SGSTV NEWS online
Andhra PradeshCrime

‘హౌ టు కిల్ ఓల్డ్ లేడీ’.? యూట్యూబ్‌లో చూసి అత్తను హ‌త‌మార్చిన కోడ‌లు. షాకింగ్ సంఘ‌ట‌న



Visakhapatnam: స‌మాజంలో రోజురోజుకీ నేర ప్ర‌వృత్తి పెరుగుతోంది. చిన్న చిన్న కార‌ణాల‌కే మ‌నుషుల‌ను హ‌త‌మార్చుతున్నారు. తాజాగా విశాఖ‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న అందరినీ షాక్‌కి గురి చేసింది.

66 ఏళ్ల మ‌హిళ మ‌ర‌ణం
విశాఖ నగరంలోని అప్పన్నపాలెం వర్షిణి అపార్ట్‌మెంట్‌లో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. 66 ఏళ్ల జయంతి కనకమహాలక్ష్మి అనే వృద్ధురాలు శుక్రవారం ఉదయం మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. మొదట ఇది ప్రమాదమని అనుకున్న పోలీసులు, విచారణలో బయటపడిన నిజాలు విని దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ వృద్ధురాలి మ‌ర‌ణం ప‌క్కా ప్లాన్ అని, అదంతా కోడ‌లి నిర్వాక‌మేన‌ని వెల్ల‌డైంది.

“అత్త చాడీలు చెబుతోంది” అని క‌క్ష పెంచుకుని
లలిత అనే మహిళ తన అత్త కనకమహాలక్ష్మిపై తీవ్రమైన ద్వేషం పెంచుకుంది. “తనపై భర్తకు చాడీలు చెబుతోందని” భావించిన ఆమె ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం సాధారణ మనస్కురాలిగా ఉండే లలిత, యూట్యూబ్‌లో “హౌ టు కిల్ ఓల్డ్ లేడీ” వంటి వీడియోలను చూసింది. ఈ క్ర‌మంలోనే 6వ తేదీ సాయంత్రం పెట్రోలు కొనుగోలు చేసి ఇంట్లో దాచి పెట్టింది.

ముందుగా పిల్లలను తప్పించేసి.. అత్తను కుర్చీలో కట్టేసి…
7వ తేదీ ఉదయం లలిత భర్త బయటకు వెళ్లిన‌ తరువాత, ఇంట్లో ల‌లిత తల్లి, ఇద్దరు పిల్లలు, అత్త ఉన్నారు. “నానమ్మతో దాగుడుమూతలు ఆడుదాం” అని పిల్లలకు చెప్పి, వారిని గదుల్లోకి పంపించింది. అత్త కనకమహాలక్ష్మిని కుర్చీలో కూర్చోబెట్టి చేతులు, కాళ్లు బిగించి కట్టేసింది. కళ్లకు గంతలు కట్టి, పెట్రోలు పోసి నిప్పంటించింది. అరుపులు బయటకు వినిపించకుండా టీవీ వాల్యూమ్‌ పెద్దగా పెట్టింది.

మంటల్లో కేకలు..
మంటల్లో చిక్కుకున్న కనకమహాలక్ష్మి తాళ్లు కాలిపోవడంతో విడిపోయాయి. తీవ్రంగా కేకలు వేస్తూ దేవుడి గది వైపు పరుగెత్తింది. దీంతో అక్కడున్న మనవరాలికి కూడా గాయాలు అయ్యాయి. ఇదంతా జరుగుతుండగా లలిత తల్లి బాత్‌రూంలో ఉంది. కాసేపటికి బయటకు వచ్చేసరికే కనకమహాలక్ష్మి విగతజీవిగా నేలపై పడిపోయింది. లలిత వెంటనే పిల్లలకు “టీవీ వైర్లు తగిలి నానమ్మ కాలిపోయింది” అంటూ అబద్ధం చెప్పి నమ్మించింది.

హత్య వెనుక యూట్యూబ్ క్లూ
మొదట లలిత “షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయి” అని పోలీసులకు చెప్పింది. కానీ ఎదురింటి వ్యక్తి చెప్పిన వివరాలు ఆమె కథను తారుమారు చేశాయి. మంటలు ఆర్పేందుకు వచ్చిన వ్యక్తిని లలిత అడ్డుకుంది దీంతో పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది. విచారణలో ఆమె ఫోన్‌ను పరిశీలించగా యూట్యూబ్‌లో “హౌ టు కిల్ ఓల్డ్ లేడీ” అని సర్చ్ చేసిన రికార్డులు కనిపించాయి. చివరికి లలిత తాను చేసిన నేరాన్ని అంగీకరించింది. “అత్త నన్ను మాటలతో బాధించేది… భర్త దగ్గర నా పేరును చెడగొట్టేది… అందుకే ఇలా చేశాను” అంటూ క్షమాపణలు అడిగింది.

చివరికి జైలు

పోలీసులు లలితను హత్యా నేరం కింద అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. విశాఖలో ఈ కేసు పెద్ద సంచలనం రేపింది. సోష‌ల్ మీడియాలో ఉండే ప్రమాదకర కంటెంట్ మనిషి మనస్తత్వాన్ని ఎలా మార్చగలదో ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ఒక చిన్న కక్ష… ఒక ఆలోచనల లోపం… రెండు కుటుంబాల జీవితాలను శాశ్వతంగా చిద్రమయ్యేలా చేసింది.

Also Read

Related posts