శివుడు అంటే శుభం, సౌమ్యం. హిందువుల ఆరాధ్య దైవాలలో ప్రథముడైన ఆ మహాశివుడు కొలువైన పంచారామ క్షేత్రాలలో ఒకటైన శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయం అత్యంత విశిష్టమైనది. తారకాసుర సంహారం తర్వాత శివలింగం పడిన ప్రదేశాలలో ఇది ఒకటి. తూర్పు గోదావరి జిల్లా, సామర్లకోట రైల్వే స్టేషన్కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం చరిత్ర, శిల్పకళా వైభవం, స్థల పురాణ రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తారకాసుర సంహారం అనంతరం రాక్షసుడి కంఠంలోని ఆత్మలింగం ఐదు ప్రదేశాలలో పడింది. అందులో ఒక ప్రదేశమే సామర్లకోట. ఈ లింగాన్ని సాక్షాత్తు కుమారస్వామి (సుబ్రహ్మణ్యస్వామి) ప్రతిష్టించడం వలన ఈ ప్రాంతం మొదట కుమారేశ్వరంగా మారింది. కాలక్రమేణా ఇది కుమారారామంగా ప్రచారంలోకి వచ్చింది.
చాళుక్య రాజు నిర్మాణం:
ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజు అయిన భీముడు నిర్మించారు. ఈయన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని కూడా నిర్మించడం విశేషం. అందుకే ఈ రెండు ఆలయాల నిర్మాణ శైలి, ఉపయోగించిన రాతి రకం ఒకే విధంగా ఉండటాన్ని గమనించవచ్చు. చాళుక్య భీముడు నిర్మించడం వల్ల ఇక్కడి స్వామివారు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధిచెందారు. ఈ మందిరం నిర్మాణం సామాన్య శకం 892 లో ప్రారంభమై సుమారు 922 వరకు కొనసాగింది.
కాకతీయుల పునర్నిర్మాణం:
సామర్లకోట ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్పకళా వైభవాన్ని కలిగి ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు కూడా ఈ మందిరాన్ని కొంత పునర్నిర్మించారు. ఇక్కడ తూర్పు చాళుక్యులనాటి శిల్పకళతో పాటు కాకతీయుల నాటి శిల్ప కళను కూడా సులభంగా గుర్తించవచ్చు.
ఆలయ విశిష్టతలు
శివలింగం ప్రత్యేకత: ఇక్కడి శివలింగం సున్నపు రాయిచే నిర్మితమై, తెల్లని రంగులో ఉంటుంది. ఇది దాదాపు 14 అడుగుల ఎత్తు కలిగి, రెండంతస్తుల మండపం వరకు విస్తరించి ఉంటుంది. శివలింగం అంతకంతకూ పెరిగిపోతుండటంతో, శిల్పులు దాని పైభాగాన చీల కొట్టారనే(ఒకటి ఒక చిన్న ఇనుప కడ్డీని గోడలోకి లేదా చెక్కలోకి కొట్టడం) కథ స్థానికంగా ప్రచారంలో ఉంది. భక్తులు మొదట మొదటి అంతస్తులో లింగ దర్శనం చేసుకుని, ఆపై క్రింది అంతస్తులో లింగ పాద భాగాన్ని దర్శించుకుంటారు.
దేవతలు: ఇక్కడి శివుడిని కుమార భీమేశ్వరుడు అని పిలవగా, అమ్మవారి పేరు బాలా త్రిపురా సుందరి. క్షేత్ర పాలకుడు మాండవ్య నారాయణుడు. ఈశ్వరుడు ఇక్కడ ‘వామదేవ’ స్వరూపుడుగా, యోగ లింగంగా వెలశాడు.
సూర్య కిరణాలు: రెండు అంతస్థులు కలిగిన ఈ ఆలయంలోని శివలింగం మీద చైత్ర, వైశాఖ మాసాల్లో ఉభయ సంధ్యల్లో సూర్య కిరణాలు నేరుగా పడడం మరో విశేషం.
శిల్పకళా అద్భుతాలు: ఆలయ ఆవరణలో ఉన్న నూరు స్తంభాల మండపంలో ఏ రెండు స్తంభాలు కూడా ఒకే పోలికతో ఉండవు. ఇది ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని చాటుతుంది. అలాగే, ఊయల మండపంలో ఉన్న రాతి ఊయలను ఊపితే అది ఊగుతుంది.
కోనేరు: ఈ ఆవరణలోని భీమగుండంలో స్నానం చేస్తే పాపహరమే కాకుండా, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఉత్సవాలు
ప్రతి సంవత్సరం శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి మరియు బాలాత్రిపురసుందరి అమ్మవారికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. అయిదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నంది వాహనంపై, అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు, అభిషేకాలు విరివిగా జరుగుతాయి.
