున్న సమయంలో షాద్‌నగర్ సమీపంలో ఈ ముఠా అడ్డగించింది. చుట్టుముట్టి కొట్టడంతో స్పృహ కోల్పోయారు. వెంటనే రాజశేఖర్ కాళ్లు, చేతులను కట్టేసి కారులోకి ఎక్కించి తీసుకెళ్లారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం ఎమ్మనగండ్ల గేటు సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ రాజశేఖర్‌ను గడ్డికుప్పలో వేసి పెట్రోలు పోసి తగలబెట్టి పారిపోయారు. భర్త ఇంటికి రాకపోవడంతో రాజశేఖర్ భార్య షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవంబర్ 13న నవాబుపేట రైతు చంద్రయ్య పొలంలో సమీపంలో పాక్షికంగా కాలిన మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహానికి మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజశేఖర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహం అతనిదేనని నిర్ధారించారు. రంగంలోకి దిగిన షాద్‌నగర్ పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా అసలు బండారం బయటపడింది. భవాని తండ్రి వెంకటేష్‌తోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
- నవ జనార్ధనల క్షేత్రాల గురించి తెలుసా? ఒక్కసారి దర్శిస్తే సమస్త నవగ్రహ దోషాలు దూరం!
- నేటి జాతకములు..23 నవంబర్, 2025
- భగవద్గీత పుట్టిన పవిత్ర మాసం- దేవతల వరప్రసాదాల కేంద్రం- ‘మార్గశిర’ ప్రత్యేకత ఇదే!
- 2026లో లక్ష్మీ దేవి అనుగ్రహం వీరిపైనే.. కట్టలు కట్టలుగా డబ్బు సంపాదించడం ఖాయం!
- Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు




