విజయనగరం జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గరివిడి మండలం కోనూరులో ఓ పూరింటిలో అకస్మత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు అప్రమత్తమయ్యే లోపే నాలుగు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. జరిగిన ఈ ఘటనకు కారణం ఎవరో ఎవరికి తెలియలేదు. ఆ సమయంలో ఎవరూ వంట చేయకపోవడం. షార్ట్ సర్క్యూట్ అవ్వకపోవడంతో మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీశారు. చివరికి ఇళ్లలో చెలరేగిన మంటలకు కాకి కారణమని స్థానికులు తేల్చారు.
కార్తీక మాసం సందర్భంగా గ్రామస్తులు తమ తమ ఇళ్ల పై కార్తీక దీపాలు పెట్టారు. అలాగే పూరిపాకల ప్రక్కనే ఉన్న ఓ ఇంటి డాబాపై కూడా కార్తీక దీపాలు వెలిగించారు. ఈ క్రమంలోనే ఓ కాకి డాబా పై ఉన్న దీపాన్ని తడుముతూ అందులో ఒక దీపాన్ని ఎత్తుకెళ్లి పక్కనే ఉన్న తాటాకు ఇంటి పై వదిలేసింది. అలా తాటాకు పైకప్పు పై దీపం పడిపోవడంతో నిమిషాల్లోనే మంటలు ఎగసిపడి ఆ ఇంటిని చుట్టుముట్టాయి. మంటలు మరింత వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న మరో మూడు ఇళ్లను కూడా కమ్మేశాయి. పరిస్థితి గమనించిన గ్రామస్తులు నీళ్లతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే నాలుగు తాటాకు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి.
అందులో భాగంగా నంబూరి గోపి అనే యజమాని ఇంట్లో దాచిన లక్ష రూపాయల నగదు, అర తులం బంగారం బూడిదైంది. పొలం పనుల పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు డబ్బు ప్రమాదంలో నష్టం పోవడంతో లబోదిబోమంటున్నాడు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన తహసీల్దారు సీహెచ్. బంగార్రాజు సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. బాధితులకు ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒక చిన్న నిర్లక్ష్యం ప్రమాదానికి దారితీసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.
Also read
- Andhra: రిమాండ్ ఖైదీతో కలిసి టిఫిన్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత సీన్ ఇదే..
- Telangana: 21 ఏళ్ల నిహారిక ఇంట్లో ఒంటరిగా ఉంది.. దూరపు బంధువునని లోపలికి వచ్చాడు.. ఆపై
- Andhra: సీబీఐ నుంచంటూ రిటైర్డ్ ఉద్యోగికి వీడియో కాల్.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది..
- Andhra: ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 32 మందికి పైమాటే.. ఏం చెత్త పనిరా దరిద్రుడా?
- Andhra News: కాకి పెట్టిన మంట..! కాలి బూడిదైన నాలుగిళ్లు.. అసలు మ్యాటర్ తెలిస్తే..





