SGSTV NEWS online
CrimeTelangana

Telangana: మీరేం మనుషులురా.. మూగజీవాలకు విషం పెట్టి.. దారుణంగా..



భద్రాచలంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆహారంలో విష గుళికలు కలిపి పెట్టడంతో పదుల సంఖ్యలో వీధి కుక్కలు, పిల్లులు మృత్యువాత పడ్డాయి. కుక్కల బెడద తొలగించుకునేందుకే ఈ క్రూరత్వం జరిగిందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను పట్టుకోవాలని స్థానికులు, జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అభం శుభం తెలియని, నోరు లేని మూగ జీవాలపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. భద్రాచలం పట్టణంలోని రెవెన్యూ కాలనీలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికులను తీవ్రంగా కలచి వేసింది. రెవెన్యూ కాలనీ వీధుల్లో గుర్తు తెలియని వ్యక్తులు తినే ఆహారంలో విషపూరిత గుళికలు కలిపి పెట్టారు. ఆహారం అనుకుని వాటిని తిన్న వీధి జంతువులు, పిల్లులు క్షణాల్లోనే విగత జీవులుగా మారాయి.కాలనీవాసులు చూస్తుండగానే ఒక్కొక్కటిగా పదుల సంఖ్యలో మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి.

అడ్డు తొలగించేందుకేనా?
ఈ దారుణానికి ఎవరు ఒడిగట్టారు అనే దానిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వాటిని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో కొందరు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంతువులపై ఈ విధంగా క్రూరత్వం చూపిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని జంతుప్రేమికుడు ఉదయ్ కుమార్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణ
జంతు ప్రేమికుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషాదానికి కారణమైన విషహారంతో పాటు మృతి చెందిన పిల్లులు, కుక్కల కళేబరాలను పోస్టుమార్టం నిమిత్తం భద్రపరిచారు. మూగజీవాల పట్ల ఇంతటి క్రూరత్వం చూపిన వారిని త్వరగా గుర్తించి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు, జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read

Related posts