SGSTV NEWS online
CrimeTelangana

Hyderabad: తాళ్లతో కట్టేసి, నోటికి ప్లాస్టర్.. రిటైర్డ్ కల్నల్ ఇంట్లో నేపాలీ గ్యాంగ్ బీభత్సం



Hyderabad:నగరంలో దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నమ్మకంగా ఇంట్లో పనికి చేరి, యజమానులకే ద్రోహం తలపెడుతున్న ఘటనలు పునరావృతమవుతున్నాయి. గతంలో సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో రెచ్చిపోయిన నేపాలీ ముఠాలు, అందినకాడికి దోచుకెళ్లిన ఉదంతాలు మరువకముందే, తాజాగా సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో అలాంటి ఘటనే వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే, కార్ఖానా ప్రాంతంలో నివాసముంటున్న రిటైర్డ్ ఆర్మీ కల్నల్ గిరి ఇంట్లో కొన్ని రోజుల క్రితం నేపాల్కు చెందిన దంపతులు పనిలో చేరారు. ఇంట్లో భారీగా డబ్బు, నగలు ఉన్నాయని సమాచారం తెలుసుకున్న ఆ దంపతులు, నిన్న అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు.

కల్నల్ గిరిని తాళ్లతో కట్టేసి, ఆయన మూతికి ప్లాస్టర్ వేశారు. అనంతరం ఇంట్లో ఉన్న 25 తులాల బంగారు ఆభరణాలు, 23 లక్షల రూపాయల నగదు దోచుకుని పరారయ్యారు. ఉదయం ఎంతసేపటికీ గిరి బయటికి రాకపోవడంతో, అనుమానం వచ్చిన పక్కింటి వారు లోపలికి వెళ్లి చూడగా, ఆయన చేతులు, కాళ్లు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి ఉండటం గమనించారు.

వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి (స్పాట్కు) చేరుకుని, పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితులైన నేపాలీ దంపతులు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు, వారి పూర్తి వివరాలు ఏమిటి అనే కోణంలో ఆరా తీస్తున్నారు. వారు ఎటువైపు పారిపోయారనే దానిపై సమాచారం సేకరిస్తూ, దర్యాప్తు ముమ్మరం చేశారు.

Also read

Related posts