రైస్ పుల్లింగ్ పేరుతో కోట్లు సంపాదించవచ్చని నమ్మించి ఒక వ్యక్తి వద్ద 75 లక్షలు దండుకుని పరారయ్యారు కేటుగాళ్లు. చెంబు చూపించి కనబడకుండా పోవడంతో మోసపోయానని ఆలస్యంగా గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ మోసం నిజామాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండల కేంద్రానికి చెందిన దమన్నగారి సాయికృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు బంధువైన నర్సింగ్ రావు ద్వారా నెల్లూరు జిల్లాకు చెందిన యతిరాజుల రాఘవేంద్ర, శ్రీరామరాజు పరిచయం అయ్యారు. ఎన్నో మహిమలున్న రైస్ పుల్లింగ్ యంత్రం రామవేంద్ర, శ్రీరామరాజు వద్ద ఉందని నర్సింగ్ రావు.. సాయికృష్ణకు చెప్పాడు. ఈ యంత్రం ఎవరి వద్ద ఉంటే వారు కోటీశ్వరులు అవుతారని నమ్మబలికారు. దీంతో రైస్ పుల్లింగ్ యంత్రం తనకు కావాలని సాయికృష్ణ కోరాడు. ఈ క్రమంలో వీరు ముగ్గురు కూకట్‌పల్లిలో సాయికృష్ణకు ఇత్తడి చెంబు, తాంబాళం రూపంలో ఉన్న వస్తువులను చూపించి అదే రైస్ పుల్లింగ్ యంత్రమని నమ్మించారు. కొన్ని రసాయనాలు ఉపయోగించి బియ్యం గింజలు ఆకర్షించదాన్ని, కొవ్వత్తి వెలగడాన్ని చూపించారు. రైస్ పుల్లింగ్ యంత్రం ఇవ్వడానికి రూ.75 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో సాయికృష్ణ విడతల వారీగా ఆ ముగ్గురికి ఫోన్‌పే ద్వారా రూ.75లక్షలు చెల్లించాడు. డబ్బులు చెల్లించే క్రమంలో సాయికృష్ణను గుంటూరు, నెల్లూరు ప్రాంతాలకు తీసుకువెళ్లి హిప్నాటిజం చేసి వారి మాటలు నమ్మేలా చేశారు.
డబ్బులు ఇచ్చినప్పటికీ రైస్ పుల్లింగ్ యంత్రం తనకు ఇవ్వకపోవడంతో సాయికృష్ణ పలుమార్లు వారిని గట్టిగా అడిగాడు. ముహూర్తాలు సరిగా లేవని పలుమార్లు దాటవేశారు. అయితే తాను మోసపోయానని గ్రహించి నందిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో నందిపేట పోలీసులు ముగ్గురు నిందితులతో ఒకరైన యతిరాజుల రాఘవేంద్రను సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి బస్టాప్ దగ్గర పట్టుకుని అరెస్టు చేశారు. అతడిని మంగళవారం కోర్టులో హాజరుపర్చి రిమాండుకు తరలించారు. మరో ఇద్దరు శ్రీరామరాజు, నర్సింగరావులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
Also Read
- వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి చూడగా..
- పట్టపగలు రెచ్చిపోయిన దొంగలు.. రెప్పపాటులో స్కూటీ డిక్కీలో రూ.8 లక్షలు మాయం..!
- నడిరోడ్డుపై బైక్‌పై విన్యాసాలు వద్దన్న పాపానికి.. వాహనదారులపై రెచ్చిపోయిన పోకిరిలు..!
- Ugadi Rasi Phalalu: పరాభవనామ సంవత్సరంలో పన్నెండు రాశుల ఆదాయం, వ్యయంతో పాటు అదృష్ట సంఖ్యలు, రోజులు వివరాలు!
- Lifestyle: రాత్రి నిద్ర పట్టడం లేదా? ఈ ఒక్క మంత్రం చదివితే చాలు గాఢ నిద్రలోకి.. అద్భుతమైన ఫార్మూలా!





