SGSTV NEWS online
Andhra PradeshCrime

మదనపల్లెలో కిడ్నీ రాకెట్‌ కలకలం.. గ్లోబల్ హాస్పిటల్‌లో గుట్టుగా యవ్వారం!

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ ఉదంతం బట్ట బయలు అయ్యింది. SBI కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రి వేదికగా కిడ్నీ మార్పిడి దందా కొనసాగింది. కిడ్నీ తొలగింపుతో మహిళ మృతి చెందడంతో యవ్వారం బయటకు వచ్చింది. కిడ్నీ రాకెట్ ముఠాను, ఆసుపత్రి నిర్వహకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా ఎంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా ఈ అక్రమ వ్యాపారం సాగుతుందో కనిపెట్టే పనిలో ఇంటరాగేషన్ కొనసాగుతోంది..

మదనపల్లి, నవంబర్‌ 12: మదనపల్లిని కిడ్నీ మార్పిడి చేసే ముఠా వ్యవహారం వణికించింది. ఒక మహిళ కిడ్నీని తీసి మరొకరికి మార్చే క్రమంలో కిడ్నీ దాత మహిళ మృతి చెందడంతో ఈ వ్యవహారం బయటపడింది. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలరంగడు, పుంగనూరు డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలాజీ నాయక్ లు ఈ యవ్వారంలో కీలకమని ప్రాథమిక విచారణలో తేలింది. తమవద్దకు డయాలసిస్ చేసుకోడానికి వచ్చే ధనవంతులైన కిడ్నీ బాధితులను టార్గెట్ చేసి.. ఈ ముఠా కిడ్నీ అమ్మకాలను ప్రోత్సహించినట్టు తెలుస్తుంది. డబ్బు ఖర్చు పెట్టుకుంటే కిడ్నీ ఏర్పాటు చేయిస్తామని బేరాలు కుదుర్చుకున్న ముఠా ఈ మేరకు విశాఖపట్నం మధురవాడకు చెందిన కిడ్నీ బ్రోకర్లతో సంప్రదింపులు జరిపారు. పెళ్లి పద్మ, కాకర్ల సత్య, వెంకటేష్ లతో వ్యాపారం మాట్లాడుకుని కిడ్నీ దాతలు ఏర్పాటు చేసుకున్నట్లు విచారణ లో తేలింది. బ్రోకర్ల ద్వారా వైజాగ్ నుంచి మదనపల్లికి రప్పించే కార్యకలాపాలు కొనసాగించినట్లు తేలింది.

ఈ నేపథ్యంలో మదనపల్లె SBI కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న గ్లోబల్ ఆసుపత్రిలో డాక్టర్ అవినాష్, డాక్టర్ శాశ్వతి అక్కడ పనిచేసే నీరజ్ అనే మధ్యవర్తితో ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్నట్లు విచారణ లో వెల్లడైంది. విశాఖ మధురవాడకు చెందిన సూరిబాబు భార్య యమున కిడ్నీ తీసుకునేందుకు బేరం కుదుర్చుకుని, అక్కడి నుంచి ఆదివారం మదనపల్లికి యమునను రప్పించారు. మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం యమున కిడ్నీ తీసే సమయంలో వైద్యం వికటించి మృత్యువాత పడింది. ఈ విషయాన్ని భర్త సూరిబాబుకు తెలియకుండా, విషయాన్ని బయటకు పొక్కనీయకుండా గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని వైజాగ్ కు తరలించే ప్రయత్నం చేసారు.

విషయాన్ని పసిగట్టిన మృతురాలి భర్త సూరిబాబు 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిరుపతి ఈస్ట్ సిఐ శ్రీనివాసులు ఆరా తీశారు. మృతదేహం వివరాలు రాబట్టి విచారణ ప్రారంభించారు. మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రి ఆసుపత్రి వేదికగా మదనపల్లి ప్రభుత్వాసుపత్రిలోని డయాలసిస్ సెంటర్ ఇన్ ఛార్జ్ బాలరంగడు, పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ ఇంచార్జి బాలాజీ నాయక్ ల ప్రమేయంతో ఇదంతా జరుగుతోందని గుర్తించారు. గ్లోబల్ ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ అవినాష్, డాక్టర్ శాశ్వతి, నీరజ్ లను అదుపులో తీసుకుని మదనపల్లి టూటౌన్ పోలీసులకు అప్పగించారు. మదనపల్లి డిఎస్పీ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తున్నారు. గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ అవినాష్ తండ్రి డాక్టర్ ఆంజనేయులు చిత్తూరు డిసిహెచ్ఎస్ గా పనిచేయగా.. ఎలాంటి అనుమతులు పొందకుండానే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించి రూ లక్షల్లో సంపాదించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు పోలీసు విచారణ లో తేలాల్సి ఉంది.

Also Read

Related posts